చస్తే బతకడం ఎలాగ?
గ్రంథం చెక్క
నేను శ్రీకాకుళం నుంచి విజయనగరం వచ్చిన కొత్తలో ఎక్కడ చూసినా... ప్రతి ఇంటిలోనూ అంగడిలోనూ ఆనందగజపతి మహారాజా వారి ఫోటోలు కనిపించేవి. అలాగే, సంభాషణల్లో తరచుగా బూతులు వినిపించేవి. ఆ తరువాత వినిపించేవి ఒకటి రెండు ఛలోక్తులు. అందులో ముఖ్యమయింది ‘ఒరే వీడు చస్తే మరి బతకడురా’ అని! దానినే కొంచెం మార్చి ‘‘చస్తే ఎలాగ బతకుతావురా!’’ అని!
రామమోహన్‌రాయ్, కేశవ చంద్రసేన్ మొదలైన మహా పురుషుల జీవితాలు చూడడం తటస్థించింది. ఈ ఛలోక్తి కేవలం అర్థం లేనిది కాదేమో అన్న సంశయం కలగడం మొదలైంది.
చచ్చినా బతికుండే వారున్నారని కొంచెం కొంచెం స్పష్టపడుతూ ఉంది. బతికున్నా చచ్చినవారితో సమానులు కొందరున్నారన్న దిక్కుకి ఊహ పోలేదు. అల్లసాని వారి -
‘కృష్ణరాయలతో దివి కేగలేక
బ్రతికియున్నాడ జీవచ్ఛవంబనగుచు’ అన్న పద్యం చూచినంత వరకూ ఆ దృష్టే కలుగలేదు.
బతుకుతూ చావడం, చచ్చినా బతకడం... రెండు విషయాలు రానురాను స్ఫుటమవుతూ వచ్చాయి మనసులో. అంతేకాదు, మనిషి గట్టి ప్రయత్నం చేస్తే చచ్చినా బతికుండవచ్చునన్న మాటగూడ సుసాధ్యంగా కనబడుతూ వచ్చింది.
(తాపీ ధర్మారావు ‘రాలూ-రప్పలూ’ నుంచి)