premchand
-
దొంగలొస్తే.. దొరకబుచ్చుకుని..
సనత్‌నగర్ (హైదరాబాద్): ఇద్దరు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి తల్లీకూతుళ్లను బెదిరించి, దోపిడీకి ప్రయత్నించారు. కానీ వారు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకరిని గదిలో బంధించారు. మరొకరిని పట్టుకునేందుకు ప్రయత్నించినా, పరారయ్యాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. హైదరాబాద్‌లోని బేగంపేట పైగాకాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల మేరకు.. మాస్్క, హెల్మెట్ పెట్టుకుని.. బేగంపేట పైగాకాలనీకి చెందిన నవరతన్ జైన్, అమిత్ మహోత్ (46) భార్యాభర్తలు. వారికి ఒక మైనర్ కుమార్తె ఉంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నవరతన్ ఇంట్లో లేని సమయంలో.. ఇద్దరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్ పెట్టుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న తపంచా (నాటు తుపాకీ), కత్తి చూపించి.. ఇంట్లోని నగలు, నగదును తీసుకురావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్ కుమార్తె ధైర్యంగా ముందుకొచ్చింది. తల్లీకూతురు కలిసి దుండగులతో పెనుగులాడారు. ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది. అప్పటికే తల్లీకూతురు కలసి ఒకరిని లోపల బంధించారు. మరొకరు పారిపోతుండగా.. వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి వారిని నెట్టేసి పరారయ్యాడు. లోపల బంధించిన రెండో వ్యక్తి కూడా బయటపడి కత్తితో బెదిరిస్తూ, పారిపోయే యత్నం చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గతంలో పనిచేసిన వ్యక్తే.. ఆ ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్‌చంద్, అతడి స్నేహితుడు సుశీల్‌కుమార్ కలసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రేమ్‌చంద్‌ను స్థానికులు పట్టుకోగా.. పరారైన సుశీల్‌కుమార్‌ను పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారి నుంచి రెండు కత్తులు, తపంచా (నాటు తుపాకీ)లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దుండగులు మారణాయుధాలతో వచ్చినా తల్లి, కుమార్తె భయపడకుండా ఎదుర్కోవడంపై పోలీసులు, ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. -
రూ. 300 లక్షల కోట్ల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ స్థాపకుడు ఈయనే..
భారతదేశ ఆర్థిక రాజధాని మొదటి వ్యాపార దిగ్గజాలలో ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ జైన్ ఒకరు. ఆయన్ను ముంబైలో (అప్పట్లో బొంబాయి) బిగ్ బుల్, బులియన్ కింగ్, కాటన్ కింగ్ ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. జమ్సెట్జీ టాటా, డేవిడ్ సాసూన్, జమ్సెట్జీ జెజీబోయ్లతో పాటు నలుగురు బాంబే వ్యాపార యువరాజులలో ఒకరిగా పేరు పొందారు. ప్రేమ్‌చంద్ తన కాలంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. నేటివ్ షేర్ & స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ స్థాపనతో అందరికీ గుర్తుండిపోయారు. అదే ఆ తర్వాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్గా మారింది. బీఎస్ఈ దేశంలో రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. దాంట్లోని అన్ని లిస్టెడ్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాప్ రూ. 300 లక్షల కోట్లకు మించి ఉంది. 1865లో దీనిని స్థాపించినప్పుడు, దక్షిణ బొంబాయిలోని ఒక మర్రిచెట్టు కింద 22 మంది బ్రోకర్లు, ఒక్కొక్కరి నుంచి కేవలం రూపాయి మూలధనంతో ఇది ఏర్పడింది. మొదటి స్టాక్ బ్రోకర్ రాయ్‌చంద్ 1832లో సూరత్‌లో రాయ్‌చంద్ డిప్చంద్ అనే కలప వ్యాపారికి జన్మించారు. ఆయన చిన్నప్పుడే వారి కుటుంబం బొంబాయికి వచ్చేసింది. ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో రాయ్‌చంద్ విద్యాభ్యాసం సాగింది. అదే ఆయన ఇంగ్లిష్‌లో మాట్లాడగల, చదవగల, రాయగల మొదటి భారతీయ బ్రోకర్‌గా అవతరించడానికి సహాయపడింది. రాయ్‌చంద్ 1852లో ఓ విజయవంతమైన స్టాక్ బ్రోకర్‌కు సహాయకుడిగా వృత్తిని ప్రారంభించారు. అసమాన్య జ్ఞాపకశక్తి అసమానమైన జ్ఞాపకశక్తి ప్రేమ్‌చంద్ సొంతం. ఆయన ఎప్పుడూ పెన్ను, పేపర్ వాడలేదు. రాసుకోవడానికి బదులు తన వ్యాపారాలన్నింటినీ కంఠస్థం చేసిన ఆయన కేవలం 6 సంవత్సరాలలో 1858 నాటికి దాదాపు రూ. 1 లక్ష సంపదను ఆర్జించారు. 1861లో జరిగిన అమెరికన్ సివిల్ వార్ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పత్తి వ్యాపారానికి భారత్ హాట్‌స్పాట్‌గా మారింది. దీన్ని ఆయన మరింత విస్తృతం చేశారు. దాతృత్వంలోనూ.. భారీ లాభాలను చవిచూసిన ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్, అంతర్యుద్ధం ముగిశాక 1865లో పత్తి వ్యాపార ప్రాభవం తగ్గడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత తిరిగి పుంజుకుని దాతృత్వం వైపు నడిచారు. ఇందులో భాగంగా బాంబే విశ్వవిద్యాలయంలో రాజాబాయి క్లాక్ టవర్‌కు నిధులు అందించారు. బాలికా విద్యను ప్రోత్సహించారు. అవార్డులు, స్కాలర్షిప్లు అందించేందుకు ఆర్థికంగా సహకరించారు. ప్రేమ్‌చంద్ 1906లో మరణించారు. అతని కుటుంబంలోని నాలుగో తరం ఇప్పుడు ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ సంస్థను నడుపుతోంది. వ్యాపార పరంగా ఒక చిన్న సంస్థే అయినా గొప్ప చరిత్ర దీనికి ఉంది. బైకుల్లాలోని ప్రేమ్‌చంద్ నివసించిన బంగ్లాను తరువాత అనాథాశ్రమం, పాఠశాలగా మార్చారు. -
ఐలా అధ్యక్షుడిగా ప్రేమ్‌చంద్
96 ఓట్ల మెజార్టీతో గెలుపు అక్కిరెడ్డిపాలెం: గాజువాక నోటిఫైడ్ మున్సిపల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) ఎన్నికల్లో పెందుర్తి ప్రేమ్‌చంద్ ప్యానల్ సభ్యులు ఘనవిజయం సాధించారు. బుధవారం ఉదయం నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 624 ఓట్లకు గాను 530 ఓట్లు పోల్ కాగా పోస్టల్ బ్యాలెట్ 9తో కలిపి 539 వచ్చాయి. సాయంత్రం 5.30కు లెక్కింపు ప్రారంభించారు. ఆ ఇద్దరి మధ్యే పోటీ ప్రేమ్‌చంద్, ఎన్.శేషగిరిరావు, వై.సాంబశివరావు చైర్మన్లుగా మూడు ప్యానల్లు బరిలో ఉన్నాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచి శేషగిరిరావు, ప్రేమ్‌చంద్‌ల మధ్య స్వల్ప ఓట్ల తేడా కొనసాగింది. ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి ప్రేమ్ చంద్‌కు 269, శేషగిరిరావుకు 179, సాంబశివరావుకు 87 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రేమ్‌చంద్ 96 ఓట్ల మెజార్టీతో ఐలా చైర్మన్‌గా గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ శేషు ప్రసాద్‌పై 178 ఓట్ల మెజార్టీతో పట్టా నారాయణరావు, కార్యదర్శిగా కె.సత్యనారాయణ రెడ్డి (రఘు) పాతర్లగడ్డ శ్రీనివాసరావుపై 195 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సహాయ కార్యదర్శిగా గూడూరు రామకృష్ణంరాజు, కోశాధికారిగా యార్లగడ్డ రాజేంద్ర ప్రసాద్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఏ, సీ బ్లాక్ నుంచి మహ్మద్ ఖుర్షిద్ మాఛీ, బి (2) – బ్లాక్ నుంచి పంపాన రామకృష్ణ, సర్వసిద్ధి పరదేశి, డి (2) – బ్లాక్ నుంచి అల్లూరి సత్యనారాయణ రాజు, పి.పద్మావతి, డి – ఎక్స్పాన్షన్ నుంచి డోకల నాగేశ్వరరావు, ఈ – బ్లాక్ నుంచి నితీష్ బంగ్, ఎఫ్, జి, ఏఈపి – బ్లాక్ నుంచి ఇ.సూరపరాజు పెదగంట్యాడ బ్లాక్ నుంచి అచ్యుతరామిరెడ్డి, రావూరి సురేష్ బాబు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ప్రతీ రౌండ్‌ను ఐలా కమిషనర్ టి.వేణుగోపాల్ ప్రత్యేకంగా పర్యవేక్షించడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. గట్టి బందోబస్తు నడుమ కౌంటింగ్ నిర్వహించారు. గతంలో ఐలా చైర్మన్‌గా పనిచేసిన ప్రేమ్‌చంద్ ఐలా అభివృద్ధికి కృషి చేయడంతో పాటు తోటి పారిశ్రామిక వేత్తలతో ఉన్న సాన్నిహిత్యం ఆయన విజయానికి దోహదం చేసిందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. గెలుపొందిన 15 మంది సభ్యులకు ఎన్నికల అధికారి మౌని శ్రీధర్, ఐలా కమిషనర్ టి.వేణుగోపాల్, ఏపీఐఐసీ జెడ్ఎం యతిరాజు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ నెల 24న ఐలా ప్రతినిధులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐలా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఐలా కార్యాలయంలో ఐదు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఐలా సిబ్బంది, గాజువాక రెవెన్యూ, ఇండస్ట్రియల్ ఏరియా సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు. ఉదయం కాస్త మందకొడిగా మొదలైనా 9.30 నుంచి పోలింగ్ ఊపందుకుంది. గాజువాక పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులు తమ ఫొటో గుర్తింపు ఎన్నికల కార్డును ప్రవేశపెట్టడంతో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సాగింది. -
గోర్కీ మనవాడు కూడా!
ఫ్లాష్‌బ్యాక్ ‘నాలో సాహిత్యాన్ని సృష్టించే సామర్థ్యం లేదు’ అని నిజాయితీగా చెప్పుకున్న ప్రేమ్‌చంద్ భార్య శివరాణీదేవి తన భర్తతో గల జ్ఞాపకాలను ‘ప్రేమ్‌చంద్ ఘర్ మే’ పేరిట హిందీలో పుస్తకంగా తెచ్చారు. దాన్ని తెలుగులోకి ‘ఇంట్లో ప్రేమ్‌చంద్’గా ఆర్.శాంతసుందరి అనువదించగా, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. అందులో 1936 జూన్‌లో మక్సీమ్ గోర్కీ మరణం తర్వాతి (అదే సంవత్సరం అక్టోబర్‌లో ప్రేమ్‌చంద్ కూడా మరణించడం గమనార్హం.) ఒక ఘటన ఉంది. అది ఇలా సాగుతుంది: ‘‘ఏదో రాస్తున్నారు.’’ ‘‘ఎల్లుండి ‘ఆజ్’ ఆఫీసులో గోర్కీ గురించి మీటింగ్ ఉంది.’’ ‘‘ఏం మీటింగ్ అది? ఒక పక్క ఒంట్లో బాగాలేనప్పుడు, ఈ రాతలేమిటి? ఇప్పుడు టైమెంతో తెలుసా? అర్ధరాత్రి రెండు గంటలు!’’ ‘‘నిద్ర రావటం లేదు ఏం చేసేది. అందుకే ఉపన్యాసం రాసుకుంటున్నాను.’’ ‘‘ఒంట్లో బాగాలేకపోయినా రాయాల్సిందేనా?’’ ‘‘అవును, రాయకపోతే కుదరదు. పైగా నాకిష్టమైన పని చేసేప్పుడు కష్టమనిపించదు! నా కర్తవ్యం అనుకుని చేసేపని ఏదైనా కానీ, కష్టంగా తోచదు. అవే ఒక మనిషికి అన్నిటికన్నా ముఖ్యమని అనిపిస్తాయి.’’ ‘‘అసలది ఎలాంటి మీటింగ్?’’ ‘‘సంతాప సభ.’’ ‘‘అతనెవరు, భారతీయుడేనా?’’ ‘‘అదే మన సంకుచిత మనస్తత్వం! గోర్కీ మహా రచయిత. ఆయనని ఒక ప్రాంతానికీ, దేశానికీ సంబంధించినవాడని అనలేం. ఒక రచయిత ఎక్కడివాడని అడక్కూడదు. ఆయన రచనలు ప్రపంచంలోని అందరికీ మేలు చేసేవే అనుకోవాలి.’’ ‘‘సరే! కానీ ఆయన మన దేశానికి కూడా పనికివచ్చే విషయాలేవైనా రాశాడా?’’ అని అడిగాను. ‘‘రాణీ, ఇంకా నువ్వు తప్పుదారినే ఉన్నావు. అసలు రచయిత దగ్గర ఏం ఉంటుంది అందరికీ విడివిడిగా పంచిపెట్టేందుకు? అతనికున్న ఆస్తల్లా అతని తపస్సు. దాన్నే అందరికీ పంచగలడు. దానివల్ల అందరూ లాభం పొందుతారు. అతను తన తపఃఫలాన్ని తనకోసమంటూ ఏం మిగుల్చుకోడు. సామాన్యంగా అందరూ తపస్సు చేసేది సొంతలాభం కోసం, కానీ రచయిత చేసే తపస్సు వల్ల జనం బాగుపడతారు.’’ ‘‘సరే! కానీ ఆయన మన దేశానికి కూడా పనికివచ్చే విషయాలేవైనా రాశాడా?’’ అని అడిగాను. -
మన కథల వారణాసి
కథలెందుకు రాస్తారు? వాళ్లూ వీళ్లూ సరే. మన దగ్గర ఎవరున్నారు? ప్రపంచస్థాయి రచయితలు ఎవరున్నారు? ప్రేమ్‌చంద్! అవును. మన పుణ్యక్షేత్రం. మన పాఠ్యగ్రంథం. కథల వారణాసి. సిసలైన అర్థంలో నిజమైన భారతీయ కథకుడు. ప్రేమ్‌చంద్ అన్నీ చూశాడు. ఈ దేశంలో నూటికి తొంభై శాతం ఉన్న బీదా బిక్కి జనాల మధ్యతరగతి మనుషుల సమస్త తలపోతలనీ తలకెత్తుకున్నాడు. వాటన్నింటినీ రాశాడు. గురజాడ ప్రేమ్‌చంద్... ఇద్దరికీ సామ్యముంది. ఇద్దరూ దాదాపు ఒకేసారి కథల్లోకి దిగారు. కథల పరమార్థం గ్రహించారు. గురజాడ మౌఢ్యం నుంచి పరివర్తన ఆశిస్తే ప్రేమ్‌చంద్ సంస్కారాల నుంచి పరివర్తన ఆశించాడు. గురజాడ తన తొలి కథ రాయడానికి సరిగ్గా మూడేళ్ల ముందే ప్రేమ్‌చంద్ తన విశ్వవిఖ్యాత కథ ‘నమక్ కా దరోగా (1907) రాశాడు. ఏమిటా కథ? ఒక నిజాయితీపరుడైన యువకుడు. సాల్ట్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వస్తుంది. బ్రిటిష్ కాలం. నల్ల బజారులో ఉప్పు బంగారంలా అమ్ముడుపోతున్న కాలం. రేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ఉప్పు పెద్దవాళ్ల చేతుల్లోకి పోకుండా చూడటమే సాల్ట్ ఇన్స్పెక్టర్ పని. ఉద్యోగంలో చేరి ఎన్నోరోజులు గడవవు. ఆ రాత్రి అతడికి పరీక్షా సమయం ఎదురయ్యింది. ఊరి పొలిమేరల్లో వరుసగా వెళుతున్న ఎడ్లబండ్లలో ఉప్పుమూటలు. ఒకటి కాదు రెండు కాదు... లెక్కలేనన్ని మూటలు. అన్నీ కూడా ఆ ఊరి కామందువి. గుట్టు చప్పుడు కాకుండా పట్నం పోతున్నాయి. పొలిమేర దాటితే ఇక నరుడి కంటికి దొరకనట్టే. కొత్త కుర్రవాడు ఉత్సాహవంతుడు నిజాయితీపరుడు సాల్ట్ ఇన్స్పెక్టర్... పట్టేసుకున్నాడు. గుర్రం మీద వెంబడించి బెబ్బులిలా గాండ్రించి బండ్లన్నీ నిలువరించాడు. ఎంత పెద్ద ఉత్పాతం ఇది. ఉప్పు పోతే పోయింది కాని దీని హక్కుదారుడు ఫలానా కామందు అని చుట్టుపక్కల పరగణాలన్నింటికీ తెలిసిపోతే? పరువేంగాను? కామందు వచ్చాడు. పక్కకు తీసుకెళ్లాడు. ఎంతకావాలో అడుగు అన్నాడు. చిల్లర పైసల ఉద్యోగి సాల్ట్ ఇన్స్పెక్టర్. వేలైనా సరే. లక్షలైనా సరే. పరువు ముఖ్యం. కాని కుర్రవాడు లొంగలేదు. అరెస్ట్ చేశాడు. అయితే పెద్దవాళ్లకెప్పుడూ పది దారులు. కోర్టులో కేసు నిలవలేదు. పైగా అంత పెద్దమనిషిని ఇబ్బంది పెట్టినందుకు ఉల్టా ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఊడింది. నిజాయితీకి దొరికిన ప్రతిఫలం. కుర్రవాడు ఏం పట్టించుకోలేదు. తన ధర్మం తాను నిర్వర్తించాడు. ఒకరి ముందు తాను ఎలా ఉంటే తనకేమిటి? తన ఆత్మ ముందు తాను వజ్రం! మరో రెండు రోజులు గడిచాయి. ఇన్స్పెక్టర్ ఇంటి ముందు కామందు బండి ఆగింది. లోపలి నుంచి కామందు దిగాడు. తనకు మేనేజర్‌గా పని చేయమని అర్థించాడు. పెద్ద జీతం. పెద్ద దర్జా. బోలెడంత మర్యాద. వజ్రంలాంటి మనిషివి నువ్వు... నాకు కావాలి అన్నాడు. అంతేకాదు. ఇక మీదట దొంగ వ్యాపారాలన్నీ బంద్ చేసి అతడితో ముందుకు నడవడానికి నిశ్చయించుకున్నాడు. ఎందుకు? ఏమీ లేని ఆ కుర్రవాడే అంత నిజాయితీగా ఉంటే అన్నీ ఉన్న తాను ఎంత నిజాయితీగా ఉండాలి? జాతికి కావాల్సిన సంస్కారం అది. పరివర్తన. ప్రేమ్చంద్ది కాయస్త్ల కులం. వీళ్లను ఉత్తరాదిన శ్రీవాస్తవ్లని కూడా అంటారు. వీళ్ల మూలపురుషుడు చిత్రగుప్తుడు. కమ్మరివృత్తి ఒక కులంగా మారినట్టుగా, కుమ్మరివృత్తి ఒక కులంగా వూరినట్టుగా వ్రాయసగాళ్లు ఒక కులంగా మారి కాయస్త్లయ్యారని అంటారు. అయితే ప్రేమ్‌చంద్‌కు రాయడం ఈ వ్రాయసకులం వల్ల ఏర్పడలేదు. ఎనిమిదేళ్ల వయసులోనే తల్లి చనిపోతే, మారుతల్లి వేధిస్తుంటే, ఏం చేయాలో తోచక తన ఊరు వారణాసిలో ఎక్కడ పుస్తకాలు దొరికితే అక్కడికల్లా వెళ్లి ఆ అక్షరాల్లో పడ్డాడు. చదివి చదివి కలం చేత పట్టాడు. చిత్రగుప్తుడు వలే అన్ని పాపాలనూ చూసి వాటిని కథలు చేశాడు. ఒకటీ రెండూ అని ఏం చెప్తాం. అన్ని కథలదీ ఒకటే రుచి. కన్నీటి ఉప్పదనం. అతడి ఒక కథ సవాసేర్ ఘెవూ. అంటే సేరుంపావు గోధుమలు. ఏమిటా కథ? ఒక కల్లాకపటం ఎరగని రైతు. హాయిగా బతుకుతుంటాడు. ఒకసారి ఒక సాధువు కాశీకి వెళుతూ ఆ రాత్రికి ఆ రైతు ఇంట బస చేస్తానని అంటాడు. రైతు సంతోషంగా ఒప్పుకుంటాడు. ఇంట్లో జొన్నపిండి ఉంది. కాని సాధువుకు గోధుమ రొట్టెలు చేసి పెడితే మర్యాద కదా అంటుంది భార్య. గోధుమలు లేవు. ఏమిటి దారి? రైతు ఆ ఊరి పురోహితుడి దగ్గరకు వెళ్లి అప్పుగా అని చెప్పి సేరుంపావు గోధుమలు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ సంగతి మర్చిపోతాడు. ప్రతి సంవత్సరం పంట పండాక ఊళ్లో అన్ని కులాల వారికి మేర ఇచ్చినట్టే పురోహితుడికి కూడా ఇస్తున్నాను కదా అన్ని సేర్ల గోధుమలు ఉచితంగా పట్టుకెళుతున్న పురోహితుడికి నా బాకీ చెల్లేసినట్టే కదా అనుకుంటాడు. కాని అతడి లెక్క తప్పు. ఐదేళ్ల పాటు పురోహితుడు ఒక్కమాటా మాట్లాడడు. రైతు కనిపించినా అసలా ప్రస్తావనే ఎత్తడు. ఐదేళ్ల తర్వాత చల్లగా లెక్క తీస్తాడు. ఆనాడు రైతు తీసుకున్న సేరుంపావు గోధుమల ధరను రొక్కంలోకి మార్చి దానికి వడ్డీ వేసి మారువడ్డీ వేసి చక్రవడ్డీ వేసి బండెడు అప్పు తేలుస్తాడు. నీ ఇష్టం. తీర్చకపోతే పైలోకాల్లో దేవుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటాడు. పైలోకాలు ఎలా ఉంటాయో రైతుకేం తెలుసు? దేవుడు సమాధానం కోరితే ఏం చెప్పాలో అంతకన్నా ఏం తెలుసు? అవన్నీ తెలిసింది పురోహితులకే. అయ్యా పురోహితులుగారూ... తమరు చేసింది మోసం. రేపు మీరైనా దేవుడికి సమాధానం చెప్పాలి కదా అనంటే పురోహితుడు లెక్క చేయడు. తాను దైవానికి భయపడను అంటాడు. అలా భయపడాల్సిన పని నోరులేని జనాలదే. ఇక చేసేదేముంది? బంగారం లాంటి రైతు. ఆ అప్పు తీర్చలేక- కేవలం సేరుంపావు గోధుమల అప్పు తీర్చలేక- డబ్బులు చెల్లించీ చెల్లించీ చివరకు పొలాన్ని పోగొట్టుకొని ఆఖరుకు ఆ పురోహితుడి పొలంలోనే వెట్టికి చేరుతాడు. ఈ కథలో రైతు ప్రాణాలతో అయినా మిగిలాడు. మరో కథలో అది కూడా లేదు. ప్రేమ్‌చంద్ రాసిన అతి బీభత్సమైన కథ- సద్గతి. ఒక మాదిగవాడు. జ్వరం నుంచి బయటపడి ఆ పూటే లేస్తాడు. కానీ కూతురి నిశ్చితార్థానికి ఆ రోజే పురోహితుణ్ణి ఇంటికి పిలుచుకుని రావాలి. పురోహితుడొచ్చి ముహూర్తం పెట్టకపోతే ఏ ఇంట ఏ పని జరుగుతుందని? మాదిగవాడు పురోహితుడి ఇంటికి బయలు దేరి- పెద్దవాళ్ల దగ్గరకు ఉత్తచేతులతో పోకూడదు కనుక ఆ నీరసంలోనే గడ్డి కోసి మోపు కట్టి తీసుకెళతాడు. మాదిగవాణ్ణి ముట్టుకోకూడదుగాని అతడు కష్టించి కోసిన గడ్డికి ఏం మైల? పురోహితుడు తీసుకుంటాడు. కాని ఇంటికి మాత్రం రాడు. కాస్త ఆ పని చెయ్ అంటాడు. చేస్తాడు. కాస్త ఈ పని చెయ్ అంటాడు. చేస్తాడు. పెరడంతా ఊడ్చు అంటాడు. ఊడుస్తాడు. ఒక పెద్ద చెట్టు మొద్దు పెరట్లో పడేసి కట్టెలు కొట్టు అంటాడు. పాపం మాదిగవాడు. జ్వరం ఇంకా పోలేదు. కడుపులో పచ్చి మంచినీరు కూడా పడలేదు. కాని తప్పదు. కూతురి నిశ్చితార్థం కోసం, తాను పెట్టుకోలేని ముహూర్తం కోసం ఆ చాకిరి తప్పదు. ఓపిక తెచ్చుకుంటాడు. కాని మొద్దు వాడి గొడ్డలికి లొంగదు. చేతుల్లో బలం చాలదు. ఆకలి. శోష. ఎండిపోతున్న నోరు. నడుమ పురోహితుడి భార్య వచ్చి వాణ్ణి చీదరగా చూసి ఇంట్లో ఒకటి రెండు రొట్టెలు ఉన్నా పెట్టదు. ఏం తల్లీ... రెండు రొట్టె ముక్కలు పెడితే ఏం పోయే... మాదిగవాడు ఏడుస్తాడు. మళ్లీ శక్తి తెచ్చుకొని మొద్దు ఎందుకు లొంగదో చూద్దాం అని... గొడ్డలి విసురుతూ విసురుతూ.. కింద పడిపోయి... గుడ్లు తేలేసి... ఊళ్లో పెద్దగోల అవుతుంది. మాదిగపల్లె ఆడవాళ్లంతా వచ్చి బ్రాహ్మణుడి ఇంట అడుగుపెట్టకూడదు కనుక బయటి నుంచే ఏడ్చి శాపనార్థాలు పెట్టి పోతారు. ఆ కోపంతో శవం తీయడానికి ఎవరూ రారు. వాన మొదలవుతుంది. శవం అలాగే పడి ఉంటుంది. ఇక ఈ మాదిగవాడికి సద్గతి ఏది? పురోహితుడు ఆలోచిస్తాడు. కాసేపటికి ఒక కర్రతో వాడి కాలు ఎత్తి, దానికి తాడుతో ఉచ్చు వేసి దానిని ఏ మాత్రం అంటుకోకుండా లాక్కుంటూ వెళ్లి దూరాన పశువులు చస్తే పారేసే దిబ్బ మీద పారేసి వస్తాడు. మరుసటి రోజు తెల్లారుతుంది. పురోహితుడు యథావిధిగా లేచి ఇల్లంతా సంప్రోక్షణ చేసి నీళ్లు చిలకరించి తన దైనందిన జీవితంలో పడతాడు. కథ ముగుస్తుంది. ఏం కథ ఇది! సద్గతి ఎవరికయ్యా రావాల్సింది? ఈ కులాల వ్యవస్థకి కాదా. ఈ అంటరానితనానికి కాదా. ఈ దోపిడీ ముఠాలకు కాదా. ఈ నీతిమాలిన మనుషులకు కాదా. ఈ కనికరం లేని ఆచారాలకు కాదా. ఇన్నాళ్లు గడిచాయి. పరిస్థితిలో ఏ మార్పూ లేదు. సంస్కారాన్ని ఆశించాల్సి ఉంది. పని కొనసాగించాల్సి ఉంది. అదిగో- ప్రేమ్‌చంద్ మొదలెట్టిన ఆ పనిని కొనసాగించడానికి- నిబద్ధతతో స్వీకరించడానికి- చాలామంది- నిజంగానే చాలామంది -కథలు రాస్తుంటారు. - ఖదీర్ -
నేనూ నా ఇంట్లో మహారాజునే!
అది చలికాలం. స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతోంది. ఒకరోజంతా ప్రేమ్చంద్గారికి స్కూల్లోనే సరిపోయింది. రెండో రోజు మధ్యాహ్నానికి తన పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చారు. సాయంత్రం ఆయన వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటుండగా ఇన్స్పెక్టర్ మా ఇంటి ముందు నుండి గుర్రం మీద వెళ్ళాడు. తనను చూడగానే ఆయన లేచి నమస్కారం చేస్తారని అతను ఆశించాడు. కానీ ఆయన లేవలేదు. కొంచెం దూరం పోయి ఆగి ఆయనను పిలవమని ఒక నౌకరును పంపాడు ఇన్స్పెక్టర్. ఆయన వెళ్లి ‘‘ఎందుకు పిల్చారు?’’ అని అడిగాడు. ‘‘నీవు చాలా గర్విష్ఠిలా కనిపిస్తున్నావు! నీ ఆఫీసరు నీ ముందు నుంచి వెళ్తుంటే లేచి నమస్కారం చెయ్యనవసరం లేదా?’’ అని అన్నాడు కోపంగా ఆ ఇన్స్పెక్టర్. ప్రేమ్‌చంద్ కొంచెం కూడా బెదరలేదు. ‘‘నేను మీ స్కూల్లో వున్నంత వరకే మీ నౌకరును. నా ఇంట్లో నేనూ మహారాజునే’’ అని జవాబు ఇచ్చారు ప్రేమ్‌చంద్. ఇన్స్పెక్టర్ వెళ్లిపోయాడు. అతని మీద పరువు నష్టం దావా వేస్తానని తన స్నేహితులతో అన్నారు ప్రేమ్‌చంద్. కానీ అందరూ వద్దని సలహా ఇచ్చారు. ఈ సంఘటన ఆయనను చాలా రోజులు బాధించింది. - శివరాణీదేవి ‘ప్రేమ్‌చంద్ జీవితం’ నుంచి