నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం ఓగోడులో మట్టి తవ్వుతున్న ప్రవీణ్‌కుమార్
కేతేపల్లి/నకిరేకల్: పాఠశాలల్లో కనీస వసతులు కల్పించకుండా, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని గుడివాడ, కొత్తపేట, కేతేపల్లి, ఉప్పలపహాడ్, భీమారం, నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలో పర్యటించి ప్రజలతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యనందించాలని కోరితే పాలకులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాని విమర్శించారు. దళితుల కుటుంబాలకు ప్రభుత్వం జీవిత కాలంలో రూ.10 లక్షలు ఇచ్చే బదులు వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందిస్తే వారు నెలకు రూ.5 లక్షలు సంపాదించే ఉద్యోగాలు సాధిస్తారని తెలిపారు. తాను ఇప్పటి వరకు 170 గ్రామాల్లో పర్యటించానని, ఎక్కడ చూసినా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల చేతిలో ఓటమి నుంచి సీఎం కేసీఆర్‌ను ఎవ్వరూ కాపాడలేరని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చోహన్, నాయకులు కిరణ్, నర్సింహ, సైదులు, జిల్లా మహిళా కన్వీనర్ నిర్మల, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment