సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వాటికి సంబంధించి మార్గదర్శకాల ఖరారు పూర్తికావొచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రైవేటు వర్సిటీలను అనుమతించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 28న అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. తర్వాత పలు కారణాలతో దీనిపై ప్రభుత్వం దృష్టిసారించలేకపోయింది. జాతీయస్థాయి సంస్థలు, విదేశీ విద్యాసంస్థలూ రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుపై అవసరమైన మార్గదర్శకాలను ఉన్నత విద్యాశాఖ దాదాపు ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ ఆమోదం లభించిన వెంటనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. వాటిల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రముఖ సంస్థల ఆసక్తి
రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాయి. దీంతో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశ పెట్టేలా చూడాలని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే సంస్థలకు యూనివర్సిటీలు ఏర్పాటు చేసేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్ తమ విద్యా సంస్థను స్థాపించింది. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉంది.
రూ. 30 కోట్ల కార్పస్ ఫండ్
రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీలను ఏర్పాటు చేసే సంస్థలకు రూ.30 కోట్లను కార్పస్ ఫండ్‌గా ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే విద్యా సంస్థలు నడుస్తుంటే వాటికి మాత్రం కార్పస్ ఫండ్‌లో కొంత మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే కనీసం 20 ఎకరాల స్థలం ఉండాలని, పట్టణ ప్రాంతాల్లో అయితే 10 ఎకరాల స్థలం ఉండాలన్న నిబంధనను పొందుపరుస్తున్నట్లు తెలిసింది.
ప్రైవేటు వర్సిటీల చట్టంలో పేర్కొన్న ప్రధాన అంశాలు
- ప్రైవేటు యూనివర్సిటీలు పూర్తి స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి.
- వాటిల్లో కోర్సుల నిర్వహణ, ప్రవేశాల విధానం, ఫీజులను వర్సిటీలే నిర్ణయిస్తాయి.
- తెలంగాణ విద్యార్థులకు మాత్రం 25% సీట్లు కల్పిస్తారు.
- లింగ వివక్ష, ప్రాంతం, కులం, పుట్టిన ప్రదేశం, మతం, రాజకీయ కోణం, ఇతర కారణాలతో ఎవరికీ ప్రవేశాలను తిరస్కరించడానికి వీల్లేదు.
- తెలంగాణలో ఇప్పటికే ఉన్న విద్యా సంస్థలు వర్సిటీగా ఏర్పడితే:
- ప్రవేశాల్లో పాత విధానమే అమలు చేయాలి. సీట్ల భర్తీలో ఇప్పుడున్న రూల్ ఆఫ్ రిజర్వేషనే వర్తిస్తుంది.
- ఫీజు విధానం కూడా ఇప్పుడున్న ప్రకార మే కొనసాగుతుంది. తెలంగాణ ఫీజుల నియంత్రణ, ప్రవేశాల కమిటీ నిర్ణయించిన ప్రకారమే కొనసాగుతాయి.
- యూనివర్సిటీలు ఏర్పాటైన ఐదేళ్లలోగా నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు పొందాలి.
- నోటిఫికేషన్ జారీ చేశాక వర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థల నుంచి నిపుణుల కమిటీ దరఖాస్తులను(ప్రాజెక్టు రిపోర్టులను) స్వీకరిస్తుంది.
- ఆ ప్రాజెక్టు రిపోర్టును ఆమోదించడమా? తిరస్కరించడమా? అన్నది 30 రోజుల్లో తేల్చుతుంది.
Comments
Please login to add a commentAdd a comment