నిమజ్జనోత్సవంలో వివాదం
Published Thu, Sep 19 2013 3:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
రణస్థలం, న్యూస్‌లైన్: వినాయక ఉత్సవాల్లో భాగంగా విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళుతున్న లారీని పోలీస్ అధికారి సీజ్ చేయడం వివాదానికి దారి తీసింది. హిందువుల మనోభావాలు దెబ్బతిసే విధంగా పోలీసుల ప్రవర్తిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం శంబాం గ్రామంలో వినాయక ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. బుధవారం రణస్థలం మండలం సమీపంలో గల సముద్రంలో నిమజ్జనం చేసేందుకు వినాయక విగ్రహాన్ని లారీలో గ్రామస్తులు తీసుకువస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళుతున్న శ్రీకాకుళం ఏఎస్పీ సెంథిల్ కుమార్ లారీని ఆపి పర్మిషన్ ఉందా అని డ్రైవర్‌ను అడిగితే లేదని చెప్పాడు. వెంటనే లారీని సీజ్ చేసి లారీ రికార్డులను స్థానిక జేఆర్‌పురం పోలీసులకు అప్పగించారు. రికార్డులు ఉంచుకుని లారీని వదిలితే వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసి వచ్చి లారీ అప్పగిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రాథేయపడినా ఏఎస్పీ వినిపించుకోలేదు. ఏఎస్పీ వైఖరిని నిరసిస్తూ జేఆర్‌పురం పాత పోలీస్ స్టేషన్ వద్ద లారీని ఆపి అందులో ఉన్న శంబాం గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న స్థానికులు కూడా వారికి మద్దతుగా ఆందోళనలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ రాజకీయ నాయకుల సభలకు, సమావేశాలకు పర్మిషన్ లేకుండా వివిధ వాహనాల్లో ప్రజలను తరలించడం పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా హైదరాబాద్ వంటి పట్టణాల్లో పోలీసులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తుంటే శ్రీకాకుళం ఏఎస్పీ ప్రవర్తించిన తీరు సరిగా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినాయక విగ్రహ నిమజ్జనానికి వెళుతున్న లారీని సీజ్ చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిం చారు. ఈ ఘటన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
భక్తులు, స్థానికుల ఆందోళనతో జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అధికారులు స్పందించకపోవడంతో వినాయక విగ్రహాన్ని రోడ్డుపై పెట్టి ఆందోళన మరింత ఉద్ధృతం చేసేందుకు భక్తులు సిద్ధమయ్యారు. సుమారు ఒంటిగంట సమయంలో వేరే కార్యక్రమంలో పాల్గొని రణస్థలం వచ్చిన స్థానిక ఎస్సై లెంక సన్యాసినాయుడు విషయం తెలుసుకుని లారీ రికార్డులు డ్రైవర్‌కు ఇవ్వడంతో సమస్య పరిష్కారమైంది.
Advertisement
Advertisement