బాసర ఆర్జీయూకేటీ ప్రధానద్వారం వద్ద బైఠాయించిన విద్యార్థులు
సాక్షి, నిర్మల్/బాసర: ‘మేమేమైనా రాజకీయ నాయకులమా? మాకు రాజకీయం చేయా ల్సిన అవసరం ఏముంది..? ఇది మీ యూనివర్సిటీ కాదా! మేం మీ విద్యార్థులం కాదా! సమస్యలను పరిష్కరించాలని అడిగే హక్కు కూడా మాకు లేదా?’ అంటూ బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్‌ఐటీ) విద్యార్థులు వరుసగా రెండోరోజూ ఆందోళన కొనసాగించారు. ‘కలెక్టర్ వస్తే.. విద్యాశాఖ మంత్రి చెబితే మా సమస్యలకు శాశ్వత పరిష్కారం తీరుతుందన్న నమ్మకం పోయింది. సీఎం లేదా మంత్రి కేటీఆర్ వర్సిటీకి రావాలి, రెగ్యులర్ వీసీని నియమించాలి, మాకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలి.
ఇవే మా ప్రధాన డిమాండ్లు. ఇవి తీరే వరకు వెనకడుగు వేసేది లేదు’ అని స్పష్టంచేశారు. ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలంటూ విద్యార్థులు బుధవారం ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో ఆందోళన కొనసాగించారు. ఉదయాన్నే ప్రధాన ద్వారం వద్దకు విద్యార్థులంతా చేరుకున్నారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు వద్దే రోజంతా బైఠాయించారు. రాత్రయినా.. వర్షం పడుతున్నా.. గొడుగులు పట్టుకుని అలాగే ఆందోళన కొనసాగించారు.
బుధవారం రాత్రి వర్షంలోనూ ఆందోళన కొనసాగిస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
మంత్రితో మాట్లాడించినా..
నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ.. అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి ఆర్జీయూకేటీకి వెళ్లారు. కొందరు విద్యార్థులతో చర్చలు జరిపారు. మంత్రి సబితారెడ్డితో మాట్లాడించారు. ప్రస్తుతం విద్యార్థులు చెబుతున్న 12 డిమాండ్లలో రెండు, మూడు తక్షణమే పరిష్కరిస్తామని, మిగితావి ఇప్పట్లో చేయలేమని చెప్పారు. ఇందుకు విద్యార్థులు ఒప్పుకోలేదు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సీఎం లేదా మంత్రి కేటీఆర్ వచ్చేదాకా తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టంచేశారు.
సంబంధిత వార్త: బాసర ట్రిపుల్ ఐటీ: స్పందించిన కేటీఆర్.. ఆపై చర్చలు విఫలం..
మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్
చర్చలు సఫలం..: కలెక్టర్
ఆర్జీయూకేటీ విద్యార్థులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని నిర్మల్ కలెక్టర్ ముషరఫ్ అలీ చెప్పారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. బాసర పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల సందర్భంగా విద్యా ర్థులను బెదిరించినట్లు వచ్చిన వార్తలు సరికాదన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, విద్యార్థులు గురువారం నుంచి యథావిధిగా తరగతులకు హాజరవుతారన్నారు. అయితే, తమ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేదాకా ఆందోళన ఆపేదిలేదని విద్యార్థులు తెగేసి చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment