రాహుల్ గాంధీ.. ఈ కాంగ్రెస్ అగ్రనేత పేరు వినగానే గొర్తొచ్చే విషయాల్లో ఆయన పెళ్లి కూడా ఒకటి. ఇప్పటికే చాలాసార్లు తన పెళ్లిపై రాహుల్ మాట్లాడారు. తాజాగా మరోసారి పెళ్లి ప్రస్తావన రాగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దేశంలో అయిదు రాష్ట్రాలకు (తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం,చత్తీస్‌గఢ్) ఎన్నికల తేదీలు వెలువడటంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జైపూర్ మహారాణి కళాశాల విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్మ సంరక్షణ, ఆహార అలవాట్లు, పెళ్లి గురించి విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
సెప్టెంబర్ 23న జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కులగణన, స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తదితర అంశాలతో సహా తన ఇష్టాయిష్టాల గురించి అనేక విషయాలను పంచుకున్నారు.
పెళ్లి గురించి ఆలోచించలేదు
మీరు చాలా స్మార్ట్‌గా, అందంగా ఉంటారు.. ఎందుకు ఇప్పటి వరకు పెళ్లి గురించి ఆలోచించలేదు’ అంటూ ఓ మహిళ రాహుల్ ను అడిగింది. దీనిపై ఆయన బదులిస్తూ తన పనిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమై ఉండటం వల్ల పెళ్లి వైపు ఆలోచన వెళ్లలేదని తెలిపారు.
ఎప్పుడూ క్రీమ్ వాడలేదు
రాహుల్‌గాంధీకి ఇష్టమైన ఆహారం ఏంటని ప్రశ్నించగా.. కాకరకాయ, బఠాణీలు, పాలకూర మినహాయించి అన్నీ కూరగాయలు తింటానని సమాధానమిచ్చారు. అయితే తన చర్మానికి ఏం వాడుతారని మరొకరు అడగ్గా.. ఇప్పటి వరకు తన ముఖానికి ఏ క్రీమ్, సోప్ ఉపయోగించలేదని, కేవలం నీటితో ముఖం కడుగుతానని బదులిచ్చారు.
అదే విధంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలను చూడటం నచ్చుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. తాను ఇప్పటివరకు వెళ్లని ప్రదేశాలే తనకిష్టమైన స్థలాలంటూ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..స్వాతంత్ర్య సమరంలో మహిళల పాత్ర పురుషులకంటే తక్కువేమీ కాదని, అలాంటప్పుడు వారికి తక్కువ హక్కులు ఎందుకు ఉండాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Next PM Rahul Gandhi met with students at Maharani College in Jaipur and had a discussion with them. pic.twitter.com/cxzoTWUnM1
— Venisha G Kiba (@KibaVenisha) October 10, 2023
డబ్బు గురించి తెలిసి ఉండాలి
మహిళలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. డబ్బు అంటే ఏంటో మహిళలకు ఎప్పుడూ వివరించరని, అధికారం గురించి కూడా చెప్పరని అన్నారు. మహిళలకు డబ్బు గురించి తెలిసి ఉండాలన్నారు. మహిళలకు ఉద్యోగం ఉన్నా.. డబ్బు గురించి తెలియకపోతే వృథానే. అదే, ఉద్యోగం లేకపోయినా.. డబ్బును అర్థం చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మహిళలు ఈ విషయాలు అర్థం చేసుకోకపోతే.. ఎప్పటికీ ఇతరులపైనే ఆధారపడాల్సి ఉంటుంది’ అని వివరించారు.
ఒకవేళ రాజకీయ నాయకుడు కాకపోయి ఉంటే ఏమయ్యేవారని అడిగిన ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. తనకు అనేక రంగాల్లో తనకుప్రావీణ్యం ఉందన్నారు. ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పగలనని, వంట కూడా చేస్తానని చెబుతూ.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమేనన్నారు. ఇదిలా ఉండగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర నుంచి రాహుల్ అన్ని వర్గాలు, వయసుల వారితో మమేకం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment