బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బైఠాయించిన విద్యార్థులు
బాసర/సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్ల సాధన కోసం ఆదివారం కూడా తమ నిరసన కొనసాగించారు. విద్యార్థులు శనివారం రాత్రి భోజనం బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసింది. ఆదివారం ఉదయం వారు ఫలహారం కూడా చేయలేదు. డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.
అయితే మధ్యాహ్నం తల్లిదండ్రులు, ఎస్జీసీ కమిటీ విన్నపం మేరకు భోజనం చేశామన్నారు. అయితే భోజనం చేసినంత మాత్రాన ఆందోళన విరమించినట్టు కాదని ఈ1, ఈ2 విద్యార్థులు ఒక వీడియోను విడుదల చేశారు. ఫుడ్‌పాయిజన్ జరిగిన మెస్‌ల కాంట్రాక్టు రద్దు చేయడంతోపాటు మెస్‌ల నిర్వహణ నుంచి ప్రస్తుతం ఉన్న వారిని తొలగించాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం..
ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. ట్రిపుల్ ఐటీలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం విద్యార్థులకు అవసరమయ్యే 3 వేల లాప్‌టాప్‌లకు రూ.9 కోట్లు కావాల్సి ఉంటుందని, ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు.
విద్యార్థులను రెచ్చగొట్టేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా, అవసరమైతే బర్తరఫ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు వారి సమస్యలను డైరెక్టర్ సతీశ్‌కుమార్ దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు సోమ, బుధ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు సమయం ఇస్తామని తెలిపారు. కాగా, విద్యార్థులతో రాతరి పొద్దుపోయాక డైరెక్టర్ సతీశ్ చర్చించారు. విద్యార్థుల సమస్యలను సోమవారం నుంచి పరిష్కరిస్తామని, విద్యార్థులు యధావిధిగా తరగతులకు హాజరవుతారని ప్రకటించారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి..
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment