బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్ తల్లీ కూతుళ్ల దుర్మరణం
తండ్రికి తీవ్ర గాయాలు
పహాడీషరీఫ్: అనారోగ్యంతో ఉన్న కూతురుకు చికిత్స చేయించేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లీకూతుళ్లు చివరకు అదే ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం విగతజీవులుగా వెళ్లాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాసిపల్లికి చెందిన చిత్తారి గోపాల్(36), లక్ష్మమ్మ(34) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం.
వీరి పెద్ద కూతురు విజయ(14)కు రక్తకణాలు తక్కువగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఉదయం 7.30గంటలకు వారిబైక్‌పై హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి బయలుదేరారు. ఉదయం 9.45గంటల సమయంలో తుక్కుగూడ ఓఆర్‌ఆర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వెనుక ఉంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా శంషాబాద్ టోల్ వైపునకు వాహనాన్ని మళ్లించాడు.
ఈ క్రమంలో టిప్పర్ బైక్‌ను ఢీకొట్టడంతో పడిపోయిన లక్ష్మమ్మ, విజయ తల మీదుగా లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో తల్లీకూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గోపాల్ కాలు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment