రవికుమార్ మృతదేహం
వీరఘట్టం(శ్రీకాకుళం) : విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం ఇటిక గదబవలసకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కోన రవికుమార్(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాగావళి ఎడమ కాలువ నీటి ప్రవాహంలో కొట్టుకువచ్చిన రవికుమార్ మృతదేహాన్ని అతని బంధువులు మంగళవారం వీరఘట్టం మండలం సంత–నర్సిపురం సమీపంలో గుర్తించారు. మృతుడి తలపై కత్తిపోట్లు ఉండటాన్ని బట్టి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
మృతుడి తండ్రి పెంటయ్య, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జియ్యమ్మవలస మండలం ఇటికగదబవలసకు చెందిన రవికుమార్ మూడేళ్లుగా అదే మండలం గౌరీపురంలో శంబంగి ఉమ్మారావు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ ఉదయం తన బైక్‌పై గౌరీపురం వెళ్లి పని పూర్తయిన తర్వాత స్వగ్రామం తిరిగి వచ్చేవాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రవికుమార్ రాత్రి వరకు రాకపోవడంతో అతని తండ్రి, బంధువులు ఆరాతీశారు.
ఇటికగదబవలస సమీపంలోని గెడ్డలో రవికుమార్ బైక్ కనిపించింది. గెడ్డ పక్కనే నాగావళి ఎడమకాలువ ఉంది. దీంతో బంధువులు ఎడమ కాలువలో గాలించగా మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో వీరఘట్టం మండలం సంత నర్సిపురం వద్ద మృతదేహం రావడాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. మృతదేహం కుమారుడిదేనని గుర్తించిన తండ్రి పెంటయ్య వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విజయనగరం జిల్లా ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాము, జియ్యమ్మవలస ఎస్‌ఐ కె.లక్ష్మణరావులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేయగా తాను దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాము విలేకర్లకు తెలిపారు. రవికుమార్‌కు భార్య భవానీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
'అన్నికోణాల్లోనూ దర్యాప్తు..
రవికుమార్ తలపై ఉన్న కత్తిపోట్లు బట్టి ఎవరో దుండగులు హత్య చేసినట్లు నిర్ధారించామని పోలీసులు తెలిపారు. ఇటిక గదబవలసతో పాటు అతను పనిచేస్తున్న గౌరీపురంలోనూ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. కాగా, రవికుమార్ మృదుస్వభావి అని, ఎవరితోనూ తగాదాలు లేవని గ్రామస్తులు చెబుతున్నారు.
సర్వత్రా అనుమానాలు
జియ్యమ్మవలస: ఇటికగదబవలస గ్రామానికి చెందిన కోన రవికుమార్ ట్రాక్టర్ డ్రైవరుగా గౌరీపురం గ్రామానికి చెందిన శంబంగి ఉమారా వు వద్ద మూడేళ్ల నుంచి పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లి రాత్రి వరకు రాలేదు. ఈ క్రమంలో తండ్రి పెంటయ్య మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు, గ్రామస్తులు వెదుకులాట ప్రారంభించారు. గ్రామ సమీపంలో ఇటిక గెడ్డ వద్ద బైక్ కనిపించడంతో గెడ్డ గుండా వెదుకులాట ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం సంతనర్సిపురానికి సమీపంలో ఉన్న నాగావళి ఎడమ కాలువ ఒడ్డున శవమై కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ లక్ష్మణరావు, ఎల్విన్‌పేట సీఐ ఎస్.రాము వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. తలపై గాయాలు బలంగా ఉండడంతో హత్య చేసి కాలువలో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. హత్య కేసుగా నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మృతునికి భార్య భవానీతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment