గోర్కీ మనవాడు కూడా!
ఫ్లాష్‌బ్యాక్
‘నాలో సాహిత్యాన్ని సృష్టించే సామర్థ్యం లేదు’ అని నిజాయితీగా చెప్పుకున్న ప్రేమ్‌చంద్ భార్య శివరాణీదేవి తన భర్తతో గల జ్ఞాపకాలను ‘ప్రేమ్‌చంద్ ఘర్ మే’ పేరిట హిందీలో పుస్తకంగా తెచ్చారు. దాన్ని తెలుగులోకి ‘ఇంట్లో ప్రేమ్‌చంద్’గా ఆర్.శాంతసుందరి అనువదించగా, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. అందులో 1936 జూన్‌లో మక్సీమ్ గోర్కీ మరణం తర్వాతి (అదే సంవత్సరం అక్టోబర్‌లో ప్రేమ్‌చంద్ కూడా మరణించడం గమనార్హం.) ఒక ఘటన ఉంది. అది ఇలా సాగుతుంది:
‘‘ఏదో రాస్తున్నారు.’’
‘‘ఎల్లుండి ‘ఆజ్’ ఆఫీసులో గోర్కీ గురించి మీటింగ్ ఉంది.’’
‘‘ఏం మీటింగ్ అది? ఒక పక్క ఒంట్లో బాగాలేనప్పుడు, ఈ రాతలేమిటి? ఇప్పుడు టైమెంతో తెలుసా? అర్ధరాత్రి రెండు గంటలు!’’
‘‘నిద్ర రావటం లేదు ఏం చేసేది. అందుకే ఉపన్యాసం రాసుకుంటున్నాను.’’
‘‘ఒంట్లో బాగాలేకపోయినా రాయాల్సిందేనా?’’
‘‘అవును, రాయకపోతే కుదరదు. పైగా నాకిష్టమైన పని చేసేప్పుడు కష్టమనిపించదు! నా కర్తవ్యం అనుకుని చేసేపని ఏదైనా కానీ, కష్టంగా తోచదు. అవే ఒక మనిషికి అన్నిటికన్నా ముఖ్యమని అనిపిస్తాయి.’’
‘‘అసలది ఎలాంటి మీటింగ్?’’
‘‘సంతాప సభ.’’
‘‘అతనెవరు, భారతీయుడేనా?’’
‘‘అదే మన సంకుచిత మనస్తత్వం! గోర్కీ మహా రచయిత. ఆయనని ఒక ప్రాంతానికీ, దేశానికీ సంబంధించినవాడని అనలేం. ఒక రచయిత ఎక్కడివాడని అడక్కూడదు. ఆయన రచనలు ప్రపంచంలోని అందరికీ మేలు చేసేవే అనుకోవాలి.’’
‘‘సరే! కానీ ఆయన మన దేశానికి కూడా పనికివచ్చే విషయాలేవైనా రాశాడా?’’ అని అడిగాను.
‘‘రాణీ, ఇంకా నువ్వు తప్పుదారినే ఉన్నావు. అసలు రచయిత దగ్గర ఏం ఉంటుంది అందరికీ విడివిడిగా పంచిపెట్టేందుకు? అతనికున్న ఆస్తల్లా అతని తపస్సు. దాన్నే అందరికీ పంచగలడు. దానివల్ల అందరూ లాభం పొందుతారు. అతను తన తపఃఫలాన్ని తనకోసమంటూ ఏం మిగుల్చుకోడు. సామాన్యంగా అందరూ తపస్సు చేసేది సొంతలాభం కోసం, కానీ రచయిత చేసే తపస్సు వల్ల జనం బాగుపడతారు.’’
‘‘సరే! కానీ ఆయన మన దేశానికి కూడా పనికివచ్చే విషయాలేవైనా రాశాడా?’’ అని అడిగాను.