విద్యుత్ షాక్‌కు ఇద్దరు బలి
చిల్లంగిలో విషాద ఛాయలు
కిర్లంపూడి (జగ్గంపేట) :హైఓల్టేజీకి టీవీలు, ఫ్యాన్లు, ఇతర పరికరాలు కాలిపోతున్నాయని మండలంలోని చిల్లంగి గ్రామస్తులు కొన్నిరోజులుగా గగ్గోలు పెడుతున్నారు. ట్రాన్స్‌కో అధికారులకు పరిస్థితిని గ్రామస్తులు ఎన్నిసార్లు వివరించినా.. వారేమీ పట్టించుకోలేదు. సోమవారం టీవీ ఆన్ చేసేందుకు ప్లగ్ పెడుతున్న వ్యక్తి.. హైలేఓల్టేజీకి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో అధికారులు హడావుడిగా వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మృతికి వారే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మండలంలో చిల్లంగి గ్రామంలో సోమవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం సీలామంతుల రామశ్రీను (26) ఉదయం నిద్ర లేచి టీవీ ఆన్ చేయడానికి ప్లగ్ పెడుతుండగా హైఓల్టేజీ రావడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య దుర్గావెంకటలక్ష్మి, రెండేళ్ల వయసు గల బాలుడు ఉన్నాడు. భార్య ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. చంటిపిల్లాడితో భార్య, కుటుంబ సభ్యులు రామశ్రీను మృతదేహం వద్ద విలపించిన తీరు చూపరులను కలచివేసింది. తెల్లవారుతుండగా రామశ్రీను బతుకు తెల్లారిపోతుందని ఊహించలేదని మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తహసీల్దార్ టి.రాజ్‌గోపాల్, ఎస్సై ఎ.బాలాజీ, వైద్యాధికారి చంద్రకిరణ్‌బాబు, స్థానిక నాయకుడు కాళ్ల దొంగబాబు మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఏడీఈ శివసత్యనారాయణ, ఏఈ నాగేశ్వరరావు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే...
ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్లే గ్రామంలో హైఓల్టేజీకి రామశ్రీను మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు. కొన్ని రోజులుగా విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల టీవీలు, ఫ్యాన్లు, ఇతర గృహోపకరణాలు కాలిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను సక్రమంగా అందజేయాలని కోరుతున్నారు.
కాయగూరల వ్యాపారి...
రాజోలు : విద్యుదాఘాతానికి గురై రాజోలులో కాయగూరల వ్యాపారి ఇంటిపల్లి వెంకట పూర్ణేశ్వరరావు (పూర్ణయ్య) (50) సోమవారం మృతి చెందారు. రోజువారీ కాయగూరల వ్యాపారం చేసే అతడు దుకాణం తెరిచి బ్యాటరీలకు ఏర్పాటు చేసిన ఫ్లగ్‌ను తొలగిస్తుండగా అతడు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కుప్పకూలిపోయిన అతడిని హుటాహుటీన స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లేసరికి డాక్టర్ స్వరూప్ అతడు మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. చింతలపల్లి గ్రామానికి చెందిన ఇతడు కొన్నేళ్లుగా కాయగూరల వ్యాపారంతో రాజోలులో స్థిరపడ్డాడు. ఇటీవలే కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు కిషోర్, భాను ఉన్నారు. అతడి సోదరుడు ఇంటిపల్లి నూకరాజు (బుజ్జి) వైఎస్సార్ సీపీ చింతలపల్లి ఎంపీటీసీ సభ్యుడు. కుమారుడు కిషోర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కిషోర్ వచ్చేవరకు మృతదేహాన్ని ఐస్‌బాక్స్‌లో ఉంచారు. బుధవారం పూర్ణయ్యకు అంత్యక్రియలు నిర్వహిస్తామని సోదరుడు బుజ్జి తెలిపారు. స్థానిక వ్యాపారులు, కొనుగోలుదారులతో స్నేహంతో ఉండే పూర్ణయ్య మృతి పట్ల స్థానిక వ్యాపారులు సంతాపం తెలిపారు.