రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
అమేథి : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వింత వింత సమాధానాలు చెప్పారు. తన సొంత ఎంపీ నియోజకవర్గం అమేథిలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన రాహుల్, అక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తలాతోక లేని సమాధానాలు చెప్పారు. రాహుల్ చెప్పిన సమాధానాలకు విద్యార్థులే ఆశ్చర్యపోయారు.
విద్యార్థులతో జరిగిన సంభాషణలో రాహుల్‌కు ఎదురైన ప్రశ్నలు....
ప్రభుత్వం చాలా చట్టాలను రూపొందిస్తుంది కానీ ఎందుకు వాటిని గ్రామాల్లో సరిగ్గా అమలు చేయదు అని ఓ విద్యార్థిని అడిగింది. అయితే ఈ ప్రశ్నను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడగాలని, అక్కడ తమ ప్రభుత్వం లేదని, ఒకవేళ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమల్ని ఈ ప్రశ్న వేయొచ్చంటూ రాహుల్ సమాధానం చెప్పారు. కానీ రాహుల్ చెప్పిన ఈ సమాధానం అక్కడంతా నవ్వులు పవ్వులు పూయించింది. రాహుల్ తెలిసి చెప్పారో లేదా తెలియక చెప్పారో తెలియదు కాదు కానీ... చట్టాలను పార్లమెంట్ చేస్తుందని, వాటిల్లో చాలా వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే అమలు చేయాల్సి ఉంటుందని, కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయదని కొందరు విద్యార్థులన్నారు.
అమేథి గురించి అడగగా కూడా.. ఎంపీగా తన బాధ్యతలను తాను పొగుడుకుని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను తప్పుబట్టారు. ‘నో.. నో.. అమేథిని యోగి పాలిస్తున్నారు. నేను అమేథి నుంచి ఎంపీని మాత్రమే. నా బాధ్యత లోక్‌సభలో చట్టాలు చేయడం. యూపీని పాలించాల్సిన బాధ్యత యోగిదే. కానీ ఆయన మరో పనుల్లో బిజీగా ఉన్నారు. విద్యుత్, నీరు, విద్యపై కూడా ఆయన పనిచేయడం లేదు’ అని రాహుల్ సమాధానమిచ్చారు. రాహుల్ మరిన్ని ప్రశ్నలు వేయబోయే సరికి, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే పార్లమెంట్‌లో ఎంపీల పాత్రను పక్కనబెడితే, సొంత రాష్ట్రం లేదా నియోజకవర్గాలలో ఎంపీలు కీలక పాత్ర పోషించాలి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్ కింద ఏడాదికి వారు తమ నియోజకవర్గాల్లో రూ.5 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఎంపీలను స్థానిక బాడీలకు బాధ్యతగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ స్కీమ్‌లను వారి నియోజకవర్గాల్లో అమలు చేయాల్సిన బాధ్యత వారిదే. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈ బాధ్యతలకు విరుద్ధంగా, తన నియోజకవర్గం గురించి తనకేమీ పట్టదన్నంటూ సమాధానం చెప్పి, విద్యార్థులను సైతం ఆశ్చర్యపరిచారు. నేటి నుంచి మూడు రోజుల పాటు అమేథి, రాయబరేలీల్లో రాహుల్ పర్యటన కొనసాగనుంది. రాయబరేలికి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment