
‘రాహుల్ యాకూబ్’గా పేరు మార్చుకో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదానికి అనుకూలంగా కాంగ్రెస్ విధానాలను మార్చుకున్నదని, రాహుల్‌గాంధీ కూడా తన పేరును ‘రాహుల్ అఫ్జల్‌గురు, రాహుల్ యాకూబ్’గా మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. జేఎన్‌యూలో జరిగిన ఘటనలు, దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసే ఉగ్రవాదుల చర్యలకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు చెప్పడం దేశాన్ని విస్తుబోయే లా చేస్తున్నాయన్నారు. పథకం ప్రకారం ఉగ్రవాదులకు మద్దతుగా ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. బుధవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేశ భద్రతకు, సమగ్రతకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసేవారికి కొన్ని పార్టీలు మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడాన్ని సరైన చర్యగా సమర్థిస్తారా అని ప్రశ్నించారు. దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చేవాళ్లు రాహుల్‌కు దేశభక్తుల్లా కనిపిస్తున్నారా అన్నారు. కాంగ్రెస్ నాయకులకు సద్బుద్ధి రావాలని కోరుతూ పూజలు, సంతకాల సేకరణ చేపడతామన్నారు. 19, 20, 21 తేదీల్లో జన స్వాభిమాన్ అభియాన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ధర్నాలు, ఊరేగింపులు నిర్వహిస్తామన్నారు.