రాహుల్‌.. జైనూర్‌, కోల్‌కతా ఘటన కనిపించడం లేదా?: కిషన్‌ రెడ్డి | Minister Kishan Reddy Political Counter To Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌.. జైనూర్‌, కోల్‌కతా ఘటన కనిపించడం లేదా?: కిషన్‌ రెడ్డి

Published Sat, Sep 7 2024 6:53 PM | Last Updated on Sat, Sep 7 2024 11:12 PM

Minister Kishan Reddy Political Counter To Rahul Gandhi

సాక్షి, హైదరాబాద్‌: మహిళల భద్రతపై మాట్లాడే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు గురించి మాట్లాడాలని హితవు పలికారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణ జైనూరులో ఆదివాసి మహిళపై జరిగిన అఘాయిత్యం కనిపించలేదా?.. ఇదేనా మార్పు అని ప్రశ్నించారు.

మహిళల భద్రత విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి కిషన్‌రెడ్డి కౌంటరిచ్చారు. తాజాగా కిషన్‌ రెడ్డి..‘మహిళల భద్రతపై మొసలి కన్నీరు కాదు. కళ్లు తెరిచి చూడు రాహుల్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రోజుకో అఘాయిత్యం, వేధింపుల పర్వం కొనసాగుతోంది. మహిళలకు రక్షణ కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల భద్రతపై మాట్లాడటం హాస్యాస్పదం. మహిళల భద్రతపై కాంగ్రెస్ పార్టీకి,  రాహుల్ గాంధీకి వివక్ష తగదు. భద్రతకు అభయమివ్వని హస్తానికి అధికారమెందుకు?.

బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన గుర్తుకు రాగానే.. నిద్రలోంచి లేచి మహిళలపై అఘాయిత్యాలు దారుణం అని ప్రకటనలు గుప్పించే రాహుల్‌కు తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై జరిగిన అమానవీయ ఘటన గుర్తుకు రాలేదా?. మైనారిటీ సంతుష్టికరణ విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, రాహుల్‌కు ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు?. అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ మైనార్టీ కావడంతోనే రాహుల్, కాంగ్రెస్ ఈ ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఘటన జరిగినా, తక్షణమే విచారణ జరిపి, నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, వారిలాగా మహిళలపై దాడులు నివారించడంలో వివక్ష చూపించడం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటన, జైనూర్‌లో జరిగిన ఘటనను ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు . ఇప్పటికైనా రాహుల్ గాంధీ మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని మహిళలపై జరుగుతున్న దాడులు ఘటనల పట్ల వివక్ష చూపరాదని అన్నారు

తెలంగాణలో గత మూడు నెలల్లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు..

1) 13-జూన్-24 - పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు.

2) 22-జూన్-24 - నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక గిరిజన మహిళను వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి, ఆమెను కాల్చి, కొట్టి, ఆమె కళ్లకు, ప్రైవేట్ భాగాలలో కారం పొడి చల్లారు.

3) 21-జూలై-24 - నాగర్‌కర్నూల్ జిల్లా హాజీపూర్‌లో ఇద్దరు మహిళా కూలీలపై షాపు యజమానులు కారులో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

4) 24-జూలై-24 - మలక్‌పేట అంధుల పాఠశాలలో 8 ఏళ్ల చూపులేని బాలికపై దాడి జరిగింది.

5) 30-జూలై-24 - నిర్మల్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ ప్రయాణీకురాలు కదులుతున్న బస్సులో అత్యాచారానికి గురైంది.

6) 30-జూలై-24 - వనస్థలిపురంలో 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

7) 4-ఆగస్టు-24 - దొంగతనం ఆరోపణతో దళిత మహిళ సునీతను షాద్‌నగర్ పోలీసులు దారుణంగా హింసించారు.

8) 22-ఆగస్టు-24 - నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్‌ మద్దతుదారులు దాడి చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement