సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నం..
విద్యార్థుల అరెస్ట్
హైదరాబాద్: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం హైదరాబాద్ బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. క్యాంపు ఆఫీసు చేరుకుంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి షాయినాజ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు తోపులాట, వాగ్వాదం జరిగింది. ఓయూ జేఏసీ నేత విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఉస్మానియా సహ ఇతర యూనివర్సిటీలకు ఇంతవరకు వైస్ చాన్స్‌లర్లను, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించలేదన్నారు. విద్యార్థుల మెస్‌చార్టీలను చెల్లించడంలేదని ఆరోపించారు.
తాము ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ పిలుపునకు భయపడి సీఎం కేసీఆర్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేయించారని, అందుకే క్యాంపు ఆఫీసును ముట్టడించామని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఆందోళనలో నాయకులు చరణ్‌కౌషిక్, కైలాస్‌నేత, రమేష్‌ముదిరాజ్ పాల్గొన్నారు.