Scripture wood
-
మినీ సామాజిక విప్లవం
గ్రంథం చెక్క అనువాదాలతోను, అనుకరణలతోను ప్రారంభమైన నాటకసాహిత్యం తొలిరోజుల్లో కేవలం పాఠ్యంగా మాత్రమే ఉండేది. సమాజంలో ఆనాడు ఉన్న కట్టుబాట్లకు విరుద్ధంగా కొందరు సాహసికులు ఆ నాటకాలను రంగస్థలం మీద ప్రదర్శించడానికి పూనుకోవడం ఒక మినీ సామాజిక విప్లవం అని చెప్పవచ్చు. 1860-70 ప్రాంతాల్లో ఈ ఉద్యమం ప్రారంభమై అచిరకాలంలోనే అటు నటులను, ఇటు సామాజికులను కూడా ఆకట్టుకుంది. ఆంగ్ల, సంస్కృత అనువాదాలతో పాటు పౌరాణిక, చారిత్రక నాటకాలు రాయడం ప్రారంభమైంది. ప్రాంతీయ జానపద నాటకాల నుంచి కొంత, ఇంగ్లీష్ సంపర్కంతో 19వ శతాబ్దం చివరి దశకంలో భారతదేశానికి వచ్చిన ఆంగ్లనాటక బృందాల నుంచి కొంత అప్పు తెచ్చుకొని ప్రతి ప్రాంతీయ నాటకరంగం ఒక విధమైన సంగీత నాటకాన్ని పెంచుకుంది. పార్శీ నాటకరంగం, దాని ప్రభావంతో పెరిగిన పలు ప్రాంతీయ నాటకరంగాలు ఇటువంటివే! ఏదైనా వస్తువు జనాన్ని ఆకట్టుకుంటే దానిని ప్రజలకు అందించడానికి సిద్ధపడే వర్తకమ్మన్యులు తయారుగా ఉంటారు. అట్లా ఏర్పడ్డదే వ్యాపార నాటకరంగం. ఎక్కడెక్కడ ఏ మంచి నటులున్నా ఒక చోట చేర్చి, వాళ్లకి నెలజీతాలు ఇచ్చి, ఎక్కడెక్కడ ఏ మంచి ‘ట్రిక్’ దొరికినా దానిని తమ నాటకంలో చొప్పించి మంచి ‘మసాలా’ నాటకాలను ప్రజలకు అందించిన ఘనత వీళ్లదే! ఒకవైపు వ్యాపార నాటకరంగం, మరొకవైపు దానిలోని వ్యాపారతత్వాన్ని నిరాకరించి, విజయవంతంగా నాటకం ప్రదర్శించాలనే ధ్యేయంతో బయలుదేరిన వృత్తినాటకరంగం...రెండూ ప్రేక్షకుల మన్ననల్ని పొందాయి. - గిరీశ్ కర్నాడ్ ‘నాగమండలం’ (తెలుగు అనువాదం) నాటకానికి మొదలి నాగభూషణ శర్మ రాసిన ముందుమాట నుంచి. -
తుంగ-భద్ర
గ్రంథం చెక్క తుంగభద్ర ఒక్క నది కాదు. తుంగ, భద్ర విడివిడిగా కొంత దూరం ప్రవహించి ఒక్కటై పోయాయి. తుంగడు యాదవ బాలుడు. గోవులను, గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. వయసు ఇరవై వుండవచ్చు. యౌవనం అతనిలో తొణికిసలాడింది. తుంగడు మురళి వాయించేవాడు. గోవులూ, గొర్రెలు, చెట్లు, చేమలు తలలూపుతూ తన్మయత్వంతో వినేవి. ఆ ప్రాంతాన్ని ఒక కన్నడ రాజు పాలిస్తున్నాడు. అతని కూతురు పేరు భద్ర. అందాల రాశి. తుంగడు మోగించే మురళి విన్నది భద్ర. గోపాలకృష్ణుడి వద్దకు రాధ వెళ్లినట్లు భద్ర తుంగడి వద్దకు వెళ్లిపోయింది. ఇది కొన్నాళ్లు సాగింది. రాజుకు తెలిసింది. ఇద్దరినీ అడవిలో కదంబవృక్షం కింద పట్టుకున్నారు. ‘‘మమ్మల్ని యెవ్వరూ విడదీయలేరు’’ అంది భద్ర. తుంగణ్ణి చితక్కొట్టించాడు రాజు. అతని రక్తాన్ని తిలకంగా ధరించింది భద్ర. ఇద్దర్నీ విడదీశారు రాజభటులు. భద్ర కరిగి నీరై, నదియై ప్రవహించింది. తుంగడు కరిగి నీరై, నదియై ప్రవహించాడు. అలా విడివిడిగా ప్రవహిస్తూ వెళ్ళిపోయారు. రాజు గుండె పగలి చచ్చాడు. రాణి గుండె పగిలి చచ్చింది. మైళ్లు, బీళ్ళు, రాళ్ళు, బోళ్ళు, గుళ్ళు దాటి వెళ్లి ఒకచోట తుంగ+భద్ర కలుసుకొని తుంగభద్ర అయింది. వారు ప్రేయసీప్రియులు, భార్యాభర్తలు. కనుక ఇక సముద్ర సంగమం సాధ్యపడే విషయం కాదు. అందుకే తల్లిలాంటి కృష్ణవేణమ్మ వొడిలో చేరిపోయారు. -దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ నుంచి. -
సెన్సారైనా.. ప్రజలకు చేరిన నాటకం
గ్రంథం చెక్క చెకోవ్, గోర్కీ లిద్దరూ తీరికగా కబుర్లు చెప్పుకుంటూ పట్టణ వీధుల్లో తెల్లటి చప్టాల మీద నడుస్తుండేవాళ్లు. రాత్రి అయేసరికి ఆర్టు థియేటర్ నాటకాలకి పోయి చూస్తూ కాలక్షేపం చేసేవాళ్లు. అప్పుడే చెకోవ్, గోర్కీని ఓ నాటకం రాయమని ప్రోత్సహించాడు. గోర్కీకి నాటక రంగం కొత్త. ప్లాటు తయారుచేశాడు. బెస్సిమినోవ్ కుటుంబ కఠినజీవితాన్ని చిత్రిస్తూ గోర్కీ తొలి నాటకం ‘ఫిలిస్టైన్స్’ (శిష్టులు) రచించాడు. నాటక రచనలో అతను చేయి తిరిగినవాడు కాడు. రాసి, మళ్ళీ రాసి మార్పులు చేసేడు. కానీ తృప్తి లేదు. ఒక గొప్ప సాహిత్యవేత్త నాటకరచన విషయంలో ఏమన్నాడంటే- ‘‘మొదట్లో అయిదంకాల కష్టాంత నాటకం రాయి. సంవత్సరం పోయేక దాన్నే మూడంకాల నాటకంగా మార్చు. ఇంకో ఏడాది పోనిచ్చి దాన్ని ఏకాంక సుఖాంత నాటికగా కత్తిరించుకో. మరో ఏడాది గడవనిచ్చి, ఏకాంకికను పొయ్యిలో పారేయ్!’’ గోర్కీ ఈ సలహానే అనుసరించాడు. కానీ తన నాటకాన్ని మాత్రం పొయ్యిలో మాత్రం పారేయలేదు. ‘శిష్టులు’లో గోర్కీ తన చిన్ననాటి నుంచి ఎరిగి వున్న మానవుల్ని చిత్రించాడు. పట్టణాలలో చిన్న యిళ్లలో వుంటూ ఉక్కిరి బిక్కిరిగా నివసిస్తూండే వాళ్ళే ఈ ‘శిష్టులు’. వాళ్ల జీవితం అందులో చిత్రితమైంది. అది తృప్తి నివ్వక, తరువాత కొత్త నాటకంలో కోటీశ్వరుల వీధిలో ఉన్న బికారుల జీవితాన్ని చిత్రించాడు, ‘నికృష్ట జీవితం’ అని పేరె ట్టాడు. ఇందులోని పాత్రలన్నీ గోర్కీ జీవితంలో సహచరులుగా గడిపినవారివే. ఆ నాటకంలోని ప్రతి వాక్యమూ ఏ సామాజిక విధానం కింద మానవుల్లో అత్యధిక సంఖ్యాకులు జీవించడానికి హక్కు లేకుండా చేయబడుతున్నారో, ఆ విధానం మీదే నిప్పులు చెరుగుతూ, దాన్ని దగ్ధపటలం చేసింది. నాటకంలోని కొన్ని వాక్యాలను ప్రభుత్వం సెన్సారైతే చేసింది కానీ, నాటక ముఖ్య సందేశం జనంలోకి వెళ్లకుండా మాత్రం చేయలేకపోయింది. - మహీధర జగన్మోహనరావు అనువాద రచన ‘గోర్కీ జీవితం’ నుంచి (ప్రపంచ ప్రసిద్ధ రచయిత మాగ్జిమ్ గోర్కీ వర్ధంతి రేపు) -
సాంఘిక చరిత్ర మన చరిత్రయే!
గ్రంథం చెక్క రాజుల యుద్ధాలు, తంత్రాలు, దౌష్ట్యాలు సంఘానికి నష్టం కలిగించినట్టివే. ఈ విషయం గుర్తించిన పాశ్చాత్యులు సాంఘిక చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇదియే సరియగు పద్ధతి. రాజుల చరిత్రలు మనకు అంతగా సంబంధించినవి కావు. సాంఘికచరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో, ఏ ఆటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పుడుడెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన అభిలషింతురు. తేలిన సారాంశమేమన... సాంఘిక చరిత్ర మన చరిత్రయే! మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే!! సాంఘిక చరిత్ర మానవ చరిత్ర. ప్రజల చరిత్ర. అది మన సొంత కథ!! అది జనుల జీవనమును ప్రతి శతాబ్దమందెట్లుండెనో తెలుపునట్టిది. అది మన తాతముత్తాల చరిత్ర! - సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నుంచి (సురవరం ప్రతాపరెడ్డి ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. రేపు ఆయన జయంతి) -
బుద్ధుని తపోభూమిలో...
గ్రంథం చెక్క బోధిగయలో చాలా ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి. ప్రధాన మందిరంలో బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్లుగా కనిపించే విగ్రహం ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహాన్ని బంగారు, వెండి, మాణిక్యాలు, వైఢూర్యాలతో చెక్కిండ్రు. ఇక్కడ బుద్ధుని అవశేషాలు భద్రపరచిండ్రట. నిశ్చల సమాధిలో ఆసీనుడైన బుద్ధుని విగ్రహం ‘కోరికలే దుఃఖాలన్నిటికి మూలకారణం’ అని చెబుతున్నట్లుగా ఉంటుంది. మందిరం వెనుక భాగంలో బోధి వృక్షముంది. ఈ వృక్షం క్రిందనే బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందట. ఆ వృక్ష శాఖలనే అశోకచక్రవర్తి కుమార్తె సంఘమిత్ర శ్రీలంకలోని అనురాధపురంలో నాటిందట. బుద్ధుని తపోభూమి అయిన బోధివృక్ష మూల స్థానాన్ని వజ్రాసనం అంటరు. మహాబోధి మందిరానికి ఉత్తరదిశగా ‘అనిమేషలోచన’ అనే స్తూపముంది. పేరుకు స్తూపమే కాని ఇది ఒక మందిరం. 55 అడుగుల ఎత్తున ఇటుకలతో కట్టిన ఈ మందిరం లోపల బుద్ధుని విగ్రహముంది. బుద్ధగయలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేది ధ్యానముద్రలో ఉన్న భారీ బుద్ధ విగ్రహం. దీని ఎత్తు 80 అడుగులు. దేశంలోని బుద్ధ విగ్రహాలన్నిట్లోకి ఇది ఎత్తైది. బోధి వృక్షం ఆ కాలం నాటిదే అంటరు గాని యథార్థం కాదనిపిస్తుంది. ఒకవేళ దాని అంటేమో! చైనా, టిబెట్ భక్తులు బోధి వృక్షచ్ఛాయలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. బుద్ధుని ముందు ధ్యానంలో కూర్చున్న విదేశీ యువతిని చూస్తుంటే విగ్రహమేమోననిపించింది. అశోకుడు కట్టించిన రాతి గోడపై పాళీ భాషలో అతని పేరు చెక్కబడివుంది. జాతరలో చిల్లర కొట్లు వెలిసినట్లు బజారు నిండా పూసల దండలు, రుద్రాక్ష మాలలు, చిన్న చిన్న పటాలు అమ్మే దుకాణాలున్నయి. - దేవులపల్లి కృష్ణమూర్తి ‘మా యాత్ర’ నుంచి. -
నేనూ నా ఇంట్లో మహారాజునే!
అది చలికాలం. స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతోంది. ఒకరోజంతా ప్రేమ్చంద్గారికి స్కూల్లోనే సరిపోయింది. రెండో రోజు మధ్యాహ్నానికి తన పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చారు. సాయంత్రం ఆయన వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటుండగా ఇన్స్పెక్టర్ మా ఇంటి ముందు నుండి గుర్రం మీద వెళ్ళాడు. తనను చూడగానే ఆయన లేచి నమస్కారం చేస్తారని అతను ఆశించాడు. కానీ ఆయన లేవలేదు. కొంచెం దూరం పోయి ఆగి ఆయనను పిలవమని ఒక నౌకరును పంపాడు ఇన్స్పెక్టర్. ఆయన వెళ్లి ‘‘ఎందుకు పిల్చారు?’’ అని అడిగాడు. ‘‘నీవు చాలా గర్విష్ఠిలా కనిపిస్తున్నావు! నీ ఆఫీసరు నీ ముందు నుంచి వెళ్తుంటే లేచి నమస్కారం చెయ్యనవసరం లేదా?’’ అని అన్నాడు కోపంగా ఆ ఇన్స్పెక్టర్. ప్రేమ్‌చంద్ కొంచెం కూడా బెదరలేదు. ‘‘నేను మీ స్కూల్లో వున్నంత వరకే మీ నౌకరును. నా ఇంట్లో నేనూ మహారాజునే’’ అని జవాబు ఇచ్చారు ప్రేమ్‌చంద్. ఇన్స్పెక్టర్ వెళ్లిపోయాడు. అతని మీద పరువు నష్టం దావా వేస్తానని తన స్నేహితులతో అన్నారు ప్రేమ్‌చంద్. కానీ అందరూ వద్దని సలహా ఇచ్చారు. ఈ సంఘటన ఆయనను చాలా రోజులు బాధించింది. - శివరాణీదేవి ‘ప్రేమ్‌చంద్ జీవితం’ నుంచి -
బుద్ధుని ఎరుకకు... సులువైన గ్రంథం....
బౌద్ధం గురించి రాసేవారు సాధారణంగా బౌద్ధంలోని పారిభాషిక పదాలను ఎధేచ్ఛగా ఉపయోగిస్తారు. బౌద్ధం గురించి ఏం రాసినా తమకు అర్థమైంది కనుక ఎదుటివారికి కూడా అర్థమైపోతుంది అన్నట్టుగా రాసుకుంటూ పోతారు. దీని వల్ల చాలా గ్రంథాలు పఠనీయతను కోల్పోతాయి. కాని పండితుల కంటే కూడా ఒక్కోసారి సామాన్యులు రాసే పుస్తకాలు ఎక్కువ మేలు చేస్తాయనడానికి ‘బుద్ధుడు-బౌద్ధధర్మం’ ఒక ఉదాహరణ. రచయిత పొనుగోటి కృష్ణారెడ్డి ఒక సీనియర్ జర్నలిస్టు కనుక బుద్ధుడి గురించి పాఠకుడు ఎంత చెప్పాలి ఎలా చెప్పాలి ఎంత సులువుగా చేరవేయాలి తెలుసుకొని మరీ ఈ గ్రంథం రాయడం వల్ల ఆబాల గోపాలం అతి సులువుగా బుద్ధుడి గురించి బౌద్ధధర్మం గురించి తెలుసుకోవడానికి వీలయ్యే పుస్తకంగా రూపు దాల్చింది. బుద్ధుని పుట్టుక, ప్రయాణం, జ్ఞానోదయం, ప్రచారం, నిర్వాణం... ఇవన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. శీలం, నిష్కామం, దానం, ఉపేక్ష, వీర్యం, క్షాంతి, సత్యం, అధిష్టానం, కరుణ, మైత్రి... ఈ పది ఉత్తమ గుణాలను మానవులు ఆచరించాలి. పంచశీల, చతురార్య సత్యాలు, అష్టాంగ మార్గం... ఇవన్నీ మనిషి అనునిత్య క్షోభ నుంచి విముక్తం చేసే బోధకాలు. వీటిని వివరంగా సులభంగా తెలియ చేసే పుస్తకం ఇది. పాఠకుల కోసం బౌద్ధాన్ని పరిశోధించి ఈ పుస్తకాన్ని రాసినందుకు కృష్ణారెడ్డికి అభినందనలు తెలియచేయాలి. బుద్ధుడు - బౌద్ధధర్మం; డాక్టర్ పొనుగోటి కృష్ణారెడ్డి; వెల: రూ.75 ప్రతులకు: 9440974788 డైరీ: 13వ ఆటా మహాసభల ప్రత్యేక సంచిక కోసం రచనలు ఆహ్వానిస్తున్నారు. కథ, కవిత్వం, వ్యాసం... ఏదైనా పంపవచ్చు. ఉత్తమమైన వాటికి బహుమతిగా 116 డాలర్ల బహుమతి కూడా ఉంటుంది. గడువు మార్చి 30. వివరాలుకు: http://www. ataconference.org మార్చి 9 ఆదివారం సాయంత్రం నెల్లూరు టౌన్హాల్లో చిన్ని నారాయణరావు కవితాసంపుటి ‘గుండె దీపం’ ఆవిష్కరణ. మార్చి 9 ఆదివారం ఉదయం 10 గంటలకు మోహన్‌రుషి కవితా సంపుటి ‘జీరో డిగ్రీ’ ఆవిష్కరణ. వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఇందిరా పార్క్ దగ్గర. -
చస్తే బతకడం ఎలాగ?
గ్రంథం చెక్క నేను శ్రీకాకుళం నుంచి విజయనగరం వచ్చిన కొత్తలో ఎక్కడ చూసినా... ప్రతి ఇంటిలోనూ అంగడిలోనూ ఆనందగజపతి మహారాజా వారి ఫోటోలు కనిపించేవి. అలాగే, సంభాషణల్లో తరచుగా బూతులు వినిపించేవి. ఆ తరువాత వినిపించేవి ఒకటి రెండు ఛలోక్తులు. అందులో ముఖ్యమయింది ‘ఒరే వీడు చస్తే మరి బతకడురా’ అని! దానినే కొంచెం మార్చి ‘‘చస్తే ఎలాగ బతకుతావురా!’’ అని! రామమోహన్‌రాయ్, కేశవ చంద్రసేన్ మొదలైన మహా పురుషుల జీవితాలు చూడడం తటస్థించింది. ఈ ఛలోక్తి కేవలం అర్థం లేనిది కాదేమో అన్న సంశయం కలగడం మొదలైంది. చచ్చినా బతికుండే వారున్నారని కొంచెం కొంచెం స్పష్టపడుతూ ఉంది. బతికున్నా చచ్చినవారితో సమానులు కొందరున్నారన్న దిక్కుకి ఊహ పోలేదు. అల్లసాని వారి - ‘కృష్ణరాయలతో దివి కేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబనగుచు’ అన్న పద్యం చూచినంత వరకూ ఆ దృష్టే కలుగలేదు. బతుకుతూ చావడం, చచ్చినా బతకడం... రెండు విషయాలు రానురాను స్ఫుటమవుతూ వచ్చాయి మనసులో. అంతేకాదు, మనిషి గట్టి ప్రయత్నం చేస్తే చచ్చినా బతికుండవచ్చునన్న మాటగూడ సుసాధ్యంగా కనబడుతూ వచ్చింది. (తాపీ ధర్మారావు ‘రాలూ-రప్పలూ’ నుంచి) -
ఐదు ఐదులు!
