కరెంట్‌షాక్‌తో ఒకరి మృతి
Published Tue, Sep 17 2013 4:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
కామారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: మండలంలోని ఉగ్రవాయి గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అపశ్రుతి చోటు చేసుకుంది. కరెంట్‌షాక్‌తో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందారు. గ్రామస్తులు, దేవునిపల్లి ఎస్సై సైదయ్య వివరాల ప్రకారం... గ్రామంలో ఏడు రోజుల పూజల అనంతరం ఆదివారం వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన వేళ అర్థరాత్రి దాటిన తర్వాత కొద్దిసేపు వర్షం పడింది. గణపతి వద్ద లైట్లు వెలగడానికి ట్రాన్స్‌కో ప్రధాన లైన్‌ల నుంచి కొండీలను వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదర్శ సంఘం గణపతి వారు కూడా ఇదే విధంగా కరెంట్‌ను వాడుతున్నారు. జనరేటర్‌లు అమర్చుకోకుండా కొండీల ద్వారా కరెంట్‌ను వాడారు.
ఒక్కసారిగా కరెం ట్‌షాక్ రావడంతో ట్రాక్టర్ల నుంచి నలుగురు వ్యక్తులు దుంకి తప్పించుకున్నారు. ట్రాక్టర్ నడుపుతున్న చాకలి చంద్రం (35) ట్రాక్టర్‌పై నుంచి దిగినప్పటికీ కరెంట్‌షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గణేశ్ విగ్రహాలను వేకువజాము లోపలనే నిమజ్జనం చేశారు. మృతుడికి భార్య సులోచన, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సైదయ్య తెలిపారు. మృతుడి తండ్రి చాకలి భూమయ్య టీడీపీ మండల కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడి కుటుంబాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి నిట్టువేణుగోపాల్‌రావు, నాయకులు రాజేశ్వర్, చీల ప్రభాకర్, ఆనంద్, ఉస్మాన్, నజీర్ తదితరులు పరామర్శించారు.
జనరేటర్‌లను వాడుకోవాలి : సీఐ, ఎస్సై
గణేశ్ నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జనరేటర్‌లను వాడుకోవాలని రూరల్ సీఐ హరికుమార్, ఎస్సై సైదయ్య సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యాలతో ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. ప్రధాన వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కొండీలు వేసి కరెంట్ వాడవద్దన్నారు.
Advertisement
Advertisement