కులాన్ని బట్టి న్యాయం చేస్తారా?
‘‘రోహిత్ విషయంలో కుల ప్రస్తావన ఎందుకొస్తోంది, కులాన్ని బట్టి న్యాయాన్యాయాలను అంచనా వేస్తారా? కులాలకు అతీతంగా జీవించాలన్న స్పృహ ప్రతి ఒక్కరిలో రావాలి. ప్రతిభా పాటవాలు, వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే మనిషిని అంచనా వేయాలి. ఓట్ల కోసమే పార్టీలు కుల, మత, ప్రాంతాల విభేదాలు సృష్టిస్తున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా వీటిని రూపుమాపలేం. మనిషి ఆలోచనలో మార్పు వస్తేనే అది సాధ్యం. నిజమైన సమానత్వం, సమాజంలో తలెత్తుకు తిరిగే పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత యువతపై ఉంది. తమ ఆవేశాన్ని, ఆలోచనలను కులరహిత సమాజం నిర్మించే దిశగా తీసుకెళ్లాలి. అందరికీ సమాన విద్య అందిన ప్పుడే ఇది సాధ్యం. హెచ్‌సీయూ విద్యార్థుల డిమాండ్లు నెరవేరుతాయని ఆశిస్తున్నా..’’ - లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ
సామాజిక న్యాయానికై పోరాడాలి
‘‘సామాజిక న్యాయం జరిగే వరకు విద్యార్థులు ఉద్యమించాలి. సెంట్రల్ వర్సిటీలో ఉన్నత విద్యా ప్రమాణాలు ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ దానికి భిన్నమైన అప్రజాస్వామిక వాతావరణం కనిపిస్తోంది. పేద, దళిత విద్యార్థులు తెలుగు మీడియంలో చదివి సెంట్రల్ వర్సిటీలో సీటు సాధిస్తే విద్యార్థుల జీవితాలను బలిచేయడం సరైంది కాదు.’’ - టీజేఏసీ చైర్మన్ కోదండరాం
‘‘ఏబీవీపీ నాయకులను, వర్సిటీ వీసీని రోహిత్ దోషులుగా నిలబెట్టాడు. రోహిత్ రాసిన సూసైడ్ నోట్ ద్వారా ఇది స్పష్టమవుతోంది. కేంద్రం విశ్వవిద్యాలయాలను కాషాయమయం చేస్తోంది.’’ - విరసం నేత వరవరరావు
‘‘రోహిత్‌ను యాకుబ్ మెమెన్‌తో పోల్చుతూ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు దారుణం. ఇంత నిర్లజ్జగా వ్యవహరించడం సిగ్గుచేటు. హెచ్‌సీయూలో జరిగిన ఘటనపై తన వైఖరి ఏమిటో ప్రధాని మోదీ వెల్లడించాలి..’’ - తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్
రాజకీయ జోక్యం తగదు
‘‘విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల వ్యవహారాల్లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ జోక్యం చేసుకుని రాజకీయం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తితో కొనసాగే యూనివర్సిటీల ఔన్నత్యం కాపాడేందుకు అందరూ ప్రయత్నించాలి. రోహిత్ ఆత్మహత్యకు వీసీ, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి..’’
- మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
మోదీకి కనిపించడం లేదా?
‘‘కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అంతర్జాతీయ ఉద్యమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కనిపించ డం లేదా? విద్యార్థులు తలుచుకుంటే మీ ప్రభుత్వం కూలిపోతుందని గ్రహించాలి. ప్రపంచంలోనే విద్యార్థుల ఉద్యమాలు విశిష్టమైనవి. వేముల రోహిత్ దేశానికి ఉత్తమ శాస్త్రవేత్త అయ్యేవాడు. మీ ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది..’’
- ప్రజా గాయకుడు గద్దర్
రోహిత్ మృతిపై ప్రముఖుల వ్యాఖ్యలు
Published Fri, Jan 22 2016 4:26 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM
Advertisement
Advertisement