Private university
-
విజయానికి షార్ట్ కట్స్ ఉండవు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, సత్యసాయి జిల్లా: పిల్లల చదువు బాధ్యత నాదే అన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గోరంట్ల బెస్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ వర్సిటీ స్నాతకోత్సవంలో ఆయనతో పాటు, బీజేపీ నేత రాంమాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విద్య, వైద్య రంగాలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నవరత్నాలతో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. చదవండి: మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే.. ‘‘పేదరికంతో ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదన్నదే సీఎం వైఎస్ జగన్ ఆశయం. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడితే సక్సెస్ సాధ్యం. ఇంటర్నెట్ యుగంలో విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలని’’ విజయసాయిరెడ్డి అన్నారు. -
ప్రైవేట్ వర్సిటీల కోర్సులకు ఫీజులు ఖరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్న ప్రైవేటు వర్సిటీల్లోని 35 శాతం సీట్లకు సంబంధించి ప్రభుత్వం కోర్సుల వారీగా ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం జీఓ 57ను విడుదల చేసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీలలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (అమరావతి), వీఐటీ ఏపీ (అమరావతి), సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (విజయనగరం), భారతీయ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ–బెస్ట్ (అనంతపురం)లోని బీటెక్, బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ సీట్లను ఈ విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో విద్యార్థులకు కేటాయించనున్నారు. ఎస్ఆర్ఎం, వీఐటీ, సెంచూరియన్ వర్సిటీల్లో బీటెక్ కోర్సులకు, బెస్ట్ వర్సిటీలో బీటెక్‌తో పాటు బీఎస్సీ కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎస్ఆర్ఎం, వీఐటీలో బీటెక్ కోర్సు ఫీజును రూ.70 వేలు, సెంచూరియన్‌లో రూ.50 వేలు, బెస్ట్ వర్సిటీలో రూ.40 వేలుగా ఖరారు చేశారు. బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లకు రూ.70 వేలుగా నిర్ణయించారు. ఈ ఫీజులు 2021–22 నుంచి 2023–24 వరకు అమల్లో ఉండనున్నాయి. ఈ ఫీజులకు అదనంగా డబ్బు వసూలు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హాస్టల్, ట్రాన్స్పోర్ట్, మెస్ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీ, అడ్మిషన్ ఫీ, లైబ్రరీ, ల్యాబొరేటరీ ఫీజులు ఈ ఫీజులో కలసి ఉండవని పేర్కొంది. కాగా ఈ వర్సిటీల్లో మొత్తంగా 2,330 బీటెక్ సీట్లు, బెస్ట్ వర్సిటీలో 105 ఏజీ బీఎస్సీ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. పేద విద్యార్థుల కల సాకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను మాత్రమే ప్రభుత్వం కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు వర్సిటీల్లోని 35 శాతం సీట్లను రాష్ట్రంలోని మెరిట్ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ఆయా వర్సిటీల్లోని 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలోకి తీసుకు వచ్చింది. తద్వారా ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదవాలనే మెరిట్ ఉన్న పేద విద్యార్థుల కల సాకారం కానుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా 2,330 బీటెక్ సీట్లు, 105 ఏజీ బీఎస్సీ సీట్లు కన్వీనర్ కోటా ద్వారా అదనంగా అందుబాటులోకి రానున్నాయి. -
ప్రైవేట్ యూనివర్సిటీలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ సంస్థలు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను గురువారం జారీ చేసింది. మల్లారెడ్డి మహిళా వర్సిటీని మైసమ్మగూడలో ఏర్పాటు చేసేందుకు ఓకే చెబుతూ ఎల్వోఐ జారీ చేసింది. ఈ మేరకు మల్లారెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి సీహెచ్ మహేందర్‌రెడ్డికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామంద్రన్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఎల్వోఐ ఆధారంగా ఆ విద్యా సంస్థ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. రూ.10 కోట్ల కార్పస్ ఫండ్, మూడేళ్ల పాటు ఉండేలా రూ.30 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్, ప్రాజెక్టు విలువలో 1% ఎండోమెంట్ ఫండ్ లేదా రూ.10 కోట్లు వెచ్చించడంతోపాటు తగిన భవనాలు, వాటిల్లో సదుపాయాలు ఏర్పా టు చేయాల్సి ఉంటుంది. ఆరు నెలల్లోగా అవి పూర్తి చేశాక ప్రభుత్వం లెటర్ ఆఫ్ అప్రూవల్‌ను జారీ చేయనుంది. మల్లారెడ్డి మహిళా వర్సిటీతోపాటు టెక్ మహీంద్రా వర్సిటీ ఏర్పాటుకు కూడా ఎల్వోఐ ఇచ్చింది. వచ్చే వారం రోజుల్లోగా అనురాగ్, గురునానక్ , శ్రీనిధి, ఎంఎన్ఆర్, నిప్‌మర్, వోక్సన్, ఎస్ఆర్ విద్యాసంస్థలకు ఎల్వోఐ జారీ చేసే అవకాశం ఉంది.న్నాయి. -
ప్రైవేటు వర్సిటీల్లో రిలయన్స్ లేనట్టే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిలయన్స్ ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు ఇక లేనట్టేనని ఉన్నత విద్యా శాఖ వర్గాలు భావిస్తున్నాయి. 2015లో రిలయన్స్ సంస్థ ఆసక్తితోనే రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు అంశానికి బీజం పడింది. అప్పట్లోనే తాము తెలంగాణలో ప్రైవేటు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, కార్యాచరణ ఆలస్యం కావడంతో ఆ సంస్థ ముంబైలో తమ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంది. దీంతో తెలంగాణలో రిలయన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే అంశం మరుగున పడింది. మరోవైపు హోండా వంటి కంపెనీలు కూడా యూనివర్సిటీ ఏర్పాటుకు ఆసక్తిని ప్రదర్శించినా ఇప్పుడు ముందుకు రావడం లేదు. ఒక్క టెక్ మహీంద్ర మినహా పారిశ్రామిక రంగం వైపు నుంచి రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రావడం లేదు. అన్నీ విద్యా సంస్థలే.. జాతీయ స్థాయి విద్యా సంస్థలతోపాటు రాష్ట్రంలోని విద్యా సంస్థలే ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. దీంతో ఇప్పటివరకు యూనివర్సిటీల ఏర్పాటుకు 12 సంస్థలు ముందుకు రాగా వాటిల్లో ఏడెనిమిది యూనివర్సిటీలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీల ఏర్పాటు కమిటీ 10 యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాలు, భవనాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను కూడా పంపించింది. త్వరలో మరో 2 యూనివర్సిటీలు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు యూనివర్సిటీల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వాటిల్లో ర్యాడిక్లిప్, శ్రీనిధి, అమిటీ, మల్లారెడ్డి (మహిళా యూనివర్సిటీ), వాగ్దేవి, నిక్మర్ వంటి సంస్థలు కొత్త యూనివర్సిటీలను (గ్రీన్ ఫీల్డ్) ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇక ఎంఎన్ఆర్ (హెల్త్ యూనివర్సిటీ), టెక్ మహీంద్ర(మహీంద్ర ఏకోల్), వోక్సన్, అనురాగ్, గురునానక్, ఎస్ఆర్వంటివి తమ పాత విద్యా సంస్థలనే యూనివర్సిటీలుగా మార్పు చేసేందుకు (బ్రౌన్ ఫీల్డ్) ముందుకు వచ్చాయి. పాత విద్యా సంస్థల్లో పాత ఫీజులే.. రాష్ట్రంలో తమకు ఉన్న విద్యా సంస్థలను యూనివర్సిటీలుగా మార్పు చేసేందుకు ముందుకు వచ్చిన విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఉన్న ఫీజులను కొనసాగించాల్సి ఉంటుందని మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల చట్టంలో పేర్కొన్న ప్రకారం కాలేజీ నుంచి యూనివర్సిటీగా మారే విద్యా సంస్థల్లో ఇప్పుడున్న సీట్లలో రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) ఖరారు చేసిన ఫీజులే అమలు చేయాల్సి ఉంటుందని, ఆయా సీట్ల భర్తీలో రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆయా యూనివర్సిటీలు అదనంగా ఇన్‌టేక్ పెంచుకుంటే కనుక ఆయా సీట్లలో యాజమాన్యాల ఇష్టానుసారమే ప్రవేశాలు ఉంటాయని వివరించారు. యూనివర్సిటీల సంఖ్య విషయంలో ఎలాంటి సీలింగ్ లేదని, నిబంధనల ప్రకారం ఉంటే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందన్నారు. ప్రత్యేక లా యూనివర్సిటీ ఏర్పాటుకు దరఖాస్తులు రాలేదన్నారు. యాజమాన్యాల బ్రాండ్ ఆధారంగానే వాటి మనుగడ ఉంటుందన్నారు. -
కెరీర్ లక్ష్యంగా విద్యాబోధన
ఈ రోజుల్లో విద్య వ్యాపారమే. ఎవరూ కాదనలేని సత్యం ఇది. ధనార్జనే ధ్యేయంగా సంస్థలు నడిపేవాళ్లు ఎందరో ఉన్నారు. కానీ ఒక్క మినహాయింపుగా కనిపిస్తుంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. దేశం నలుమూలల నుంచి దాదాపు 40 వేల మంది విద్యార్థులు జలంధర్ సమీపంలోని 600 ఎకరాల క్యాంపస్‌లో విద్యను అభ్యసిస్తుండటమూ.. ప్రైవేట్ యూనివర్సిటీగానే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ చేపట్టడమూ.. వర్సిటీ రూటు సపరేటు అనేందుకు తార్కాణాలు. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను కూడా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో యూనివర్సిటీ కులపతి అశోక్ మిట్టల్‌తో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రశ్న: ఎల్పీయూలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే 20 శాతం వరకూ ఉన్నారు కదా.. మరింత మందిని ఆకర్షించేందుకు దక్షిణాదిలో రెండో క్యాంపస్ ఏర్పాటు చేయవచ్చు కదా? జవాబు: ప్రపంచం మొత్తమ్మీద ఏ ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయానికీ రెండో క్యాంపస్ లేదు. దక్షిణాదిలో ఇంకో క్యాంపస్ పెడితే. ఈ క్యాంపస్ మానవ వనరులను పంచుకోవాల్సి వస్తుంది. ఇది నాణ్యతతో రాజీపడటమే. నాణ్యమైన విద్య అందిస్తున్నందుకే అంత దూరం నుంచి విద్యార్థులు వస్తున్నారు. కాబట్టి రెండో క్యాంపస్ ఎందుకు? ప్ర: మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందంటారు. మరి.. ఇంతమంది విద్యార్థుల కారణంగా బోధన నాణ్యత దెబ్బతింటుంది కదా..? జ: విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం నాణ్యతకు ఏమాత్రం సమస్య కాదు. అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఉదాహరణకు ప్రభుత్వ వ్యవసాయ యూనివర్సిటీలకు వేల ఎకరాల భూమి ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువ. ఇది పరోక్షంగా పన్ను డబ్బులను వృథా చేయడమే. అక్కడ ఫీజులు తక్కువగానే ఉన్నా వనరుల దుర్వినియోగం అవుతున్న మాటేమిటి? ఎల్పీయూలో కరిక్యులం రూపకల్పన మొదలు.. పరీక్షల నిర్వహణ వరకూ అన్నింటినీ స్వతంత్ర వ్యవస్థల ఆధ్వర్యంలో నడుపుతున్నాం. అధ్యాపకుల బోధనకు సంబంధించి ప్రతీ క్లాస్ ఆడియో, వీడియో రికార్డింగ్ జరుగుతుంది. దీనిపై తరచూ సమీక్ష జరిపి వారి లోటుపాట్లను సరిదిద్దే వ్యవస్థనూ ఏర్పాటు చేశాం. వీటన్నింటికీ అదనంగా బయటి సంస్థల నిపుణులు మా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా కట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాం కూడా. ప్ర: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు క్షీణిస్తున్నాయని అంటున్నారు. మీ దృష్టిలో దీనికి కారణాలేమిటి? జ: అవి మా కంటే ముందుగా ఏర్పాటైన సంస్థలు. అంటే మాకు అన్నల్లాంటి వారు. లోపాలు ఉండవచ్చుగానీ.. ఆ తప్పులు ఎంచేందుకు నాకు ఏ హక్కూ లేదు. మాలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి.. ఉంటాయి కూడా. వాటిని గుర్తుంచుకుని దిద్దుకోవడం మేం చేయగలిగిన పని. అదే పని అక్కడ కూడా జరుగుతోందని అనుకుంటున్నాం. ప్ర: విద్యావిధానం విషయంలో ఎల్పీయూ ప్రత్యేకత ఏమిటి? జ: మిగతా విద్యాసంస్థల్లో ముందు చదువు చెబు తారు. డిగ్రీ ఇస్తారు. విద్యార్థులకు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఎల్పీయూ ప్రణాళిక దీనికి పూర్తిగా భిన్నం. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఉద్యోగ అవకాశాల అధ్యయనం తర్వాత వాటికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతల ఆధారంగా కరికులం రూపొందిస్తాం. కోర్సు సాగినన్ని రోజులు విద్యార్థులు తమ ఇష్టాఇష్టాలకు తగిన ఉద్యోగాన్ని సంపాదించు కునేందుకు కావాల్సిన అన్ని రకాల శిక్షణకు అవకాశాలు కల్పిస్తాం. తొలి ఏడాదిలో అవకాశాల గురించి వివరిస్తే.. రెండో ఏడాది ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉన్న మార్గాలను చెబుతాం. అవసరమైతే విద్యార్థి తన మునుపటి ఆప్షన్‌ను సరిచేసుకునేందుకూ వీలుంటుంది. ఈ ప్రణాళిక కారణంగానే ఎల్పీయూ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు 70–80 శాతం వరకూ ఉన్నాయి. జాగ్రఫీ డిగ్రీ చేసిన వారు కూడా మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ప్ర: ఎల్పీయూలో 200 కోర్సుల వరకూ ఉన్నాయి. వీటి ఫీజుల గురించి చెబుతారా? జ: సగటున ఒక్కో ఇంజనీరింగ్ విద్యార్థి చెల్లించాల్సిన ఫీజు ఏడాదికి సగటున రూ.1.25 లక్షల వరకూ ఉంటుంది. ఈ వర్సిటీ రూటు సపరేటు అనేందుకు ఒక నిదర్శనం. హాస్టల్ ఫీజు రూ.50 వేల నుంచి మొదలవుతుంది. దేశంలోని ఏ ప్రైవేట్ యూనివర్సిటీ ఫీజులతో పోల్చినా ఇది 20 నుంచి 40 శాతం వరకూ తక్కువ. ఎల్పీయూ నెస్ట్ పరీక్షలో మంచి మార్కులు సంపాదించిన వారికి స్కాలర్‌షిప్పులూ ఇస్తున్నాం. ప్ర: ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు ఉండటం చాలా అరుదు? జ: నిజమే. అయితే మానవ వికాసంలో ఆర్ట్స్, హ్యుమానిటీస్ రంగాలు చాలా కీలకమనేది మా నమ్మకం. పైగా విద్య ఏదో ఒక అంశానికి మాత్రమే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో మేము బీఏ, బీకామ్‌లతోపాటు ఫైన్ ఆర్ట్స్ కోర్సులూ ప్రవేశపెట్టాం. పైగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సబ్జెక్టులు తెలుసుకోవడం అవసరమవుతుంది. ప్ర: ఎల్పీయూలో వైద్య విద్య కోర్సు లేకపోవడానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా? జ: కొన్నేళ్ల క్రితం ఈ కోర్సు కోసం ప్రయత్నించాం. అయితే బోలెడన్ని అనుమతులు, నిబంధనలు ఉన్నాయి. పైగా అక్కడ వ్యవస్థ పనితీరు కూడా అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో మా ఆలోచన విరమించుకున్నాం. ఈ ప్రభుత్వ హయాంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా.. అవి పూర్తయ్యాక ఆలోచిస్తాం. ప్ర: లవ్లీ మిఠాయి దుకాణం ద్వారా మీ ప్రస్థానం మొదలైంది. విద్యారంగం వైపు మళ్లేందుకు కారణాలు? జ: మిఠాయిల వ్యాపారం ద్వారా ఎంతో సంపాదించాం. సమాజానికి ఎంతో కొంతతిరిగి ఇచ్చేయాలని అనుకున్నాం. ఆస్పత్రులు కట్టడం మొదలుకొని వృద్ధాశ్రమాలు, ఇతర సేవ కార్యక్రమాలన్నింటినీ పరిశీలించాం. ప్రాథమిక స్థాయి విద్యా బోధనలో ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే బాగా రాణిస్తున్న నేపథ్యంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని భావించి ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశించాం. సమాజ అభివృద్ధికి దోహదపడే ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యంగా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
వర్సిటీలు వచ్చేస్తున్నాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వాటికి సంబంధించి మార్గదర్శకాల ఖరారు పూర్తికావొచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రైవేటు వర్సిటీలను అనుమతించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 28న అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. తర్వాత పలు కారణాలతో దీనిపై ప్రభుత్వం దృష్టిసారించలేకపోయింది. జాతీయస్థాయి సంస్థలు, విదేశీ విద్యాసంస్థలూ రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుపై అవసరమైన మార్గదర్శకాలను ఉన్నత విద్యాశాఖ దాదాపు ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ ఆమోదం లభించిన వెంటనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. వాటిల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ సంస్థల ఆసక్తి రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాయి. దీంతో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశ పెట్టేలా చూడాలని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే సంస్థలకు యూనివర్సిటీలు ఏర్పాటు చేసేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్ తమ విద్యా సంస్థను స్థాపించింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉంది. రూ. 