నిర్మల్/బాసర(ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ఐదోరోజుకు చేరింది. సమస్య పరిష్కారంపై అధికార వర్గాలు, విద్యార్థుల నుంచి భిన్నమైన ప్రకటనలు వెలువడ్డాయి. శనివారం ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలీకృతమైనట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. వర్సిటీలోని సాక్ భవనంలో శనివారం విద్యార్థులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న మంత్రి.. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
విద్యార్థులందరూ సోమవారం నుంచి తరగతులకు హాజరుకానున్నట్లు తెలిపారు. 12 డిమాండ్లతోపాటు మరికొన్ని సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరారని, అయితే రేపటిలోగా కేటీఆర్ లెటర్ అందేలా చూస్తామన్నారు. మరోపక్క.. శనివారం నాటి చర్చలు విఫలమయ్యాయని, తమ ఆందోళన యథాతథంగా కొనసాగుతుందని విద్యార్థులు మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు.
ఏవోను తొలగిస్తూ ఉత్తర్వులు
కొన్నేళ్లుగా ట్రిపుల్ ఐటీ ఏవోగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్వరరావును తొలగించి బాధ్యతలను నూతన డైరెక్టర్ సతీశ్‌కుమార్‌కు అప్పగించినట్లు వర్సిటీ వీసీ రాహుల్ బొజ్జా శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆందోళనల వ్యవహారంలో బాధ్యతాయుతంగా పనిచేయకపోవడంతో రాజేశ్వరరావును విధుల నుంచి తొలగించారనే ఆరోపణలున్నాయి.
మోదీజీ మీరైనా స్పందించండి..
‘నాలుగు రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లకు సమాధానం ఇవ్వట్లేదు. మీరైనా స్పందించండని కోరుతున్నాం..’ అంటూ బాసర విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర విద్యాశాఖ మంత్రితోపాటు సీఎంవో, కేటీఆర్, సబితారెడ్డికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
అమ్మలా బాధేస్తోంది: సబితారెడ్డి
విద్యార్థులు ఆందోళన విరమించాలంటూ మంత్రి సబితాఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా ఓ లేఖను పంపించారు. ‘కోవిడ్‌తో సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ఉంటే.. మంత్రిగానే కాకుండా ఓ అమ్మలా బాధేస్తోంది, ఇప్పటికైనా ఆందోళన విరమించాలి’ అని కోరారు.
ట్రిపుల్ ఐటీ.. ఉద్యమంలో ‘క్రియేటివిటి’
ఐదోరోజైన శనివారం విద్యార్థులు వినూత్నంగా ఆందోళన కొనసాగించారు. అందరూ పుస్తకాలు పట్టుకుని వచ్చారు. తమ సమస్యల్ని ఆర్ట్స్, బ్యానర్స్, డూడుల్స్, మీమ్స్, కవితలు, పాటల రూపంలో ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితులను కళ్లకు కట్టించేలా కళను ప్రదర్శించారు. వాటిని తమ ట్విట్టర్ అకౌంట్, యూట్యూబ్ చానళ్ల ద్వారా సోషల్‌మీడియాలో ఉంచారు. రోజంతా ఎర్రటి ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అయినా విద్యార్థులు దీక్షను కొనసాగించారు. ఐదురోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళన సాగిస్తున్న విద్యార్థుల్లో పలువురు నీరసిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment