హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థి సంఘాల నేతలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఓయూ విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి కార్యాలయంలోకి దూసుకువచ్చారు.
పోలీసులు వారిని అడ్డుకుని దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకుని అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు నేతృత్వంలో తరలివచ్చిన విద్యార్థులు సీఎం కార్యాలయం ముందు ఆందోళనకు యత్నించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాగుట్ట స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరెస్టు అయిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.