
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులే కీలక పాత్ర పోషించారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉస్మానియా లేకపోతే తెలంగాణ లేదన్నారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి ఓయూ అందించిందని గుర్తు చేసుకున్నారు. కుట్ర పూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు అంటూ ఆరోపించారు. తాను మళ్లీ ఓయూకు వస్తానని.. విద్యార్థులతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం, ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఉస్మానియా నుంచే. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఉస్మానియా నుంచే. ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి ఓయూ అందించింది. ఉస్మానియా నుంచే పీవీ ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఓ జార్జిరెడ్డి, ఓ గద్దర్‌ను అందించిన గడ్డ ఈ ఉస్మానియా వర్సిటీ. మన యూనివర్సిటీలకు మన తెలంగాణ పోరాట యోధుల పేర్లు పెట్టుకున్నాం. సామాజిక న్యాయంతో వీసీలను నియమించాం.
మీటింగ్ పెట్టండి..
డిసెంబర్‌లో ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టండి. నేను కూడా వస్తాను. విద్యార్థుల సమస్యలు తీర్చాలని అనుకుంటున్న నేను ఓయూకు ఎందుకు రావద్దు. మీ సమస్యలు ఏమున్నా చెప్పండి.. ఏమేం కావాలో చెప్పండి. మీ సమస్యలు తీరుస్తాను. మరోసారి ఓయూకు వస్తాను.. ఒక్క పోలీసును పెట్టకండి. అప్పటికప్పుడు మీకు జీవోలు ఇస్తాను. ఆరోజు ఒక్క పోలీసు కూడా క్యాంపస్‌లో ఉండడు. అప్పుడు విద్యార్థులు నిరసనలు తెలిపినా నేను ఏమీ అనను. విద్యార్థులు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పే చిత్తశుద్ది నాకు ఉంది. కొంత మంది రాజకీయ నాయకులకు అధికారం పోయిన కడుపు మంట ఉంటది. మీరు ఆశీర్వదిస్తేనే తెలంగాణకు ముఖ్యమంత్రిని అయ్యాను అని చెప్పుకొచ్చారు.
చట్ట సభలకు కోదండరాం..
తెలంగాణలో ఏనుగులు లేవు.. మృగాలు లేవు. ప్రొఫెసర్ కోదండరాంను 15 రోజుల్లో చట్ట సభకు పంపుతా. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉంటే వచ్చిన తప్పేంటి?. మీ కుటుంబానికే అన్ని పదవులు ఉండలా? అని ప్రశ్నించారు.
విద్యార్థులదే కీలక పాత్ర..
తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులే కీలక పాత్ర పోషించారు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంత చారి అమరుడై చైతన్యం అందించాడు. యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు. చైతన్యం అందించిన ఓయూను కాలగర్భంలో కలపాలని చూశారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడిన ఉస్మానియా కళా విహీనంగా మారిన పరిస్థితి ఏర్పడింది. కుట్ర పూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు.
నేను వచ్చాక ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాను. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం. యువతే దేశానికి అతి పెద్ద సంపద. మనలో అసహనం పెరిగిపోయింది.. అశాంతి ఎక్కువైంది. చిన్న చిన్న కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ యువతను పట్టి పీడిస్తున్నాయి. పేదలకు పంచేందుకు భూములు లేవు.. పేదల తలరాతను మార్చేది విద్య ఒక్కటే. సామాజిక, సాంకేతిక అంశాలపై చర్చ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు.
