
దేశానికే అవమానకరం
రోహిత్‌ను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం సిగ్గుచేటు: కేజ్రీవాల్
బీజేపీ గూండాగిరీని సహించబోం..
భావ ప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కితే దేశం ముందుకు పోదు
విద్యార్థుల పట్ల వీసీ నిర్ణయం జాతి వ్యతిరేకం
వీసీ, కేంద్ర మంత్రుల మధ్య ఫోన్‌కాల్స్ డేటాను బయటపెట్టాలి
విద్యార్థులంతా కలసికట్టుగా పోరాడాలని పిలుపు
హెచ్‌సీయూలో దీక్ష చేస్తున్న విద్యార్థులకు ఢిల్లీ సీఎం పరామర్శ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశానికే అవమానకరమని, అలాంటి మెరిట్ స్టూడెంట్‌ను గౌరవించాల్సింది పోయి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం సిగ్గుచేటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. వీసీలుగా ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ ముద్ర ఉన్నవారిని నియమిస్తూ... యూనివర్సిటీల్లో విద్యార్థులకు వ్యతిరేకంగా బీజేపీ యుద్ధం ప్రారంభించిందని ఆరోపించారు. బీజేపీ గుండాగిరీని సహించేది లేదని, విద్యార్థులంతా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. రోహిత్ మరణానికి కారకులైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయతో పాటు వీసీ అప్పారావును వెంటనే తొలగించాలని... ఈ ముగ్గురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను వెల్లడించాలని, వారి ఫోన్ కాల్‌డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కితే దేశం ముందుకు పోదని... విజ్ఞానం పుట్టేదే వర్సిటీల్లో కాబట్టి విద్యార్థులకు విభిన్న ఆలోచనలు చేసే స్వేచ్ఛనివ్వాలని వ్యాఖ్యానించారు. గురువారం అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి వెలివాడ శిబిరాన్ని సందర్శించారు. విద్యార్థుల దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ప్రసంగించారు. నిజానిజాలను నిర్ధారించుకోకుండా విద్యార్థులను సస్పెండ్ చేయడం దారుణమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అంబేద్కర్ విధానాలు, భావజాలాన్ని చర్చించుకునే వారిపై జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. విద్యార్థుల తప్పేమీ లేదని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ స్పష్టం చేసినా... కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ లేఖ రాయడం, దానిపై కేవలం రెండు నెలల వ్యవధిలో కేంద్ర మానవ వనరుల శాఖ ఐదుసార్లు రిమైండర్లు పంపడమేమిటని నిలదీశారు. రోహిత్ వంటి మెరిట్ స్టూడెంట్‌ను గౌరవించాల్సింది పోయి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం సిగ్గుచేటని... ఇలాంటి దుశ్చర్య దేశానికే అవమానకరమని కేజ్రీవాల్ మండిపడ్డారు.
స్మృతి ఇరానీ వ్యాఖ్యలు సిగ్గుచేటు..
దళితులు, దళితేతరుల మధ్య వివాదం కాదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. వార్డెన్‌లందరూ దళితులే ఉన్నారని వారే రోహిత్‌ను సస్పెండ్ చేశారని చెప్పడం పచ్చి అబద్దమన్నారు. కులం మీద సర్టిఫికెట్ ఉన్నా సిగ్గులేకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులపై చర్యల విషయంలో మానవ వనరుల శాఖ ఒక నిర్ణయం తీసుకున్నాక... ఇప్పుడు విచారణ జరపడమేమిటని ప్రశ్నించారు. ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్‌ను కాపాడడం కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. యూనివర్సిటీలో సుశీల్‌పై దాడి జరగకపోయినా కట్టుకథలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సుశీల్‌కు దెబ్బలు తగలలేదని, ఘర్షణలు జరగలేదని రిజిస్ట్రార్ స్వయంగా హైకోర్టులో చెప్పారని... పేద దళిత విద్యార్థులను సస్పెండ్ చేస్తే తీవ్రంగా నష్టపోతారని కూడా అఫిడవిట్ పొందుపరిచారని కేజ్రీవాల్ గుర్తుచేశారు.
అయినా ఇవేవీ పట్టించుకోకుండా కేంద్రమంత్రులు ఒత్తిడి చేయడం, దానికి వీసీ తలొగ్గి మెరిట్ స్టూడెంట్‌ను సస్పెండ్ చేయడం దారుణమని విమర్శించారు. ప్రస్తుత వీసీ అప్పారావు చీఫ్ వార్డెన్‌గా ఉన్నప్పుడే అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని, అలాంటి వ్యక్తికి యూనివర్సిటీ బాధ్యతలు అప్పగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వీసీలుగా ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ ముద్ర ఉన్నవారినే నియమిస్తూ... దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో విద్యార్థులకు వ్యతిరేకంగా బీజేపీ యుద్ధం ప్రారంభించిందని ఆరోపించారు. బీజేపీ గుండాగిరీని సహించేది లేదని, విద్యార్థులంతా కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
బీజేపీ అన్ని రంగాల్లో విఫలం
కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎలాంటి ఎజెండా లేదని వారి పరిపాలన ద్వారా అర్థమవుతోందని కేజ్రీవాల్ విమర్శించారు. ‘‘ఏడాదిన్నర కు పైగా వారి పరిపాలన ద్వారా హిందువులతో సహా ఏ ఒక్క వర్గానికీ లబ్ధి చేకూర్చలేదు. వారికి కావాల్సిందల్లా అధికారం, డబ్బు. దానికోసం ఎన్ని డ్రామాలకైనా, ఎంతమందిని మభ్యపెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు..’’ అని పేర్కొన్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై అధికారాన్ని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఢిల్లీలో పోలీసు వ్యవస్థ తమ ప్రభుత్వం చేతుల్లో లేకపోవడంతో, వారి చేత అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న ఒక పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం దేశచరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు.