పెనుగొండ, పశ్చిమ గోదావరి: ఏ కష్టం వచ్చిందో తెలియదు. నవ దంపతులు గోదావరిలో దూకారు.. వరుడు ప్రాణాలతో బయట పడగా.. వధువు కోరాడ సత్యవతి మృతి చెందింది.. అయితే వరుడుపై వధువు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వడలి గ్రామానికి చెందిన కోరాడ సత్యవతి(19)ని తండ్రి లేకపోవడంతో తాతే పెంచి ఈ నెల 15న ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన కే శివరామకృష్ణతో వివాహం జరిపించాడు. వీరు మంగళవారం రావులపాలెం సినిమాకు అని చెప్పి వెళ్లారు.
శివరామకృష్ణ కథనం ప్రకారం ఇద్దరూ సిద్ధాంతం బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్రిడ్జి నుంచి ఆర కిలో మీటరు దూరంలో ఉన్న శివరామకృష్ణ కేదారీఘాట్ సమీపంలో రక్షించమని అరవడంతో మత్స్యకారులు కాపాడారు. విషయాన్ని వధువు బంధువులకు చెప్పి తణుకు ప్రభుత్వాసుపత్రికి వైద్యం చేయించుకోవడానికి వెళ్లిపోయాడు. వధువు గల్లంతు కావడంతో బంధువులు గాలింపు చర్యలు చేపట్టి, పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో శివరామకృష్ణను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వధువు కోరాడ సత్యవతి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. శివరామకృష్ణ హత్య చేశాడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ వడలి గ్రామస్తులు భారీగా పెనుగొండ పోలీస్ స్టేషన్‌కు తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సత్యవతి హత్య చేసి గోదావరిలో పడేయడమో చేసుంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్‌లు గ్రామస్తులకు సర్ధి చెప్పి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, అనుమానాలు పెట్టుకోవద్దంటూ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment