మారణాయుధాలతో వచ్చిన దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు
ఘటనా స్థలంలో ఒకరిని.. కాజీపేటలో మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సనత్‌నగర్ (హైదరాబాద్): ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి తల్లీకూతుళ్లను బెదిరించి, దోపిడీకి ప్రయత్నించారు. కానీ వారు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకరిని గదిలో బంధించారు. మరొకరిని పట్టుకునేందుకు ప్రయత్నించినా, పరారయ్యాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. హైదరాబాద్‌లోని బేగంపేట పైగాకాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల మేరకు..
మాస్‌్క, హెల్మెట్ పెట్టుకుని..
బేగంపేట పైగాకాలనీకి చెందిన నవరతన్ జైన్, అమిత్ మహోత్ (46) భార్యాభర్తలు. వారికి ఒక మైనర్ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నవరతన్ ఇంట్లో లేని సమయంలో.. ఇద్దరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు.
తమ వెంట తెచ్చుకున్న తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి.. ఇంట్లోని నగలు, నగదును తీసుకురావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్ కుమార్తె ధైర్యంగా ముందుకొచ్చింది. తల్లీకూతురు కలిసి దుండగులతో పెనుగులాడారు. ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది.
అప్పటికే తల్లీకూతురు కలసి ఒకరిని లోపల బంధించారు. మరొకరు పారిపోతుండగా.. వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వారిని నెట్టేసి పరారయ్యాడు. లోపల బంధించిన రెండో వ్యక్తి కూడా బయటపడి కత్తితో బెదిరిస్తూ, పారిపోయే యత్నం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
గతంలో పనిచేసిన వ్యక్తే..
ఆ ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్‌చంద్, అతడి స్నేహితుడు సుశీల్‌కుమార్ కలసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రేమ్‌చంద్‌ను స్థానికులు పట్టుకోగా.. పరారైన సుశీల్‌కుమార్‌ను పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
వారి నుంచి రెండు కత్తులు, తపంచా (నాటు తుపాకీ)లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దుండగులు మారణాయుధాలతో వచ్చినా తల్లి, కుమార్తె భయపడకుండా ఎదుర్కోవడంపై పోలీసులు, ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment