మరోసారి ఉద్రిక్తంగా ఉస్మానియా
హైదరాబాద్: ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా దండుగా కదిలింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, హెచ్ సీయూ వీసీ అప్పారావును తొలగించాలనే నినాదాలతో ఓయూ విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలక భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు అక్కడికి తరలి రావడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. కొంతమంది విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో హెచ్సీయూ జాక్ దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపునందుకునే ఉస్మానియా విద్యార్థులు మరోసారి కదం తొక్కారు.