నేనూ నా ఇంట్లో మహారాజునే!
అది చలికాలం.
స్కూల్లో ఇన్‌స్పెక్షన్ జరుగుతోంది. ఒకరోజంతా ప్రేమ్‌చంద్‌గారికి స్కూల్లోనే సరిపోయింది. రెండో రోజు మధ్యాహ్నానికి తన పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చారు.
సాయంత్రం ఆయన వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటుండగా ఇన్‌స్పెక్టర్ మా ఇంటి ముందు నుండి గుర్రం మీద వెళ్ళాడు. తనను చూడగానే ఆయన లేచి నమస్కారం చేస్తారని అతను ఆశించాడు. కానీ ఆయన లేవలేదు.
కొంచెం దూరం పోయి ఆగి ఆయనను పిలవమని ఒక నౌకరును పంపాడు ఇన్‌స్పెక్టర్. ఆయన వెళ్లి ‘‘ఎందుకు పిల్చారు?’’ అని అడిగాడు. ‘‘నీవు చాలా గర్విష్ఠిలా కనిపిస్తున్నావు! నీ ఆఫీసరు నీ ముందు నుంచి వెళ్తుంటే లేచి నమస్కారం చెయ్యనవసరం లేదా?’’ అని అన్నాడు కోపంగా ఆ ఇన్‌స్పెక్టర్.
ప్రేమ్‌చంద్ కొంచెం కూడా బెదరలేదు. ‘‘నేను మీ స్కూల్లో వున్నంత వరకే మీ నౌకరును. నా ఇంట్లో నేనూ మహారాజునే’’ అని జవాబు ఇచ్చారు ప్రేమ్‌చంద్. ఇన్‌స్పెక్టర్ వెళ్లిపోయాడు.
అతని మీద పరువు నష్టం దావా వేస్తానని తన స్నేహితులతో అన్నారు ప్రేమ్‌చంద్. కానీ అందరూ వద్దని సలహా ఇచ్చారు. ఈ సంఘటన ఆయనను చాలా రోజులు బాధించింది.
- శివరాణీదేవి ‘ప్రేమ్‌చంద్ జీవితం’ నుంచి