భారతదేశ ఆర్థిక రాజధాని మొదటి వ్యాపార దిగ్గజాలలో ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ జైన్ ఒకరు. ఆయన్ను ముంబైలో (అప్పట్లో బొంబాయి) బిగ్ బుల్, బులియన్ కింగ్, కాటన్ కింగ్ ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. జమ్‌సెట్‌జీ టాటా, డేవిడ్ సాసూన్, జమ్‌సెట్జీ జెజీబోయ్‌లతో పాటు నలుగురు బాంబే వ్యాపార యువరాజులలో ఒకరిగా పేరు పొందారు.
ప్రేమ్‌చంద్ తన కాలంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. నేటివ్ షేర్ & స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ స్థాపనతో అందరికీ గుర్తుండిపోయారు. అదే ఆ తర్వాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా మారింది. బీఎస్‌ఈ దేశంలో రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. దాంట్లోని అన్ని లిస్టెడ్ కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాప్ రూ. 300 లక్షల కోట్లకు మించి ఉంది. 1865లో దీనిని స్థాపించినప్పుడు, దక్షిణ బొంబాయిలోని ఒక మర్రిచెట్టు కింద 22 మంది బ్రోకర్లు, ఒక్కొక్కరి నుంచి కేవలం రూపాయి మూలధనంతో ఇది ఏర్పడింది.
మొదటి స్టాక్ బ్రోకర్
రాయ్‌చంద్ 1832లో సూరత్‌లో రాయ్‌చంద్ డిప్‌చంద్ అనే కలప వ్యాపారికి జన్మించారు. ఆయన చిన్నప్పుడే వారి కుటుంబం బొంబాయికి వచ్చేసింది. ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో రాయ్‌చంద్ విద్యాభ్యాసం సాగింది. అదే ఆయన ఇంగ్లిష్‌లో మాట్లాడగల, చదవగల, రాయగల మొదటి భారతీయ బ్రోకర్‌గా అవతరించడానికి సహాయపడింది. రాయ్‌చంద్ 1852లో ఓ విజయవంతమైన స్టాక్ బ్రోకర్‌కు సహాయకుడిగా వృత్తిని ప్రారంభించారు.
అసమాన్య జ్ఞాపకశక్తి
అసమానమైన జ్ఞాపకశక్తి ప్రేమ్‌చంద్ సొంతం. ఆయన ఎప్పుడూ పెన్ను, పేపర్ వాడలేదు. రాసుకోవడానికి బదులు తన వ్యాపారాలన్నింటినీ కంఠస్థం చేసిన ఆయన కేవలం 6 సంవత్సరాలలో 1858 నాటికి దాదాపు రూ. 1 లక్ష సంపదను ఆర్జించారు. 1861లో జరిగిన అమెరికన్ సివిల్ వార్ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పత్తి వ్యాపారానికి భారత్ హాట్‌స్పాట్‌గా మారింది. దీన్ని ఆయన మరింత విస్తృతం చేశారు.
దాతృత్వంలోనూ..
భారీ లాభాలను చవిచూసిన ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్, అంతర్‌యుద్ధం ముగిశాక 1865లో పత్తి వ్యాపార ప్రాభవం తగ్గడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత తిరిగి పుంజుకుని దాతృత్వం వైపు నడిచారు. ఇందులో భాగంగా బాంబే విశ్వవిద్యాలయంలో రాజాబాయి క్లాక్ టవర్‌కు నిధులు అందించారు. బాలికా విద్యను ప్రోత్సహించారు.
అవార్డులు, స్కాలర్‌షిప్‌లు అందించేందుకు ఆర్థికంగా సహకరించారు. ప్రేమ్‌చంద్ 1906లో మరణించారు. అతని కుటుంబంలోని నాలుగో తరం ఇప్పుడు ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ సంస్థను నడుపుతోంది. వ్యాపార పరంగా ఒక చిన్న సంస్థే అయినా గొప్ప చరిత్ర దీనికి ఉంది. బైకుల్లాలోని ప్రేమ్‌చంద్ నివసించిన బంగ్లాను తరువాత అనాథాశ్రమం, పాఠశాలగా మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment