మంత్రివర్గ సమావేశం అనంతరం బయటకు వస్తున్న కేసీఆర్, హరీశ్‌రావు
• ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా
• కడియం సారథ్యంలో సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సి టీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెద్ద నోట్ల రద్దుతో కొన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా నగదు రహిత విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించింది. ఈ రెండు అంశాలపై మంత్రివర్గ ఉప సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే కొత్త భూసేకరణ చట్టానికి పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టుల భూసేకరణను వేగంగా పూర్తి చేసేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 123, కేంద్రం తెచ్చిన 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా మరింత మెరుగైన పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ జీవోలు, సవరణల న్నింటినీ కలిపి చట్ట రూపం ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
ఇందుకు ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టనుంది.ఈ నెల 16 నుంచి అసెంబ్లీ, శాసన మండలి శీతాకాల సమా వేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ మూడు గంటల పాటు కొనసాగింది. ప్రధానంగా అసెంబ్లీలో చర్చకు వచ్చే అంశాలపైనే మంత్రివర్గం ఈ సమావేశంలో చర్చించింది. అసెంబ్లీ నోటిఫికేషన్ వెలువడటంతో మంత్రివర్గ భేటీకి సంబంధించిన అంశాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. కానీ విశ్వసనీయంగా వివిధ అంశాలు బయటకు తెలిశాయి.
రెండు సబ్ కమిటీల ఏర్పాటు
ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, జోగురామన్న, తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా ఉంటారు. కమిటీ సలహాదా రుగా రాజీవ్‌శర్మను నియమించింది. సబ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పా టుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. నగదు రహిత విధానం, టీఎస్ వ్యాలెట్‌ను రూపొందించేందుకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు నేతృత్వంలో మరో సబ్ కమిటీని నియమించింది. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలు, సంబంధిత విధివిధానాల రూపకల్పన బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావును సభ్యులుగా నియమించారు.
బ్రజేష్ తీర్పుపై సుప్రీంకోర్టుకు
కృష్ణా జలాలపై బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ వివాదం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమని చెబుతున్న ట్రిబ్యునల్.. నీటి పంపకాలపైనా కొత్త చిక్కు లు లేవనెత్తుతోంది. బేసిన్ బయట వాడు తున్న నీటిపై ఎలాంటి నిర్ణయం చేయబో మనే సంకేతాలివ్వడంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్న చర్చ జరిగింది. ఏపీ తన కేటాయింపులు 512 టీఎంసీల్లో 351 టీఎంసీలను బేసిన్ బయట ఉన్న పోతిరెడ్డిపాడు, గాలేరు– నగరి, హంద్రీనీవాలకు మళ్లిస్తోంది. కాగి తాలపై ఇది 351 టీఎంసీలే ఉన్నా వాస్త వానికి అది 550 టీఎంసీలని కేబినెట్ దృష్టికి వచ్చింది.
ట్రిబ్యునల్ ఈ విషయం పట్టించుకోక పోతే తెలంగాణ భారీగా నష్టపోనుంది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మార్గమని కేబినెట్ తీర్మానించింది. ఇప్పుడు అప్పీల్‌కు వెళ్లకుంటే గతం లో సెక్షన్–3 కింద వేసిన కేసు సైతం బలహీనపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నెల 17నుంచి సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు ఉన్నందున 16 లోగా స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఆ శాఖల ఉద్యోగుల బదిలీలు
పని భారం లేని శాఖల నుంచి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న శాఖలకు ఉద్యోగులను బదిలీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని పీవీ నర్సింహారావు యూనివర్సిటీగా పేరు మార్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇకపై ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చడానికి రెండు సందర్భాల్లో కేబినెట్ ఆమోదం అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖలో కొత్తగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్.. ఇలా ఎనిమిది కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ లావాదేవీలన్నీ ఆన్‌లైన్
పెద్ద నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను ఎదుర్కొనేందుకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని కేబినెట్ తీర్మా నించింది. సాధ్యమైనంత త్వరలో తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చడానికి అన్ని రకాల కృషి చేయాలని నిర్ణయించింది. ముందుగా ప్రభుత్వం నుంచి జరిగే చెల్లింపులు, ప్రభుత్వానికి వచ్చే రాబడి సహా ప్రభుత్వ లావాదేవీలన్నీ ఆన్‌లై¯న్‌లో జరిపేందుకు చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ప్రధానంగా ఆర్టీసీ, ప్రజా పంపిణీ వ్యవస్థలో(రేషన్ షాపుల్లో) స్వైపింగ్ మిషన్లు వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. బస్టాండ్‌లలో, బస్సుల్లో టికెట్లు ఆన్‌లైన్ ద్వారా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నగదు రహిత జిల్లాగా సిద్దిపేట, నగదు రహిత గ్రామంగా ఇబ్రహీంపూర్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు దేశానికే ఆదర్శమని ప్రధాని మోదీ కొనియాడటం పట్ల మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది.
ఆర్డినెన్స్‌లన్నీ బిల్లులుగా
ఇటీవల కాలంలో ప్రభుత్వం అమ ల్లోకి తెచ్చిన ఏడు ఆర్డినెన్స్‌లను అసెంబ్లీలో బిల్లులుగా ప్రవేశపెట్టి చట్ట రూపమిచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలి పింది. ఏపీ ట్రిబ్యునల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను హైకోర్టుకు బదలాయించే ఆర్డినెన్స్‌కు చట్టరూపం. కొత్త జిల్లాల ఏర్పా టు కోసం జిల్లాల పునర్విభజన చట్టానికి సవరణ, రామగుండం, నిజామా బాద్, కరీంనగర్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌లను అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులుగా ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ పంపించిన ప్రతిపాదనల మేరకు కొన్ని శాఖల్లో కొత్త పోస్టుల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్క్‌ఫెడ్‌కి రూ.150 కోట్ల రుణం, ఆయిల్ పామ్ చట్టాన్ని తెలంగాణకు అన్వయించుకునేందుకు ఆమోదం తెలిపింది.