సాక్షి, నిర్మల్: బాసర ఐఐఐటీ విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులు చర్చలు జరిపారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని స్టూడెంట్ ఆక్టివిటి సెంటర్‌లో వెయ్యి మంది విద్యార్థులతో ఈ సమావేశం నిర్వహించారు. విద్యార్ధులతో తమ డిమాండ్లపై ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ భేటీలో మంత్రితో పాటు కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ఐఐఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ పాల్గొన్నారు.
విద్యార్థుల 12 డిమాండ్లలో 60శాతం నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం తమ బాధ్యతని పేర్కొన్నారు. అయితే సమస్యల పరిష్కారానికి పట్టుబడుతున్న విద్యార్థులు రెగ్యులర్ అధ్యాపకులు, వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. కానీ వీసీ నియామకం ఇప్పట్లో కుదరదని అధికారులు చెప్పారు. దీంతో మంత్రి, అధికారులు హామీపై స్పష్టత లేదని విద్యార్థులు చెబుతున్నారు. కాగా 12 డిమాండ్ల పరిష్కారం కోసం ఐఐటీ విద్యార్థులు గత అయిదు రోజుల నుంచి నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.
సీఎం సానుకూలంగా ఉన్నారు: మంత్రి సబితా
అదే విధంగా ఆందోళన విరమించాలని బాసర ఐఐఐటీ విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ప్రభుత్వంతో చర్చించాలని, విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. ‘విద్యార్థులు ఎండలో ఎండుతున్నారు. వానలో తడుస్తున్నారు. వారిని చూస్తుంటే బాధేస్తోంది. కోవిడ్ కారణంగా సమస్యలు పరిష్కరించడం జాప్యమైంది. మీ సమస్యలను తక్కువగా చూపే ఉద్దేశం లేదు. ట్రిపుల్ ఐటికి డైరెక్టర్‌గా సతీష్ కుమార్‌ను నియమించింది. మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్నత విద్యశాఖ వైస్ చైర్మన్ వెంకటరమణను పంపింది. సమస్యలను పరిష్కరించడానికి సీఎం సానుకూలంగా ఉన్నారు. అందోళన విరమించండి’ అంటూ పిలుపునిచ్చారు.
అయిదోరోజు ఆందోళనలు
మరోవైపు రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్‌ఐటీ అయిదు రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనుకడుగు వేయమంటూ ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు అయిదో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. ప్రధాన ద్వారం వద్దనే రోజంతా బైఠాయించి, మౌనదీక్ష కొనసాగించారు. విద్యార్థులంతా ఒకేమాటపై నిలబడి, మూకుమ్మడిగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ రావాలంటూ ప్లకార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. కొందరు పోలీసులు విద్యార్థులుగా వచ్చి ఆందోళనను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment