
రాహుల్‌కు ఎంపీగా కొనసాగే హక్కు లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదులను సమర్థిస్తున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎంపీగా కొనసాగే నైతిక హక్కు లేదని, ఆయన పేరు చివర గాంధీ అని పెట్టుకునే హక్కు కూడా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తన నాయనమ్మ ఇందిరా గాంధీ, తన తండ్రి రాజీవ్ గాంధీ ఎందుకు చనిపోయారో రాహుల్, ఇంకా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలన్నారు. అఫ్జల్‌గురును, యాకుబ్ మెమెన్‌లను పొగడ డం అంటే భారతమాతను, పార్లమెంట్‌ను, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను, లక్షలాది మంది అమరులైన వీరసైనికులను అవమానించడమేనన్నారు.
శనివారం బీజేపీ లీగల్‌సెల్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దేశానికి, సమగ్రతకు వ్యతిరేకంగా, పార్లమెంట్‌పై దాడికి కుట్రలో పాలుపంచుకున్న అఫ్జల్‌గురును సమర్థించే ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. దేశసమగ్రత వంటి అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో భాగంగా ఆదివారం గ్రామస్థాయి వరకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే సోమవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు కిషన్‌రెడ్డి చె ప్పారు. బీజేపీ లీగల్‌సెల్ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేఎల్పీనేత కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, పార్టీనేత చింతా సాంబమూర్తి, బార్‌కౌన్సిల్ చైర్మన్ నరసింహారావు పాల్గొన్నారు.