currentshock
-
చనిపోయినా వీడి పోలేక..
పలమనేరు (చిత్తూరు జిల్లా): తమ బిడ్డ చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఏనుగులు కోతిగుట్ట గ్రామంలో గున్న ఏనుగు మృతి చెందిన చోటును విడిచిపెట్టడం లేదు. శనివారం సైతం అక్కడికి వచ్చిన ఏనుగులు బిడ్డ కోసం రోధించాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కోతిగుట్ట గ్రామ పొలాల్లోకి సమీపంలోని కౌండిన్య అడవి నుంచి చొరబడ్డ ఏనుగుల గుంపులో ఓ గున్న ఏనుగు కరెంట్‌షాక్‌తో మృతిచెందిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి ఈ ఘటన జరగ్గా శుక్రవారం ఉదయం వరకు ఏనుగుల గుంపు మృతి చెందిన గున్న ఏనుగును విడిచిపెట్టి పోలేదు. శనివారం మరోసారి గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు గున్న ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి చేరుకున్నాయి. గున్న ఏనుగుకు పోస్టుమార్టం చేసి పూడ్చి పెట్టిన గుంత వద్ద గుమిగూడి రోదించాయి. కొన్ని ఏనుగులు గుంతను తోడేందుకు యత్నించాయి. ఇలా ఉండగా, గ్రామంలోకి వచ్చిన ఏనుగులను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనం అరుపులు కేకలు పెట్టి వాటికి ఆగ్రహాన్ని తెప్పించారు. కేరింతలు కొడుతూ సెల్ఫోన్లలో రికార్డు చేయడం చూసి అవి జనంపైకి తిరగబడ్డాయి. గుంపులోని ఓ మదపుటేనుగు రవి అనే రైతును వెంబడించి తొండంతో కొట్టడంతో అతను గాయపడ్డాడు. స్థానికులు అతన్ని పలమనేరు ఆస్పత్రికి తరలించారు. భయం గుప్పిట్లో కోతిగుట్ట గున్న ఏనుగు మృతిని ఏనుగులు ఏమాత్రం జీర్ణించుకోలేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి మళ్లీ మళ్లీ గ్రామంలోకి వచ్చి జనంపై దాడి చేసే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇటీవలే కాలువపల్లి వద్ద ఓ యువకుడు స్మార్ట్‌ఫోన్ లైట్ వేసి ఏనుగును అదిలించగా అది ఆ యువకుడిని తొక్కి చంపింది. ఏనుగులు పగబట్టి మరిన్ని దాడులు చేసేలా ఉండటంతో కోతిగుట్ట వాసులు భయాందోళనలు చెందుతున్నారు. -
విద్యుత్ షాక్‌కు ఇద్దరు బలి
చిల్లంగిలో విషాద ఛాయలు కిర్లంపూడి (జగ్గంపేట) :హైఓల్టేజీకి టీవీలు, ఫ్యాన్లు, ఇతర పరికరాలు కాలిపోతున్నాయని మండలంలోని చిల్లంగి గ్రామస్తులు కొన్నిరోజులుగా గగ్గోలు పెడుతున్నారు. ట్రాన్స్‌కో అధికారులకు పరిస్థితిని గ్రామస్తులు ఎన్నిసార్లు వివరించినా.. వారేమీ పట్టించుకోలేదు. సోమవారం టీవీ ఆన్ చేసేందుకు ప్లగ్ పెడుతున్న వ్యక్తి.. హైలేఓల్టేజీకి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో అధికారులు హడావుడిగా వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మృతికి వారే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మండలంలో చిల్లంగి గ్రామంలో సోమవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం సీలామంతుల రామశ్రీను (26) ఉదయం నిద్ర లేచి టీవీ ఆన్ చేయడానికి ప్లగ్ పెడుతుండగా హైఓల్టేజీ రావడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య దుర్గావెంకటలక్ష్మి, రెండేళ్ల వయసు గల బాలుడు ఉన్నాడు. భార్య ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. చంటిపిల్లాడితో భార్య, కుటుంబ సభ్యులు రామశ్రీను మృతదేహం వద్ద విలపించిన తీరు చూపరులను కలచివేసింది. తెల్లవారుతుండగా రామశ్రీను బతుకు తెల్లారిపోతుందని ఊహించలేదని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తహసీల్దార్ టి.రాజ్‌గోపాల్, ఎస్సై ఎ.బాలాజీ, వైద్యాధికారి చంద్రకిరణ్బాబు, స్థానిక నాయకుడు కాళ్ల దొంగబాబు మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఏడీఈ శివసత్యనారాయణ, ఏఈ నాగేశ్వరరావు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే... ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్లే గ్రామంలో హైఓల్టేజీకి రామశ్రీను మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు. కొన్ని రోజులుగా విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల టీవీలు, ఫ్యాన్లు, ఇతర గృహోపకరణాలు కాలిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను సక్రమంగా అందజేయాలని కోరుతున్నారు. కాయగూరల వ్యాపారి... రాజోలు : విద్యుదాఘాతానికి గురై రాజోలులో కాయగూరల వ్యాపారి ఇంటిపల్లి వెంకట పూర్ణేశ్వరరావు (పూర్ణయ్య) (50) సోమవారం మృతి చెందారు. రోజువారీ కాయగూరల వ్యాపారం చేసే అతడు దుకాణం తెరిచి బ్యాటరీలకు ఏర్పాటు చేసిన ఫ్లగ్‌ను తొలగిస్తుండగా అతడు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కుప్పకూలిపోయిన అతడిని హుటాహుటీన స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లేసరికి డాక్టర్ స్వరూప్ అతడు మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. చింతలపల్లి గ్రామానికి చెందిన ఇతడు కొన్నేళ్లుగా కాయగూరల వ్యాపారంతో రాజోలులో స్థిరపడ్డాడు. ఇటీవలే కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు కిషోర్, భాను ఉన్నారు. అతడి సోదరుడు ఇంటిపల్లి నూకరాజు (బుజ్జి) వైఎస్సార్ సీపీ చింతలపల్లి ఎంపీటీసీ సభ్యుడు. కుమారుడు కిషోర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కిషోర్ వచ్చేవరకు మృతదేహాన్ని ఐస్‌బాక్స్‌లో ఉంచారు. బుధవారం పూర్ణయ్యకు అంత్యక్రియలు నిర్వహిస్తామని సోదరుడు బుజ్జి తెలిపారు. స్థానిక వ్యాపారులు, కొనుగోలుదారులతో స్నేహంతో ఉండే పూర్ణయ్య మృతి పట్ల స్థానిక వ్యాపారులు సంతాపం తెలిపారు. -
విద్యుదఘాతంతో యువకుడి మృతి
వెంకట్రాంపురం(కోదాడరూరల్) మంచి నీరు తాగేందుకు వెళ్లి ఓ యువకుడి విద్యుదఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని వెంకట్రాంపురంలో బుధవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలప ప్రకారం గ్రామానికి చెందిన రావెళ్ల వెంకటయ్య, సూరమ్మ దంపతలు చిన్న కుమారుడు గోపి(18) తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో వరి నారు పంచేందుకు వెళ్లాడు. కూలీలు నాటువేస్తుండగా మంచి నీరు తాగేందుకు సమీపంలో ఉన్న గ్రామపంచాయతీ బోరు వద్దకు వెళ్లాడు. నీరు తాగిన అనంతరం అక్కడే ఉన్న షెడ్ నీడకు వెళ్లికూర్చొని పక్కనే ఉన్న మోటార్ పైప్‌పై చేయి వేయగా దానికి విద్యుత్‌సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు. -
కరెంట్ కాటేసింది
విద్యుదాఘాతంతో రైతు మృతి మరో ఘటనలో వాటర్‌మెన్‌కు గాయాలు బాలానగర్ : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని మోతిఘనపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గంగధర్‌పల్లి గ్రామం లో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గట్టుపల్లి అంజయ్య(34) గ్రామంలో తనకున్న కొ ద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయడం తో పాటు గ్రామంలోనే బోరుమోటార్లు రిపేరుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో బోరుమోటారును మరమ్మతుచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతడితో పాటు పక్కనే ఉన్న మరో బాలుడు రాఘవేందర్ గాయాలతో బయటపడ్డా డు. కిందకు వేలాడుతున్న విద్యుత్లైన్ల ను సరిచేయాలని అధికారులకు ఎన్నోసా ర్లు విన్నవించినా పట్టించుకోలేదని గ్రా మస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుడికి భార్య అలివేలు, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్‌కుమార్ తెలిపారు. మరో ఘటనలో.. కొత్తకోట: విద్యుదాఘాతంతో వాటర్మె న్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘట న గురువారం మండలంలోని అమడబాకుల గ్రామంలో జరిగింది. స్థానికుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన వాటర్‌మెన్ లక్ష్మయ్య నీళ్లు విడిచే క్రమంలో మో టార్లు పనిచేయలేదు. దీంతో కరెంట్స్తం భానికి ఉన్న విద్యుత్‌వైర్లు ఊడిపోయిన ట్లు గుర్తించాడు. వెంటనే సమీపంలో ఉ న్న ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజు తీసేశాడు. అయినా అక్కడమరోలైన్ విద్యుత్ సరఫరా అలాగే ఉంది. ఇదితెలియని లక్ష్మ య్య స్తంభంఎక్కి వైర్లు సరిచేయబోయా డు. విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ప్రమాదంలో లక్ష్మ య్య ఎడమచేయి పూర్తిగా కాలిపోయిం ది. స్థానికులు చికిత్సకోసం జిల్లాకేంద్రం లోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. -
కరెంట్‌షాక్‌తో ఒకరి మృతి
కామారెడ్డి టౌన్, న్యూస్‌లైన్: మండలంలోని ఉగ్రవాయి గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అపశ్రుతి చోటు చేసుకుంది. కరెంట్‌షాక్‌తో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందారు. గ్రామస్తులు, దేవునిపల్లి ఎస్సై సైదయ్య వివరాల ప్రకారం... గ్రామంలో ఏడు రోజుల పూజల అనంతరం ఆదివారం వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన వేళ అర్థరాత్రి దాటిన తర్వాత కొద్దిసేపు వర్షం పడింది. గణపతి వద్ద లైట్లు వెలగడానికి ట్రాన్స్‌కో ప్రధాన లైన్ల నుంచి కొండీలను వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదర్శ సంఘం గణపతి వారు కూడా ఇదే విధంగా కరెంట్‌ను వాడుతున్నారు. జనరేటర్లు అమర్చుకోకుండా కొండీల ద్వారా కరెంట్‌ను వాడారు. ఒక్కసారిగా కరెం ట్షాక్ రావడంతో ట్రాక్టర్ల నుంచి నలుగురు వ్యక్తులు దుంకి తప్పించుకున్నారు. ట్రాక్టర్ నడుపుతున్న చాకలి చంద్రం (35) ట్రాక్టర్‌పై నుంచి దిగినప్పటికీ కరెంట్‌షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గణేశ్ విగ్రహాలను వేకువజాము లోపలనే నిమజ్జనం చేశారు. మృతుడికి భార్య సులోచన, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సైదయ్య తెలిపారు. మృతుడి తండ్రి చాకలి భూమయ్య టీడీపీ మండల కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడి కుటుంబాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి నిట్టువేణుగోపాల్‌రావు, నాయకులు రాజేశ్వర్, చీల ప్రభాకర్, ఆనంద్, ఉస్మాన్, నజీర్ తదితరులు పరామర్శించారు. జనరేటర్లను వాడుకోవాలి : సీఐ, ఎస్సై గణేశ్ నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జనరేటర్లను వాడుకోవాలని రూరల్ సీఐ హరికుమార్, ఎస్సై సైదయ్య సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యాలతో ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. ప్రధాన వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కొండీలు వేసి కరెంట్ వాడవద్దన్నారు.