96 ఓట్ల మెజార్టీతో గెలుపు
అక్కిరెడ్డిపాలెం: గాజువాక నోటిఫైడ్ మున్సిపల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) ఎన్నికల్లో పెందుర్తి ప్రేమ్‌చంద్ ప్యానల్ సభ్యులు ఘనవిజయం సాధించారు. బుధవారం ఉదయం నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 624 ఓట్లకు గాను 530 ఓట్లు పోల్ కాగా పోస్టల్ బ్యాలెట్ 9తో కలిపి 539 వచ్చాయి. సాయంత్రం 5.30కు లెక్కింపు ప్రారంభించారు.
ఆ ఇద్దరి మధ్యే పోటీ
ప్రేమ్‌చంద్, ఎన్.శేషగిరిరావు, వై.సాంబశివరావు చైర్మన్‌లుగా మూడు ప్యానల్‌లు బరిలో ఉన్నాయి. కౌంటింగ్ ప్రారంభం నుంచి శేషగిరిరావు, ప్రేమ్‌చంద్‌ల మధ్య స్వల్ప ఓట్ల తేడా కొనసాగింది. ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి ప్రేమ్ చంద్‌కు 269, శేషగిరిరావుకు 179, సాంబశివరావుకు 87 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రేమ్‌చంద్ 96 ఓట్ల మెజార్టీతో ఐలా చైర్మన్‌గా గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ శేషు ప్రసాద్‌పై 178 ఓట్ల మెజార్టీతో పట్టా నారాయణరావు, కార్యదర్శిగా కె.సత్యనారాయణ రెడ్డి (రఘు) పాతర్లగడ్డ శ్రీనివాసరావుపై 195 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సహాయ కార్యదర్శిగా గూడూరు రామకృష్ణంరాజు, కోశాధికారిగా యార్లగడ్డ రాజేంద్ర ప్రసాద్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఏ, సీ బ్లాక్ నుంచి మహ్మద్ ఖుర్షిద్ మాఛీ, బి (2) – బ్లాక్ నుంచి పంపాన రామకృష్ణ, సర్వసిద్ధి పరదేశి, డి (2) – బ్లాక్ నుంచి అల్లూరి సత్యనారాయణ రాజు, పి.పద్మావతి, డి – ఎక్స్‌పాన్షన్ నుంచి డోకల నాగేశ్వరరావు, ఈ – బ్లాక్ నుంచి నితీష్ బంగ్, ఎఫ్, జి, ఏఈపి – బ్లాక్ నుంచి ఇ.సూరపరాజు పెదగంట్యాడ బ్లాక్ నుంచి అచ్యుతరామిరెడ్డి, రావూరి సురేష్ బాబు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ప్రతీ రౌండ్‌ను ఐలా కమిషనర్ టి.వేణుగోపాల్ ప్రత్యేకంగా పర్యవేక్షించడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
గట్టి బందోబస్తు నడుమ కౌంటింగ్ నిర్వహించారు. గతంలో ఐలా చైర్మన్‌గా పనిచేసిన ప్రేమ్‌చంద్ ఐలా అభివృద్ధికి కృషి చేయడంతో పాటు తోటి పారిశ్రామిక వేత్తలతో ఉన్న సాన్నిహిత్యం ఆయన విజయానికి దోహదం చేసిందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. గెలుపొందిన 15 మంది సభ్యులకు ఎన్నికల అధికారి మౌని శ్రీధర్, ఐలా కమిషనర్ టి.వేణుగోపాల్, ఏపీఐఐసీ జెడ్‌ఎం యతిరాజు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ నెల 24న ఐలా ప్రతినిధులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారు.
ప్రశాంతంగా ఎన్నికలు
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐలా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఐలా కార్యాలయంలో ఐదు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఐలా సిబ్బంది, గాజువాక రెవెన్యూ, ఇండస్ట్రియల్ ఏరియా సిబ్బందిని ఎన్నికల విధులకు నియమించారు. ఉదయం కాస్త మందకొడిగా మొదలైనా 9.30 నుంచి పోలింగ్ ఊపందుకుంది. గాజువాక పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులు తమ ఫొటో గుర్తింపు ఎన్నికల కార్డును ప్రవేశపెట్టడంతో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సాగింది.