
వీసీ దొంగచాటుగా ఎందుకొచ్చారు?
గుట్టుచప్పుడు కాకుండా భద్రతతో హెచ్‌సీయూ వీసీ అప్పారావు తమ ఇంటికి రావడాన్ని రోహిత్ తల్లి రాధిక తీవ్రంగా తప్పుబట్టారు.
అప్పారావు తమ నివాసానికి రావడంపై రోహిత్ తల్లి రాధిక
సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా భద్రతతో హెచ్‌సీయూ వీసీ అప్పారావు తమ ఇంటికి రావడాన్ని రోహిత్ తల్లి రాధిక తీవ్రంగా తప్పుబట్టారు. ఏ తప్పు చేయనప్పుడు అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఆయన యూనివర్సిటీకి ఎందుకు రావడం లేదని నిలదీశారు. తన కుమారుడి మరణానంతరం ఆమె మీడియా ముంగిటకొచ్చి తొలిసారిగా వర్సిటీలో మాట్లాడారు. కుమారుడిని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వీసీ తమ నివాసానికి వచ్చి తనతో మాట్లాడడానికి ప్రయత్నించగా... తాను తిరస్కరించినట్లు చెప్పారు. వీసీ ఏం చెప్పాలకున్నా తన కుమారుడి తోటి విద్యార్థుల ఎదుట వర్సిటీలో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆయన వర్సిటీకి రాకున్నా.. తాను వర్సిటికి వెళ్లాక ఫోన్‌లో విద్యార్థుల నడుమ మాట్లాడాలని సూచించాననన్నారు. తన కుమారుడిని వర్సిటీ నుంచి ఎందుకు బహిష్కరించారో ఇప్పటికీ చెప్పలేదని పేర్కొన్నారు. బహిష్కరించిన సమయంలో కనీస బాధ్యతగా గార్డియన్ అయిన తల్లికి చెప్పాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. ‘‘నా బిడ్డ చేసిన తప్పేమిటో చెప్పాలి. మరో తల్లికి నాలా జరగకూడదు. నా కుమారుడి ఆత్మహత్య వెనుక ఎవరున్నారో తెలియాలి. వారికి శిక్షపడాలి. నా కుమారుడి ఆశయాలు నెరవేరే దాకా దీక్షలో కూర్చుంటా..’ అని రాధిక స్పష్టం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని, అవసరమైతే ఢిల్లీకైనా వెళతానని చెప్పారు.
ఎస్సీయే..: రోహిత్ కులంపై వస్తున్న భిన్న వాదనలను అతని సోదరుడు రాజా కొట్టిపారేశారు. ‘‘మా అన్న మెరిట్ స్టూడెంట్. అతను కులం ఆధారంగా వర్సిటీలో ప్రవేశం పొందలేదు. మెరిట్ ప్రాతిపదికన సీటు సాధించాడు. అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా నేనే అందజేశా. మాది ఎస్సీ సామాజిక వర్గమే. కుల విషయాన్ని పక్కనబెట్టి.. రోహిత్ ఎందుకు చనిపోయారో తేల్చాలి..’’ అని డిమాండ్ చేశారు. తమది నిరుపేద కుటుంబమని, అన్నయ్యే తమకు ఆధారమని పేర్కొన్నారు. ఆయన ఆశయాల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.