HCU JAC
-
హెచ్ సీయూలో ఉద్రిక్తత
విద్యార్థుల చలో హెచ్ సీయూ పిలుపు, వీసీ అప్పారావు ఆధ్వర్యంలో అకడమిక్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోహిత్ వేముల మృతికి కారణమైన వీసీ అప్పారావును తొలగించాలని, రోహిత్ యాక్ట్ తీసుకురావాలనే డిమాండ్ తో హెచ్ సీయూ జాక్ బుధవారం చలో హెచ్ సీయూకి పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో వర్సిటీ వద్ద భద్రత కట్టు దిట్టం చేశారు. మీడియాతో సహా.. బయటి వారిని వర్సిటీలోకి అనుమతించడం లేదు. మరో వైపు యూనివర్సిటీ వీసీ అప్పారావు ఆధ్వర్యంలో అకడమిక్ కౌన్సిల్ సమావేశం జరగ నుంది. కౌన్సిల్ సమావేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. -
రోహిత్ ఘటనపై బస్సుయాత్ర ప్రారంభం
హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హెచ్‌సీయూ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల బస్సుయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ యాత్రను ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవివక్షకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రోహిత్ చట్టం తీసుకువచ్చేందుకు విద్యార్థులు పోరాడాలన్నారు. ఈ నెల 16 వరకు కొనసాగే ఈ బస్సు యాత్రలో హెచ్‌సీయూ, ఓయూ, పలు తెలంగాణ వర్సిటీల విద్యార్థులు భాగస్వాములవుతారని చెప్పారు. అనంతరం హెచ్‌సీయూ నుంచి బస్సుయాత్ర నేరుగా ఉర్దూ వర్సిటీకి చేరుకుంది. అటు ఏపీలో శుక్రవారం నుంచి జేఏసీ బస్సుయాత్ర ప్రారంభమవనుంది. కాగా, మొదటిరోజు హెచ్‌సీయూ నుంచి మొదలైన బస్సుయాత్ర ఉర్దూ వర్సిటీ, వికారాబాద్మీదుగా పాలమూరు వర్సిటీ వరకు కొనసాగింది. శుక్రవారం మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి మీదుగా నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ వరకు యాత్ర కొనసాగుతుంది. 13న కాకతీయ వర్సిటీకి, 14న ఆదిలాబాద్‌కు, 15న నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూకు బస్సుయాత్ర చేరుకుంటుంది. 16న జేఎన్టీయూతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, పొట్టి శ్రీరాములు, నిజాం కాలేజి, కోఠి ఉమెన్స్ కాలేజి, ఇఫ్లూ మీదుగా ఓయూకి చేరుకుంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓయూలో బస్సుయాత్ర ముగింపు సభ నిర్వహిస్తారు. -
మరోసారి ఉద్రిక్తంగా ఉస్మానియా
హైదరాబాద్: ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా దండుగా కదిలింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, హెచ్ సీయూ వీసీ అప్పారావును తొలగించాలనే నినాదాలతో ఓయూ విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలక భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు అక్కడికి తరలి రావడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. కొంతమంది విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో హెచ్‌సీయూ జాక్ దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపునందుకునే ఉస్మానియా విద్యార్థులు మరోసారి కదం తొక్కారు. -
వీసీ రాజీనామా చేయాలి : హెచ్‌సీయూ జేఏసీ
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్‌సీయూ జేఏసీ ప్రకటించింది. సస్పెన్షన్‌కు గురైన మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. వీసీ రాజీనామా చేసే వరకు క్లాసులు బహిష్కరిస్తామని...అడ్మినిస్ట్రేషన్ విభాగం కార్యకలాపాలు కొనసాగనివ్వమని నాయకులు తెలిపారు. హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్డీ విద్యార్థి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.