
గరుగుబిల్లి(కురుపాం): వివాహామైన పది రోజులకే ఆ జంటపై విధి కన్నెర్ర జేసింది. బైక్‌పై భార్యతో వెళుతున్న భర్తపై ముగ్గురు దొంగలు దాడి చేసిన ఘటనలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..భార్యకు గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావు (25)తో గత నెల 28న వివాహమైంది.
వీరిద్దరూ సోమవారం తమ ద్విచక్రవాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు పార్వతీపురం వచ్చారు. సర్వీసింగ్ పూర్తి చేసుకుని రాత్రి 7.30 గంటలకు బయలుదేరి వెళ్తుండగా గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ సమీపంలోని ఐటీడీఏ పార్కు వద్ద లఘుశంక తీర్చుకునేందుకు ఆగారు. ఇంతలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేశారు. గౌరీ శంకర్రావును రాడ్డుతో తలపై మోదడంతో అతనికి తీవ్రగాయాలై మృతి చెందగా భార్య సరస్వతి గాయాలపాలైంది. ఈమె మెడలో ఉన్న సుమారు 6 తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుని పరారయ్యారు.
తన కళ్ల ముందే భర్తను దొంగలు హతమార్చడంతో సరస్వతి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. దొంగల దాడి విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సరస్వతికి ఆస్పత్రిలో చేర్పించారు. ఏఎస్సీ దీపికాపాటిల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.