నేనే బాధితుడిని: ఏబీవీపీ అధ్యక్షుడు
సెంట్రల్ వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్
హైదరాబాద్: హెచ్‌సీయూలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలలో తానే బాధితుడినని... కానీ రాజకీయ పార్టీలు తననే బాధ్యుడిగా చేస్తుండడం ఆవేదనకు గురిచేస్తోందని హెచ్‌సీయూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతడి ఆత్మహత్యకు కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు సంబంధం లేదన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఏబీవీపీ రాష్ట్ర కార్యాలయంలో సుశీల్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘గత ఆగస్ట్ 2న ఉగ్రవాది మెమన్ ఉరితీతకు వ్యతిరేకంగా క్యాంపస్‌లో నమాజ్ చేశారు. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్‌ఏ) వాళ్లు ప్రదర్శించిన పోస్టర్లలో ఒక మెమన్‌ను ఉరితీస్తే ప్రతి ఇంటి నుంచి మరో మెమన్ పుడతాడని రాశారు. దీన్ని నిరసిస్తూ నేను ‘ఏఎస్‌ఏ గూన్స్’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. దీంతో ఏఎస్‌ఏకు చెందిన 40 మంది అర్ధరాత్రి వచ్చి రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి తిట్టుకుంటూ, క్షమాపణలు చెప్పాలంటూ దాడి చేశారు.
నాకు రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరి పోలీసులకు ఫోన్ చేశాను. కొద్దిసేపటికి వర్సిటీ సెక్యురిటీ వ్యాన్, పోలీసులు రాగా... వ్యాన్‌లో కూర్చున్న తరువాత కూడా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. వర్సిటీ సెక్యూరిటీ ఆఫీసుకు తీసుకెళ్లి క్షమాపణ లేఖ రాయించుకున్నారు. అక్కడే సెక్యూరిటీకి చెందిన కంప్యూటర్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి క్షమాపణ పత్రాన్ని అప్‌లోడ్ కూడా చేశారు. భయాందోళనలో కూరుకుపోయిన నేను.. మా అన్నకు ఫోన్ చేశాను.
తాను వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. విషయం తెలుసుకుని మా అమ్మ వర్సిటీలోని వీసీ చాంబర్‌కు వచ్చారు. దాంతో 30-40 మంది ఏఎస్‌ఏ సభ్యులు అక్కడికి వచ్చి మా అమ్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కంప్యూటర్ ఎత్తిపడేశారు. ఈ విషయాలన్నీ వీసీ చాంబర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి కూడా...’’ అని సుశీల్ చెప్పా రు. అనంతరం ఆ వీడియోలను విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ ఘటనపై విచారించి ఘటనతో సంబంధమున్న విద్యార్థులను వర్సిటీ సస్పెండ్ చేసిందన్నారు. వర్సిటీలో సస్పెండ్ ఘటనలు కొత్తేమీ కాదని, ఇప్పటివరకు ఏబీవీపీకి చెందిన 35మంది విద్యార్థులను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.
కానీ ప్రస్తుతం సస్పెండైన వారు సామాజిక బహిష్కరణ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనను కొట్టిన పది రోజులకు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఓ విద్యార్థినీ కొట్టారని... ఎస్‌ఎఫ్‌ఐనాయకులు సహా అనేకమంది విద్యా ర్థులపై దాడికి దిగుతున్నారన్నారు. క్యాంపస్‌లో దేశ విద్రోహ చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్లు పాఠాలు చెప్పకుండా దేశ భద్రతకు విఘాతం కలిగించేలా చేస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యప్ప ఆరోపించారు.