sushilkumar
-
దొంగలొస్తే.. దొరకబుచ్చుకుని..
సనత్‌నగర్ (హైదరాబాద్): ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి తల్లీకూతుళ్లను బెదిరించి, దోపిడీకి ప్రయత్నించారు. కానీ వారు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకరిని గదిలో బంధించారు. మరొకరిని పట్టుకునేందుకు ప్రయత్నించినా, పరారయ్యాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. హైదరాబాద్‌లోని బేగంపేట పైగాకాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల మేరకు.. మాస్్క, హెల్మెట్ పెట్టుకుని.. బేగంపేట పైగాకాలనీకి చెందిన నవరతన్ జైన్, అమిత్ మహోత్ (46) భార్యాభర్తలు. వారికి ఒక మైనర్ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నవరతన్ ఇంట్లో లేని సమయంలో.. ఇద్దరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి.. ఇంట్లోని నగలు, నగదును తీసుకురావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్ కుమార్తె ధైర్యంగా ముందుకొచ్చింది. తల్లీకూతురు కలిసి దుండగులతో పెనుగులాడారు. ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది. అప్పటికే తల్లీకూతురు కలసి ఒకరిని లోపల బంధించారు. మరొకరు పారిపోతుండగా.. వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వారిని నెట్టేసి పరారయ్యాడు. లోపల బంధించిన రెండో వ్యక్తి కూడా బయటపడి కత్తితో బెదిరిస్తూ, పారిపోయే యత్నం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గతంలో పనిచేసిన వ్యక్తే.. ఆ ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్‌చంద్, అతడి స్నేహితుడు సుశీల్‌కుమార్ కలసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రేమ్‌చంద్‌ను స్థానికులు పట్టుకోగా.. పరారైన సుశీల్‌కుమార్‌ను పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారి నుంచి రెండు కత్తులు, తపంచా (నాటు తుపాకీ)లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దుండగులు మారణాయుధాలతో వచ్చినా తల్లి, కుమార్తె భయపడకుండా ఎదుర్కోవడంపై పోలీసులు, ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. -
నేనే బాధితుడిని: ఏబీవీపీ అధ్యక్షుడు
సెంట్రల్ వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ హైదరాబాద్: హెచ్‌సీయూలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలలో తానే బాధితుడినని... కానీ రాజకీయ పార్టీలు తననే బాధ్యుడిగా చేస్తుండడం ఆవేదనకు గురిచేస్తోందని హెచ్‌సీయూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్‌కుమార్ పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతడి ఆత్మహత్యకు కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు సంబంధం లేదన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఏబీవీపీ రాష్ట్ర కార్యాలయంలో సుశీల్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘గత ఆగస్ట్ 2న ఉగ్రవాది మెమన్ ఉరితీతకు వ్యతిరేకంగా క్యాంపస్‌లో నమాజ్ చేశారు. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ) వాళ్లు ప్రదర్శించిన పోస్టర్లలో ఒక మెమన్ను ఉరితీస్తే ప్రతి ఇంటి నుంచి మరో మెమన్ పుడతాడని రాశారు. దీన్ని నిరసిస్తూ నేను ‘ఏఎస్ఏ గూన్స్’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. దీంతో ఏఎస్‌ఏకు చెందిన 40 మంది అర్ధరాత్రి వచ్చి రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి తిట్టుకుంటూ, క్షమాపణలు చెప్పాలంటూ దాడి చేశారు. నాకు రెండు నిమిషాలు సమయం ఇవ్వాలని కోరి పోలీసులకు ఫోన్ చేశాను. కొద్దిసేపటికి వర్సిటీ సెక్యురిటీ వ్యాన్, పోలీసులు రాగా... వ్యాన్‌లో కూర్చున్న తరువాత కూడా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. వర్సిటీ సెక్యూరిటీ ఆఫీసుకు తీసుకెళ్లి క్షమాపణ లేఖ రాయించుకున్నారు. అక్కడే సెక్యూరిటీకి చెందిన కంప్యూటర్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి క్షమాపణ పత్రాన్ని అప్లోడ్ కూడా చేశారు. భయాందోళనలో కూరుకుపోయిన నేను.. మా అన్నకు ఫోన్ చేశాను. తాను వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. విషయం తెలుసుకుని మా అమ్మ వర్సిటీలోని వీసీ చాంబర్‌కు వచ్చారు. దాంతో 30-40 మంది ఏఎస్ఏ సభ్యులు అక్కడికి వచ్చి మా అమ్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కంప్యూటర్ ఎత్తిపడేశారు. ఈ విషయాలన్నీ వీసీ చాంబర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి కూడా...’’ అని సుశీల్ చెప్పా రు. అనంతరం ఆ వీడియోలను విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ ఘటనపై విచారించి ఘటనతో సంబంధమున్న విద్యార్థులను వర్సిటీ సస్పెండ్ చేసిందన్నారు. వర్సిటీలో సస్పెండ్ ఘటనలు కొత్తేమీ కాదని, ఇప్పటివరకు ఏబీవీపీకి చెందిన 35మంది విద్యార్థులను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం సస్పెండైన వారు సామాజిక బహిష్కరణ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనను కొట్టిన పది రోజులకు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఓ విద్యార్థినీ కొట్టారని... ఎస్ఎఫ్ఐనాయకులు సహా అనేకమంది విద్యా ర్థులపై దాడికి దిగుతున్నారన్నారు. క్యాంపస్‌లో దేశ విద్రోహ చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రొఫెసర్లు పాఠాలు చెప్పకుండా దేశ భద్రతకు విఘాతం కలిగించేలా చేస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యప్ప ఆరోపించారు.