సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిలయన్స్ ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు ఇక లేనట్టేనని ఉన్నత విద్యా శాఖ వర్గాలు భావిస్తున్నాయి. 2015లో రిలయన్స్ సంస్థ ఆసక్తితోనే రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు అంశానికి బీజం పడింది. అప్పట్లోనే తాము తెలంగాణలో ప్రైవేటు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, కార్యాచరణ ఆలస్యం కావడంతో ఆ సంస్థ ముంబైలో తమ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంది. దీంతో తెలంగాణలో రిలయన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే అంశం మరుగున పడింది. మరోవైపు హోండా వంటి కంపెనీలు కూడా యూనివర్సిటీ ఏర్పాటుకు ఆసక్తిని ప్రదర్శించినా ఇప్పుడు ముందుకు రావడం లేదు. ఒక్క టెక్ మహీంద్ర మినహా పారిశ్రామిక రంగం వైపు నుంచి రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రావడం లేదు.
అన్నీ విద్యా సంస్థలే..
జాతీయ స్థాయి విద్యా సంస్థలతోపాటు రాష్ట్రంలోని విద్యా సంస్థలే ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. దీంతో ఇప్పటివరకు యూనివర్సిటీల ఏర్పాటుకు 12 సంస్థలు ముందుకు రాగా వాటిల్లో ఏడెనిమిది యూనివర్సిటీలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీల ఏర్పాటు కమిటీ 10 యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాలు, భవనాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను కూడా పంపించింది. త్వరలో మరో 2 యూనివర్సిటీలు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి పంపించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు యూనివర్సిటీల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వాటిల్లో ర్యాడిక్లిప్, శ్రీనిధి, అమిటీ, మల్లారెడ్డి (మహిళా యూనివర్సిటీ), వాగ్దేవి, నిక్‌మర్ వంటి సంస్థలు కొత్త యూనివర్సిటీలను (గ్రీన్ ఫీల్డ్) ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇక ఎంఎన్‌ఆర్ (హెల్త్ యూనివర్సిటీ), టెక్ మహీంద్ర(మహీంద్ర ఏకోల్), వోక్సన్, అనురాగ్, గురునానక్, ఎస్‌ఆర్‌వంటివి తమ పాత విద్యా సంస్థలనే యూనివర్సిటీలుగా మార్పు చేసేందుకు (బ్రౌన్ ఫీల్డ్) ముందుకు వచ్చాయి.
పాత విద్యా సంస్థల్లో పాత ఫీజులే..
రాష్ట్రంలో తమకు ఉన్న విద్యా సంస్థలను యూనివర్సిటీలుగా మార్పు చేసేందుకు ముందుకు వచ్చిన విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఉన్న ఫీజులను కొనసాగించాల్సి ఉంటుందని మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల చట్టంలో పేర్కొన్న ప్రకారం కాలేజీ నుంచి యూనివర్సిటీగా మారే విద్యా సంస్థల్లో ఇప్పుడున్న సీట్లలో రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) ఖరారు చేసిన ఫీజులే అమలు చేయాల్సి ఉంటుందని, ఆయా సీట్ల భర్తీలో రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆయా యూనివర్సిటీలు అదనంగా ఇన్‌టేక్ పెంచుకుంటే కనుక ఆయా సీట్లలో యాజమాన్యాల ఇష్టానుసారమే ప్రవేశాలు ఉంటాయని వివరించారు. యూనివర్సిటీల సంఖ్య విషయంలో ఎలాంటి సీలింగ్ లేదని, నిబంధనల ప్రకారం ఉంటే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందన్నారు. ప్రత్యేక లా యూనివర్సిటీ ఏర్పాటుకు దరఖాస్తులు రాలేదన్నారు. యాజమాన్యాల బ్రాండ్ ఆధారంగానే వాటి మనుగడ ఉంటుందన్నారు.
ప్రైవేటు వర్సిటీల్లో రిలయన్స్ లేనట్టే?
Published Wed, Dec 25 2019 3:30 AM | Last Updated on Wed, Dec 25 2019 3:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment