నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. సరస్వతి, గౌరీశంకర్ పెళ్లిఫొటో(ఇన్‌సెట్)
సాక్షి, విజయనగరం టౌన్ / వీరఘట్టం: విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన నవ వరుడి హత్యకేసు కీలక మలుపు తిరిగింది. గరుగుబిల్లి మండలం ఐడీడీఏ పార్కు వద్ద సోమవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న కొత్తగా పెళ్లయిన జంటపై ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి అందులో భర్తను ఇనుపరాడ్డుతో బలంగా కొట్టి హత్యచేసిన విషయం విధితమే. అయితే ఇది నగల కోసం దొంగలు చేసిన పని కాదని, ఇష్టం లేని పెళ్లి చేయడంతో భార్యే ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేసిందని జిల్లా ఎస్పీ జి.పాలరాజు మంగళవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దుండగులను పట్టుకునేందుకు రంగలోకి దిగిన పోలీసులు నలుమూలల వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. పెదమానాపురం వద్ద సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు ఆటోలో వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమదైన శైలిలో విచారణ చేయడంతో మెరుగు గోపి, సారిపల్లి రామకృష్ణ, గుర్రాల బంగార్రాజు, ఆటోడ్రైవర్ దేవరాపల్లి కిశోర్ నిజాన్ని అంగీకరించారు. సరస్వతి ఫేస్‌బుక్‌లో పరిచయమైన మడ్డు శివ అలియాస్ ఆది అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో మేనమామ అయిన గౌరీశంకరరావుతో ఇష్టం లేని పెళ్లి జరగడంతో భర్తను హతమార్చి ప్రియుడికి చేరుక కావాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం శివ ద్వారా సరస్వతి విశాఖపట్నానికి చెందిన గోపీని కలిసి భర్తను హత్య చేస్తే బంగారం ఇస్తానని తెలిపింది. ముందుగా రూ.8వేలు నగదు, బంగారు ఉంగరం ఇచ్చింది. శివ మరో రూ.10వేలు అడ్వాన్సుగా ఇచ్చాడు. పథకం ప్రకారం వారు ఆటోలో కాపుకాసి ఉన్న ప్రదేశానికి రాగానే భర్తతో బైక్‌పై వెళ్తున్న సరస్వతి లఘుశంక తీర్చుకునేందుకు వెళతానని బైక్ దిగి పక్కకు వెళ్లింది. వెంటనే దుండగులు గౌరీశంకర్‌పై ఇనుపరాడ్డుతో తలపై కొట్టి చంపేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో నిందితులు ఉపయోగించిన ఫోన్లు, ఆటో, బంగారు ఆభరణాలు, ఇనుపరాడ్డు స్వాధీనపరుచుకున్నారు.
నిశ్చేష్టులైన అత్తమామలు
తమ కుమారుడిని కోడలే హత్య చేయించందన్న విషయం తెలియడంతో మృతుని తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. కట్టుకున్నవాడిని కడతేర్చడానికి నీకు చేతులు ఎలా వచ్చాయంటూ సరస్వతిపై మండిపడ్డారు. మంగళవారం స్వగ్రామం చిట్టపుడివలసకు వచ్చిన గౌరీశంకర్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు భోరున విలపించారు. పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కాని ఇలా భర్తనే పాశవికంగా మట్టుపెట్టడానికి చేతులెలా వచ్చాయని ప్రశ్నించారు. చిన్నతనం నుంచీ తాత గారి ఇంటి వద్దే ఉండి చదువుకుంటూ, అన్ని అవసరాలకూ బావ (భర్త గౌరీ శంకర్) ఇచ్చే డబ్బులతోనే జల్సాలు చేసిన సరస్వతి చివరకు తిన్న ఇంటి వాసాలే లెక్కపెట్టిందని గ్రామస్తులు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment