కార్పొరేట్ల లబ్ధికే ప్రైవేటు వర్సిటీలు
విద్యార్థి సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రొ.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే పాలకులు ప్రైవేటు యూనివర్సిటీల వైపు మొగ్గు చూపు తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును నిలిపి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యా లయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరాం మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలాంటి స్వయంప్రతి పత్తి కలిగిన విశ్వవిద్యాలయాల్లోనే దళితులు, ఆదివాసీలు తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదని, ఈ పరిస్థితుల్లో ప్రైవేటు యూనివర్సిటీలు వివక్షా కేంద్రాలుగానూ, అసమానతలకు నెలవుగానూ తయారు కావని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.
విద్యారంగ పరిరక్షణకు తెలంగాణ ఉద్యమాన్ని తలపించే సంఘటితపో రుకు విద్యార్థులంతా సిద్ధం కావాల ని ఆయన పిలుపుని చ్చారు. ప్రభు త్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయకుండా, విశ్వవిద్యాలయాలకు గ్రాంట్లను పెంచకుండా, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా నాణ్యమైన విద్య అందడంలేదంటూ విశ్వవిద్యాలయాలపై నెపం మోపడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కేజీ టు పీజీ విద్యను సాధించుకునే దిశగా విద్యార్థి ఉద్యమం బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యారంగంలో తెస్తున్న మార్పులపై ప్రజాస్వామిక వాతావరణంలో చర్చ జరగాల్సి ఉన్నదని ప్రొఫెసర్ చెన్నబసవయ్య అభిప్రాయపడ్డారు.
తెలంగాణ సమాజం కోసం కాక తెలంగాణ పెట్టుబడిదారుల కోసమే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నర్సిరెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో ఔటా నాయకుడు బట్టి సత్యనారాయణ, ప్రొఫెసర్ రవిచంద్ర, ప్రొఫెసర్ కాశీం, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్, ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు వేణు, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు పస్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఈ నెల 19న ఎంఎల్‌ఎ క్వార్టర్స్ ముట్టడికి, 21న యూనివర్సిటీల బంద్‌కి, 23న చలో అసెంబ్లీకి విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు.