సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలతో సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల డైట్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం 26% పెంచింది. డైట్ చార్జీల పెంపుపై ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సబ్ కమిటీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ సీఎం కేసీ ఆర్ శనివారం రాష్ట్ర సచివాలయంలో సంతకం చేశారు. పెరి గిన డైట్ చార్జీలు జూలై నుంచి అమలులోకి రానున్నాయి.
గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, వెనకబడిన తరగతులు సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలతో పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లోని 7.5 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీల పెంపుతో ప్రయోజనం చేకూరనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.237.24 కోట్ల అదనపు భారం పడనున్నా లెక్కచేయకుండా విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సన్నబియ్యం అన్నంతో చక్కటి భోజనాన్ని ఇప్పటికే అందిస్తున్నామ న్నారు. ఇప్పుడు మరింత గొప్పగా భోజన వసతులను కల్పించేందుకే డైట్ చార్జీలు పెంచామని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు.
డైట్ చార్జీల పెంపు నిర్ణయంపై మంత్రులు హర్షం
సాక్షి, హైదరాబాద్: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో సంక్షేమ విద్యార్థుల డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర పౌరసరఫరాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment