
రాహుల్ రాజకీయం చేస్తున్నారు
రోహిత్ ఆత్మహత్యపై కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్యను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. యూనివర్సిటీలో విద్యార్థి సమస్యలను రాజకీయ చేయడం దురదృష్టకరమని, ఇది ఆయనకు తగదని అన్నారు. కిషన్‌రెడ్డి పార్టీ నేతలు కె.లక్ష్మణ్, చింతా సాంబమూర్తి తదితరులతో కలసి హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. దేశద్రోహం నేరం కింద యాకుబ్ మెమన్ ఉరితీతను నిరసించిన విద్యార్థులతో వర్సిటీలో వాదోపవాదాలు జరిగాయని, ఈ సందర్భంగా ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్‌పై దాడులు చేశారన్నారు.
వారి సస్పెన్షన్‌తో కేంద్రమంత్రి దత్తాత్రేయకు నేరుగా సంబంధం లేదని, వర్సిటీ వీసీకి ఆయన లేఖ రాయలేదని పేర్కొన్నారు. దేశంలో అనేక సంఘటనలు, ఆత్మహత్యలు వేర్వేరు కారణాలతో జరుగుతున్నాయని, ప్రతీ దానిని రాజకీయ కోణంలోనే చూడటం మంచిదికాదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ఎంపీ కవిత శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని చింతా సాంబమూర్తి విమర్శించారు. దళితుడే తొలి సీఎం అని చెప్పి మాటతప్పిన కేసీఆర్‌కు దళితుల ప్రస్తావన తెచ్చే అర్హత లేదన్నారు.