30 కోట్ల కార్పస్ ఫండ్ రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీలను ఏర్పాటు చేసే సంస్థలకు రూ.30 కోట్లను కార్పస్ ఫండ్‌గా ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే విద్యా సంస్థలు నడుస్తుంటే వాటికి మాత్రం కార్పస్ ఫండ్‌లో కొంత మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే కనీసం 20 ఎకరాల స్థలం ఉండాలని, పట్టణ ప్రాంతాల్లో అయితే 10 ఎకరాల స్థలం ఉండాలన్న నిబంధనను పొందుపరుస్తున్నట్లు తెలిసింది. ప్రైవేటు వర్సిటీల చట్టంలో పేర్కొన్న ప్రధాన అంశాలు - ప్రైవేటు యూనివర్సిటీలు పూర్తి స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. - వాటిల్లో కోర్సుల నిర్వహణ, ప్రవేశాల విధానం, ఫీజులను వర్సిటీలే నిర్ణయిస్తాయి. - తెలంగాణ విద్యార్థులకు మాత్రం 25% సీట్లు కల్పిస్తారు. - లింగ వివక్ష, ప్రాంతం, కులం, పుట్టిన ప్రదేశం, మతం, రాజకీయ కోణం, ఇతర కారణాలతో ఎవరికీ ప్రవేశాలను తిరస్కరించడానికి వీల్లేదు. - తెలంగాణలో ఇప్పటికే ఉన్న విద్యా సంస్థలు వర్సిటీగా ఏర్పడితే: - ప్రవేశాల్లో పాత విధానమే అమలు చేయాలి. సీట్ల భర్తీలో ఇప్పుడున్న రూల్ ఆఫ్ రిజర్వేషనే వర్తిస్తుంది. - ఫీజు విధానం కూడా ఇప్పుడున్న ప్రకార మే కొనసాగుతుంది. తెలంగాణ ఫీజుల నియంత్రణ, ప్రవేశాల కమిటీ నిర్ణయించిన ప్రకారమే కొనసాగుతాయి. - యూనివర్సిటీలు ఏర్పాటైన ఐదేళ్లలోగా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు పొందాలి. - నోటిఫికేషన్ జారీ చేశాక వర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థల నుంచి నిపుణుల కమిటీ దరఖాస్తులను(ప్రాజెక్టు రిపోర్టులను) స్వీకరిస్తుంది. - ఆ ప్రాజెక్టు రిపోర్టును ఆమోదించడమా? తిరస్కరించడమా? అన్నది 30 రోజుల్లో తేల్చుతుంది. -
కార్పొరేట్ల లబ్ధికే ప్రైవేటు వర్సిటీలు
విద్యార్థి సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రొ.కోదండరాం సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే పాలకులు ప్రైవేటు యూనివర్సిటీల వైపు మొగ్గు చూపు తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును నిలిపి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యా లయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలాంటి స్వయంప్రతి పత్తి కలిగిన విశ్వవిద్యాలయాల్లోనే దళితులు, ఆదివాసీలు తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదని, ఈ పరిస్థితుల్లో ప్రైవేటు యూనివర్సిటీలు వివక్షా కేంద్రాలుగానూ, అసమానతలకు నెలవుగానూ తయారు కావని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. విద్యారంగ పరిరక్షణకు తెలంగాణ ఉద్యమాన్ని తలపించే సంఘటితపో రుకు విద్యార్థులంతా సిద్ధం కావాల ని ఆయన పిలుపుని చ్చారు. ప్రభు త్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయకుండా, విశ్వవిద్యాలయాలకు గ్రాంట్లను పెంచకుండా, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా నాణ్యమైన విద్య అందడంలేదంటూ విశ్వవిద్యాలయాలపై నెపం మోపడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కేజీ టు పీజీ విద్యను సాధించుకునే దిశగా విద్యార్థి ఉద్యమం బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యారంగంలో తెస్తున్న మార్పులపై ప్రజాస్వామిక వాతావరణంలో చర్చ జరగాల్సి ఉన్నదని ప్రొఫెసర్ చెన్నబసవయ్య అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమాజం కోసం కాక తెలంగాణ పెట్టుబడిదారుల కోసమే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నర్సిరెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో ఔటా నాయకుడు బట్టి సత్యనారాయణ, ప్రొఫెసర్ రవిచంద్ర, ప్రొఫెసర్ కాశీం, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు వేణు, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు పస్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఈ నెల 19న ఎంఎల్ఎ క్వార్టర్స్ ముట్టడికి, 21న యూనివర్సిటీల బంద్‌కి, 23న చలో అసెంబ్లీకి విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. -
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు విధివిధానాల కోసం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శాసనసభ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగదు రహిత లావాదేవీలపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇకపై ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదురహిత విధానంలోనే చేపట్టాలని నిశ్చయించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజలను మళ్లించాలని సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీలో పేర్కొన్నారు. ఇక కృష్ణ ట్రిబ్యునల్ తీర్పుపై అప్పీల్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త భూసేకరణ చట్టానికి ఆమోదం తెలిపింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు సభ ముందుకు రానుంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కోసం ఆర్థికశాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని కేబినెట్ నిర్ణయించింది. -
ఇక ప్రైవేటు వర్సిటీలు
• ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా • కడియం సారథ్యంలో సబ్ కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సి టీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో కొన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా నగదు రహిత విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించింది. ఈ రెండు అంశాలపై మంత్రివర్గ ఉప సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే కొత్త భూసేకరణ చట్టానికి పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టుల భూసేకరణను వేగంగా పూర్తి చేసేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 123, కేంద్రం తెచ్చిన 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా మరింత మెరుగైన పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ జీవోలు, సవరణల న్నింటినీ కలిపి చట్ట రూపం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకు ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టనుంది.ఈ నెల 16 నుంచి అసెంబ్లీ, శాసన మండలి శీతాకాల సమా వేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ మూడు గంటల పాటు కొనసాగింది. ప్రధానంగా అసెంబ్లీలో చర్చకు వచ్చే అంశాలపైనే మంత్రివర్గం ఈ సమావేశంలో చర్చించింది. అసెంబ్లీ నోటిఫికేషన్ వెలువడటంతో మంత్రివర్గ భేటీకి సంబంధించిన అంశాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. కానీ విశ్వసనీయంగా వివిధ అంశాలు బయటకు తెలిశాయి. రెండు సబ్ కమిటీల ఏర్పాటు ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, జోగురామన్న, తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా ఉంటారు. కమిటీ సలహాదా రుగా రాజీవ్‌శర్మను నియమించింది. సబ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పా టుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. నగదు రహిత విధానం, టీఎస్ వ్యాలెట్‌ను రూపొందించేందుకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు నేతృత్వంలో మరో సబ్ కమిటీని నియమించింది. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలు, సంబంధిత విధివిధానాల రూపకల్పన బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావును సభ్యులుగా నియమించారు. బ్రజేష్ తీర్పుపై సుప్రీంకోర్టుకు కృష్ణా జలాలపై బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ వివాదం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమని చెబుతున్న ట్రిబ్యునల్.. నీటి పంపకాలపైనా కొత్త చిక్కు లు లేవనెత్తుతోంది. బేసిన్ బయట వాడు తున్న నీటిపై ఎలాంటి నిర్ణయం చేయబో మనే సంకేతాలివ్వడంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్న చర్చ జరిగింది. ఏపీ తన కేటాయింపులు 512 టీఎంసీల్లో 351 టీఎంసీలను బేసిన్ బయట ఉన్న పోతిరెడ్డిపాడు, గాలేరు– నగరి, హంద్రీనీవాలకు మళ్లిస్తోంది. కాగి తాలపై ఇది 351 టీఎంసీలే ఉన్నా వాస్త వానికి అది 550 టీఎంసీలని కేబినెట్ దృష్టికి వచ్చింది. ట్రిబ్యునల్ ఈ విషయం పట్టించుకోక పోతే తెలంగాణ భారీగా నష్టపోనుంది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మార్గమని కేబినెట్ తీర్మానించింది. ఇప్పుడు అప్పీల్‌కు వెళ్లకుంటే గతం లో సెక్షన్–3 కింద వేసిన కేసు సైతం బలహీనపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నెల 17నుంచి సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు ఉన్నందున 16 లోగా స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ శాఖల ఉద్యోగుల బదిలీలు పని భారం లేని శాఖల నుంచి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న శాఖలకు ఉద్యోగులను బదిలీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని పీవీ నర్సింహారావు యూనివర్సిటీగా పేరు మార్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇకపై ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చడానికి రెండు సందర్భాల్లో కేబినెట్ ఆమోదం అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖలో కొత్తగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్.. ఇలా ఎనిమిది కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ లావాదేవీలన్నీ ఆన్లైన్ పెద్ద నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను ఎదుర్కొనేందుకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని కేబినెట్ తీర్మా నించింది. సాధ్యమైనంత త్వరలో తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చడానికి అన్ని రకాల కృషి చేయాలని నిర్ణయించింది. ముందుగా ప్రభుత్వం నుంచి జరిగే చెల్లింపులు, ప్రభుత్వానికి వచ్చే రాబడి సహా ప్రభుత్వ లావాదేవీలన్నీ ఆన్లై¯న్లో జరిపేందుకు చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ప్రధానంగా ఆర్టీసీ, ప్రజా పంపిణీ వ్యవస్థలో(రేషన్ షాపుల్లో) స్వైపింగ్ మిషన్లు వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. బస్టాండ్లలో, బస్సుల్లో టికెట్లు ఆన్లైన్ ద్వారా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నగదు రహిత జిల్లాగా సిద్దిపేట, నగదు రహిత గ్రామంగా ఇబ్రహీంపూర్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు దేశానికే ఆదర్శమని ప్రధాని మోదీ కొనియాడటం పట్ల మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. ఆర్డినెన్స్‌లన్నీ బిల్లులుగా ఇటీవల కాలంలో ప్రభుత్వం అమ ల్లోకి తెచ్చిన ఏడు ఆర్డినెన్స్‌లను అసెంబ్లీలో బిల్లులుగా ప్రవేశపెట్టి చట్ట రూపమిచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలి పింది. ఏపీ ట్రిబ్యునల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను హైకోర్టుకు బదలాయించే ఆర్డినెన్స్‌కు చట్టరూపం. కొత్త జిల్లాల ఏర్పా టు కోసం జిల్లాల పునర్విభజన చట్టానికి సవరణ, రామగుండం, నిజామా బాద్, కరీంనగర్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌లను అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులుగా ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ పంపించిన ప్రతిపాదనల మేరకు కొన్ని శాఖల్లో కొత్త పోస్టుల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్క్‌ఫెడ్‌కి రూ.150 కోట్ల రుణం, ఆయిల్ పామ్ చట్టాన్ని తెలంగాణకు అన్వయించుకునేందుకు ఆమోదం తెలిపింది. -
నలుగురు కాశ్మీర్ విద్యార్థులను చితక్కొట్టారు
జైపూర్: మరోసారి బీఫ్ వివాదం వెలుగుచూసింది. తమ వసతి గృహంలో బీఫ్ వండుకొని తింటున్నారని వదంతులు వ్యాపించడంతో నలుగురు కశ్మీర్ విద్యార్థులపై దాడి జరిగిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని చిత్తోర్ గఢ్ లోగల మెవార్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నలుగురు కశ్మీర్ విద్యార్థులు ఉన్నారు. వారు సోమవారం సాయంత్రం గొడ్డుమాంసం తమ వసతి గృహంలో వండుకుంటున్నారని తెలియడంతో కొంతమంది హిందు కార్యకర్తలు నినాదాలతో అక్కడికి వచ్చి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం పోలీసులకు తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. అనంతరం వారు వండిన మాంసాన్ని ఫొరెన్సిక్ టెస్ట్ కోసం పంపించారు. దీనిపై వర్సిటీ యాజమాన్యం స్పందిస్తూ 'మా విశ్వవిద్యాలయంలో దాదాపు 23 రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు. ఇదొక మినీ భారత్ లాంటిది. కొన్నిసార్లు చిన్నచిన్న ఘటనలు జరగడం సాధారణం. ఎందుకంటే ఇక్కడికొచ్చిన విద్యార్థులవి భిన్న అలవాట్లు భిన్న సంస్కృతులు' అని చెప్పారు. -
ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
విజయవాడ: టీచర్ ఎమ్మెల్సీలతో ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సమావేశం అయ్యారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రైవేట్ వర్శిటీల బిల్లుపై చర్చిస్తామన్నారు. ప్రైవేట్ వర్శిటీల బిల్లుపై నిర్లయం తీసుకున్నాక మాతో చర్చలెందుకని టీచర్ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, ఏవీఎస్ శర్మ, గేయనంద్, వై. నివాస్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
ఇలా గొంతునొక్కి..
రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. బూటు కాళ్లతో విద్యార్థుల ముఖాలపై తొక్కారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. లాఠీలతో చావబాదారు. ఆడ, మగ తేడా లేకుండా జుట్టు పట్టుకొని మరీ రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనతో సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. శనివారం కార్యాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించలేదు. సీఎం క్యాంపు కార్యాలయం నలువైపులా భారీగా మోహరించారు. కొందరు విద్యార్థులు హఠాత్తుగా సీఎం క్యాంపు కార్యాలయం సమీపానికి దూసుకువచ్చి నినాదాలు ప్రారంభించడంతో కంగుతిన్న పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి కె.వసంత్‌ను రోడ్డుపై పడదోసినా నినాదాలు చేస్తుండటంతో బూటుకాలుతో నుదుటిపై తన్నారు. - సాక్షి, విజయవాడ -
క్యాంపస్‌లో మాల్స్, బ్యూటీ సెలూన్లు!
విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రైవేటు వర్సిటీల వినూత్న పంథా న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఎంలలో చేరేందుకు ఏటా వేలాది మంది విద్యార్థులు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో విద్యారంగంలో పోటీని తట్టుకునేందుకు దేశంలోని ప్రైవేటు యూనివర్సిటీలు వినూత్న పంథాను అనుసరిస్తున్నాయి. అత్యుత్తమ బోధన, 100 శాతం ప్లేస్మెంట్ హామీలతో ప్రకటనలు గుప్పిస్తూనే మరోవైపు యువత అభిరుచులకు తగ్గట్లు క్యాంపస్‌లను తీర్చిదిద్దుతున్నాయి. క్యాంపస్‌లలో షాపింగ్ మాల్స్, బ్యూటీ సెలూన్లు, స్విమ్మింగ్ పూల్స్, ఏటీఎంలు, ఫిట్నెస్ కేంద్రాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. 600 ఎకరాల్లో ఏర్పాటైన జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సుమారు 30 వేల మంది విద్యార్థులకు నివాస ప్రాంతాలను నిర్మించింది. ఓపెన్ ఎయిర్ థియేటర్, సూపర్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, 40 ఏటీఎంలు, ఆరు బ్యాంకుల బ్రాంచీలను ఏర్పాటు చేసింది. పుణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, నోయిడాలోని శారదావర్సిటీ, నోయిడా, జైపూర్, లక్నోలలో భారీ క్యాంపస్లుగల అమిటీ యూనివర్సిటీలు కేఫటేరియాలు, బ్యూటీ సెలూన్లను ఏర్పాటు చేశాయి. మహారాష్ట్రలోని ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, తమిళనాడులోని సత్యభామ వర్సిటీలలోనూ ఇవే తరహా సౌకర్యాలు ఉన్నాయి. నోయిడాలోని గల్గోటియా వర్సిటీలో డ్యాన్స్, మ్యూజిక్ స్టూడియో, బెంగళూరులోని జైన్ వర్సిటీలో కార్డియో ఫిట్నెస్ సెంటర్, స్టీమ్‌బాత్ సౌకర్యాలున్నాయి.