tractor driver died
-
ట్రాక్టర్ డ్రైవర్ హత్య!
వీరఘట్టం(శ్రీకాకుళం) : విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం ఇటిక గదబవలసకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కోన రవికుమార్(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాగావళి ఎడమ కాలువ నీటి ప్రవాహంలో కొట్టుకువచ్చిన రవికుమార్ మృతదేహాన్ని అతని బంధువులు మంగళవారం వీరఘట్టం మండలం సంత–నర్సిపురం సమీపంలో గుర్తించారు. మృతుడి తలపై కత్తిపోట్లు ఉండటాన్ని బట్టి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుడి తండ్రి పెంటయ్య, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జియ్యమ్మవలస మండలం ఇటికగదబవలసకు చెందిన రవికుమార్ మూడేళ్లుగా అదే మండలం గౌరీపురంలో శంబంగి ఉమ్మారావు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ ఉదయం తన బైక్‌పై గౌరీపురం వెళ్లి పని పూర్తయిన తర్వాత స్వగ్రామం తిరిగి వచ్చేవాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రవికుమార్ రాత్రి వరకు రాకపోవడంతో అతని తండ్రి, బంధువులు ఆరాతీశారు. ఇటికగదబవలస సమీపంలోని గెడ్డలో రవికుమార్ బైక్ కనిపించింది. గెడ్డ పక్కనే నాగావళి ఎడమకాలువ ఉంది. దీంతో బంధువులు ఎడమ కాలువలో గాలించగా మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో వీరఘట్టం మండలం సంత నర్సిపురం వద్ద మృతదేహం రావడాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. మృతదేహం కుమారుడిదేనని గుర్తించిన తండ్రి పెంటయ్య వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయనగరం జిల్లా ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.రాము, జియ్యమ్మవలస ఎస్ఐ కె.లక్ష్మణరావులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్ఐ కేసు నమోదు చేయగా తాను దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాము విలేకర్లకు తెలిపారు. రవికుమార్‌కు భార్య భవానీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 'అన్నికోణాల్లోనూ దర్యాప్తు.. రవికుమార్ తలపై ఉన్న కత్తిపోట్లు బట్టి ఎవరో దుండగులు హత్య చేసినట్లు నిర్ధారించామని పోలీసులు తెలిపారు. ఇటిక గదబవలసతో పాటు అతను పనిచేస్తున్న గౌరీపురంలోనూ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. కాగా, రవికుమార్ మృదుస్వభావి అని, ఎవరితోనూ తగాదాలు లేవని గ్రామస్తులు చెబుతున్నారు. సర్వత్రా అనుమానాలు జియ్యమ్మవలస: ఇటికగదబవలస గ్రామానికి చెందిన కోన రవికుమార్ ట్రాక్టర్ డ్రైవరుగా గౌరీపురం గ్రామానికి చెందిన శంబంగి ఉమారా వు వద్ద మూడేళ్ల నుంచి పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లి రాత్రి వరకు రాలేదు. ఈ క్రమంలో తండ్రి పెంటయ్య మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు, గ్రామస్తులు వెదుకులాట ప్రారంభించారు. గ్రామ సమీపంలో ఇటిక గెడ్డ వద్ద బైక్ కనిపించడంతో గెడ్డ గుండా వెదుకులాట ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం సంతనర్సిపురానికి సమీపంలో ఉన్న నాగావళి ఎడమ కాలువ ఒడ్డున శవమై కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ లక్ష్మణరావు, ఎల్విన్‌పేట సీఐ ఎస్.రాము వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. తలపై గాయాలు బలంగా ఉండడంతో హత్య చేసి కాలువలో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. హత్య కేసుగా నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మృతునికి భార్య భవానీతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
పెళ్లి చూపులకెళ్లాల్సిన వాడు..
కౌతాళం రూరల్ : కొద్దిసేపట్లో పెళ్లి చూపులకెళ్లాల్సిన ఓ యువకుడిని మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది. పోలీసులు వివరాల మేరకు.. ఓబుళాపురం గ్రామానికి చెందిన కుమ్మరి తిమ్మయ్య, అయ్యమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు కుమ్మరి కృష్ణ(22) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. కృష్ణ బుధవారం పెళ్లి చూపుల నిమిత్తం కోసిగి మండలం గౌడుగళ్లుకు వెళ్లాల్సి ఉంది. రెండెకరాల్లో పత్తిపంట తొలగించాల్సి ఉండడంతో త్వరగా పని ముగించుకుని వెళ్దామనుకున్నాడు. రోటోవేటర్లో చిక్కుకుని.. పనిలో ఉండగా గాలిపైపు ట్రాక్టర్ రోటోవేటర్‌కు చిక్కుకోవడంతో ట్రాక్టర్ నడుపుతూనే దాన్ని తొలగించేందుకు యత్నించాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి రోటోవేటర్లో చిక్కుకోవడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ట్రాక్టర్ దాదాపు 100 మీటర్లు ముందుకెళ్లి గుంతలో పడి నిలిచిపోయింది. ఈ తర్వాత గమనించిన కూలీలు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పెళ్లి చూపులకెళ్లాల్సిన కొడుకు విగతజీవిగా కనిపించడంతో తల్లి కన్నీరుమున్నీరైంది. ఆమె రోదించిన తీరు చూపురులను కంటతడి పెట్టించింది. ఎస్ఐ సుబ్రహ్మణ్యంరెడ్డి కేసు నమోదు చేసుకున్నారు. -
కరెంట్‌షాక్‌తో ఒకరి మృతి
కామారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: మండలంలోని ఉగ్రవాయి గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అపశ్రుతి చోటు చేసుకుంది. కరెంట్‌షాక్‌తో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందారు. గ్రామస్తులు, దేవునిపల్లి ఎస్సై సైదయ్య వివరాల ప్రకారం... గ్రామంలో ఏడు రోజుల పూజల అనంతరం ఆదివారం వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన వేళ అర్థరాత్రి దాటిన తర్వాత కొద్దిసేపు వర్షం పడింది. గణపతి వద్ద లైట్లు వెలగడానికి ట్రాన్స్‌కో ప్రధాన లైన్ల నుంచి కొండీలను వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదర్శ సంఘం గణపతి వారు కూడా ఇదే విధంగా కరెంట్‌ను వాడుతున్నారు. జనరేటర్లు అమర్చుకోకుండా కొండీల ద్వారా కరెంట్‌ను వాడారు. ఒక్కసారిగా కరెం ట్షాక్ రావడంతో ట్రాక్టర్ల నుంచి నలుగురు వ్యక్తులు దుంకి తప్పించుకున్నారు. ట్రాక్టర్ నడుపుతున్న చాకలి చంద్రం (35) ట్రాక్టర్‌పై నుంచి దిగినప్పటికీ కరెంట్‌షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గణేశ్ విగ్రహాలను వేకువజాము లోపలనే నిమజ్జనం చేశారు. మృతుడికి భార్య సులోచన, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సైదయ్య తెలిపారు. మృతుడి తండ్రి చాకలి భూమయ్య టీడీపీ మండల కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడి కుటుంబాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి నిట్టువేణుగోపాల్‌రావు, నాయకులు రాజేశ్వర్, చీల ప్రభాకర్, ఆనంద్, ఉస్మాన్, నజీర్ తదితరులు పరామర్శించారు. జనరేటర్లను వాడుకోవాలి : సీఐ, ఎస్సై గణేశ్ నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జనరేటర్లను వాడుకోవాలని రూరల్ సీఐ హరికుమార్, ఎస్సై సైదయ్య సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యాలతో ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. ప్రధాన వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కొండీలు వేసి కరెంట్ వాడవద్దన్నారు.