
సాక్షి, విజయనగరం టౌన్: ఇటీవల విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ పార్క్ సమీపంలో భర్త గౌరీశంకర్‌ను హతమార్చిన భార్య సరస్వతి ఫేస్‌బుక్ లవర్ మడ్డు శివను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్తున్న శివను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జిల్లా ఎస్పీ పాలరాజు శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. పెళ్లైన తొమ్మిది రోజులకే భర్తను మట్టుబెట్టిన కేసులో భార్య సరస్వతితో పాటు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
గౌరీశంకర్ హత్య జరిగిన నాటి నుంచి మడ్డు శివ పరారీలో ఉన్నాడు. అతడి కోసం అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడు రాష్ట్రం దాటి వెళ్తుండగా పక్కా సమాచారంతో అతడిని పట్టుకున్నారు.