ఇలా గొంతునొక్కి..
రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. బూటు కాళ్లతో విద్యార్థుల ముఖాలపై తొక్కారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. లాఠీలతో చావబాదారు. ఆడ, మగ తేడా లేకుండా జుట్టు పట్టుకొని మరీ రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనతో సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో యుద్ధ వాతావరణం నెలకొంది.
ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం కార్యాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించలేదు. సీఎం క్యాంపు కార్యాలయం నలువైపులా భారీగా మోహరించారు. కొందరు విద్యార్థులు హఠాత్తుగా సీఎం క్యాంపు కార్యాలయం సమీపానికి దూసుకువచ్చి నినాదాలు ప్రారంభించడంతో కంగుతిన్న పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి కె.వసంత్‌ను రోడ్డుపై పడదోసినా నినాదాలు చేస్తుండటంతో బూటుకాలుతో నుదుటిపై తన్నారు. - సాక్షి, విజయవాడ