నడుం పూర్తిగా వంగిపోయిన ఒక ముసలివాడు ఏదో వెదుకుతున్నాడు. ‘‘తాతా! యేం వెదుకుతున్నావు?’’ అని అడిగింది ఒక చిన్నది. ‘‘పోయిన యవ్వనాన్ని వెదుకుతున్నాను’’ అన్నాడు వృద్ధుడు. ప్రశ్నోత్తర రూపంలో ఉన్న ఈ పార్సీ కవిత- రాజు జహంగీరూ, రాణి నూర్జహానుల మధ్య జరిగిన సంభాషణ. మా మదర్సా(బడి)లో మౌల్వీ (పంతులు) ఈ కవిత చదివి అర్థం చెబుతుంటే నేను నా ధోరణిలో అనువదించుకున్నాను. ఇది ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే నాతో చదువుకున్న ఒక మిత్రుడు ఈమధ్య కలిసి ‘‘నీ ముఖంలో అప్పుడే వృద్ధాప్యపు ఛాయలు కనబడుతున్నాయేమోయ్?’’ అని నన్ను అడిగాడు. అతను డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఇప్పుడు పని చేస్తున్నాడు, దృఢకాయుడు. కానైతే నా వయస్సే యాభై ఐదు. యాభై ఐదులో రెండు అయిదులున్నాయి కదా! ఐదుతో ఐదు ప్లస్ చేస్తే బాల్యం(పదేండ్లు). ఐదుతో ఐదు ఇంటూ చేస్తే యౌవనం (పాతిక) ఐదు పక్కన ఐదు వ్రాస్తే యాభై ఐదు. వార్ధక్య ద్వారం! అయిదులో మరో చమత్కారం ఉంది. మన్ను, మిన్ను, నీరు, గాలి, వెలుతురు కలిసి పంచభూతాలు! - డా. దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ నుంచి -
చనిపోయిన వారితో ఛాటింగ్!
‘ఒరేయ్ అశోక్...నువ్వు చనిపోయి అప్పుడే అయిదు సంవత్సరాలవుతుందా?’ ‘స్పీక్ ఆర్ టైప్ టు రిప్లై టు రఘు’ చనిపోయిన మనిషి రిప్లై ఎలా ఇస్తాడు?! అనేది కదా మీ డౌటు. మసాచ్యూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కలిసి eterni.me పేరుతో సరికొత్త వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఒక వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు, హావభావాలతో పాటు సోషల్-నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్, చాట్ లాగ్స్, ఇ-మెయిల్స్...ఈ సైట్లో భద్రపరిచి నిజమని భ్రమింపచేసే ‘వర్చ్యువల్ అవతార్’ను సృష్టిస్తారు. బతికి ఉన్న వ్యక్తితో చేసినట్లే ఈ సరికొత్త అవతారంతో మనం వీడియో ఛాటింగ్ చేయవచ్చు. చనిపోయిన వ్యక్తిని వారి వ్యక్తిత్వం ఆధారంగా డిజిటల్ రూపంలో పునఃసృష్టి చేయబోతున్న eterni.me గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా ఇప్పటికే అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఒక్కరోజులోనే పదమూడు వందలమంది ఈ సైటులో తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు!