Garugubilli
-
ప్రాణం తీసిన టాబ్లెట్
అవగాహనా రాహిత్యం ఆ చిన్నారి ప్రాణాలను బలిగొంది. సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఆ కుటుంబానికి కడుపుకోత మిగిల్చింది. నులిపురుగుల నివారణకోసం ఇచ్చిన మాత్ర అభంశుభం తెలియని ఆ బాలుని ఆయుష్సు తీసింది. గరుగుబిల్లి మండలం కె.ఆర్.ఎన్.వలస అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తలు అందించిన మాత్ర బాలుని నాన్నమ్మ మింగించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదన అందరి మనసులనూ కలచివేసింది. సాక్షి, పార్వతీపురం (విజయనగరం): పొట్టలో నులి పురుగులు చంపేందుకు వేసిన మాత్ర ఓ బాలుడు ప్రాణం తీసిన ఘటన కేఆర్‌ఎన్‌వలస గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కేఆర్‌ఎన్‌వలస గ్రామం అంగన్వాడీ కేంద్రంలో కొట్నాన జశ్వంత్‌నాయుడు(2)కు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఆల్బెండ్జోల్ మాత్రను అంగన్వాడీ నిర్వాహకులు అందించారు. బాలుడి నాన్నమ్మ అప్పమ్మ ఒడిలో పడుకోబెట్టి ఏఎన్ఎం మరడాన సుమతి, అంగన్వాడీ నిర్వాహకురాలు కొట్నాన సరస్వతి మాత్రను మింగించారు. తొలుత బాలుడు మాత్రను మింగలేక కక్కేయడంతో రెండోసారి బాలునిచే మింగించారు. మాత్ర మింగిన కొద్ది సేపటికే బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు కొట్నాన చంద్రశేఖరరావు, సుజాత పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లమని అక్కడి వైద్యులు చెప్పడంతో వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించే సమయానికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి చేరుకొన్న అధికారులు మాత్ర వికటించిన సంఘటనలో బాలుడు మృతి చెందాడని తెలుసుకొన్న డీఎంహెచ్ఓ విజయలక్ష్మీ,స్థానిక వైద్యులు పీఏ ప్రియాంక, ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహసీల్దార్ అజూరఫీజాన్, ఎస్ఐ సింహచలం ఆస్పత్రికి చేరుకొని సంఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. దర్యాప్తు చేసి క్రమశిక్షణ చర్యలు చేపడతామన్నారు. విషయం తెలుసుకున్న తహ సీల్దార అజూరఫీజాన్, ఎంపీడీఓ ఎంవీ గోపాలకృష్ణ, కేఆర్ఎన్ వలస వెళ్లారు. వివరాలు సేకరించారు. మరో నలుగురు అల్బెండజోల్ మాత్రను వేసుకొన్న మరో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని స్థానికులు బావించి చిన్నారులను పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారి పరిస్థితి బాగానే వుందని వైద్యులు తనిఖీలు చేసి పంపించారు. నివేదిక ఇవ్వండి : మంత్రి బాలుడి మృతికి కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను అందించాలని డీఎంహెచ్ఓ విజయలక్ష్మికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఫోన్లో ఆదేశించారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంటో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు.. రైల్వేలో ఉద్యోగం చేసుకుంటూ కాకినాడలో స్థిరపడిన చంద్రశేఖర్, సుజాతలు తన సొంత గ్రామమైన కొట్నాన రామినాయుడు వలస వచ్చారు. తల్లిదండ్రులు శివున్నాయుడు, అప్పమ్మలను చూసేందుకు వచ్చారు. శుక్రవారం కాకినాడ వెళ్లేందుకు సిద్ధం కాగా గురువారం నులిపురుగులు దినోత్సవం కావడంతో తన కుమారుడికి కూడా మాత్రవేసి పొట్టలో నులిపురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయని భావించి అంగన్వాడీ కేంద్రానికి నాన్నమ్మ అప్పమ్మతో పంపించారు. అక్కడ ఇచ్చిన మాత్రను మింగిన తరువాత తన కుమారుడు మృతి చెందాడని రోదిస్తూ పుట్టెడు దుఖఃంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మొదటి సంతానానికి మాత్ర కాటేసింది చంద్రశేఖర్, సుజాతల మొదటి సంతానం జశ్వింత్‌నాయుడు సొంత గ్రామంలో మాత్ర రూపంలో మృత్యువు కాటేసిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఈ సంఘటన అందర్ని కన్నీరు తెప్పించింది. కాగా సుజాత ప్రస్తుతం గర్భిణి కావడంతో మరణించిన వార్త ఆమెకు ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. -
పోలీసుల అదుపులో ఏడో నిందితుడు..
పార్వతీపురం : గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద ఉన్న ఐటీడీఏ పార్క్ సమీపంలో ఈ నెల 7న జరిగిన నవ వరుడు గౌరీశంకరరావు హత్యకేసు కొత్త మలుపు తిరిగింది. కట్టుకున్న భర్త గౌరీశంకరరావును (మేనమామ) కడతేర్చాలని తన ప్రియుడు శివ సహకారంతో విశాఖపట్నానికి చెందిన రౌడీమూకతో ఒప్పందం కుదుర్చుకున్న భార్య పథకం ప్రకారం భర్తను చంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యకేసుకు సంబంధించి ఏఎస్పీ దీపిక పాటిల్ విచారణలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. పెళ్లి అయిన తర్వాత చంపించడానికి పథకం పన్నడమే కాకుండా పెళ్లికి ముందు కూడా బెంగళూరులో పనిచేస్తున్న సమయంలో గౌరీశంకరరావును హత్య చేయించేందుకు సరస్వతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తెలిసింది. ఈ వివరాలను ఏఎస్పీ దీపిక పాటిల్ శుక్రవారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే సరస్వతి విశాఖపట్నంలోని సాయిసుధ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నప్పుడు కల్యాణి అనే స్నేహితురాలు పరిచయమైంది. ఆమె సహకారంతో రాజాన శ్రీనివాసరావు అనే వ్యక్తిని పరిచయం చేసుకొని తన మేనమామ గౌరీశంకరరావును బెంగళూరులో హతమార్చేందుకు లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సరస్వతి తన ప్రియుడు శివ వద్ద రూ. 25 వేలు తీసుకొని శ్రీనివాసరావుకు అడ్వాన్స్‌గా చెల్లించింది. ఆ తరువాత మరోసారి రూ. 11వేలు అందజేసింది. ఈ రెండు పేమెంట్లు ఆన్లైన్లో తేజ్ యాప్ ద్వారా శ్రీనివాసరావుకు చేరాయి. అనంతరం మరో 14 వేల రూపాయలను చేతికి నేరుగా అందజేసింది. అయితే డబ్బులు తీసుకున్న రాజాన శ్రీనివాసరావు తన తల్లికి బాగోలేకపోవడంతో పథకాన్ని అమలు చేయలేకపోయాడు. దీంతో సరస్వతికి తన మేనమామ గౌరీశంకరరావుతో వివాహం జరిగిపోయింది. ఎలాగైనా తన భర్తను చంపాలని ప్రియుడు శివతో చర్చించి విశాఖపట్నానికి చెందిన రౌడీషీటర్ రామకృష్ణతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత పథకం ప్రకారం ఈ నెల 7న తోటపల్లి ఐటీడీఏ పార్క్ వద్ద దాడి చేసి గౌరీశంకర్‌ను హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటికే సరస్వతితో పాటు హత్యకు పాల్పడిన శివ , గోపి, రామకృష్ణ, బంగార్రాజు, కిశోర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ముందుగా హత్యచేసేందుకు సుపారి తీసుకొని పథకం పన్నిన శ్రీనివాసరావును విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకొని 7వ నిందితుడిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాంబాబు, గరుగుబిల్లి ఎస్సై హరిబాబునాయుడులు పాల్గొన్నారు. -
నవదంపతులపై దొంగల దాడి
గరుగుబిల్లి(కురుపాం): వివాహామైన పది రోజులకే ఆ జంటపై విధి కన్నెర్ర జేసింది. బైక్‌పై భార్యతో వెళుతున్న భర్తపై ముగ్గురు దొంగలు దాడి చేసిన ఘటనలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..భార్యకు గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావు (25)తో గత నెల 28న వివాహమైంది. వీరిద్దరూ సోమవారం తమ ద్విచక్రవాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు పార్వతీపురం వచ్చారు. సర్వీసింగ్ పూర్తి చేసుకుని రాత్రి 7.30 గంటలకు బయలుదేరి వెళ్తుండగా గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ సమీపంలోని ఐటీడీఏ పార్కు వద్ద లఘుశంక తీర్చుకునేందుకు ఆగారు. ఇంతలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేశారు. గౌరీ శంకర్రావును రాడ్డుతో తలపై మోదడంతో అతనికి తీవ్రగాయాలై మృతి చెందగా భార్య సరస్వతి గాయాలపాలైంది. ఈమె మెడలో ఉన్న సుమారు 6 తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుని పరారయ్యారు. తన కళ్ల ముందే భర్తను దొంగలు హతమార్చడంతో సరస్వతి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. దొంగల దాడి విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సరస్వతికి ఆస్పత్రిలో చేర్పించారు. ఏఎస్సీ దీపికాపాటిల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ మీద వెళ్తున్న నవ జంటపై దాడి..
-
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
గరుగుబిల్లి : మండలంలోని పెద్దూరులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానిక ఎస్ఐ ఎస్.హరిబాబునాయుడు గురువారం అందించిన వివరాలిలా వున్నాయి. బుధవారం రాత్రి పెద్దూరు గ్రామానికి చెందిన తాబేలు శంకరరావు(26) గరుగుబిల్లి నుంచి తన స్వగ్రామమైన పెద్దూరు మోటారు సైకిల్‌పై వెళ్తున్న సమయంలో రాచప్ప చెరువు చివర ఉన్న కల్వర్టును బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శంకరరావు మృతితో తల్లి రవణమ్మ, తాత గంగయ్యలు కన్నీరుమున్నీరయ్యారు. -
మనస్థాపంతో ఒకరి ఆత్మహత్య ?
గరుగుబిల్లి : కుటుంబ కలహాలతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని వల్లరగుడబ గ్రామానికి చెందిన ఆకుల బాపిరాజు (35) ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృ తి చెందాడు. మృతుడికి పదేళ్ల కిందట శ్రీకాకు ళం జిల్లా మడపాం గ్రామానికి చెందిన సోములమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కు మారులున్నారు. అయితే ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నారుు. ఈ క్రమంలో సోములమ్మ బిడ్డలను తీసుకొని కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వా త భర్తపై నరసన్నపేట కోర్టులో కేసు వేసింది. ఇదిలా ఉంటే బాపిరాజు బతుకుదెరు వు కోసం చెన్నై వెళ్లిపోయూడు. ఈ ఏడాది జనవరిలో గ్రామానికి రాగా, భార్య పెట్టిన కేసులో భాగం గా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రెండు నెలల పాటు జైలులో ఉన్న బాపిరాజు అనంతరం గ్రామానికి చేరుకున్నాడు. గురువారం కూడా గ్రామంలో కనిపించిన బాపిరాజు తర్వాత కనిపించకుండా పోయూడు. శనివారం నాటికి బాపిరాజు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇ చ్చారు. ఎస్సై లోవరాజు సిబ్బందితో కలిసి గ్రా మానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూణ్ణాళ్ల ముచ్చట
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. ఇక్కడ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఆధ్వర్యంలో ప్రాజెక్టు కుడిమట్టికట్ట పరిసరాలలో ఏర్పాటుచేసిన బోటుషికారు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించకపోవడంతో వారి తాకిడి తగ్గింది. ఒకవైపు తాటిపూడి ప్రాజెక్టును పర్యాట కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇటలీకి చెందిన సంస్థ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి తోటపల్లి ప్రాజెక్టు స్థితిగతులపై అవలోకనం చేసుకోవాలి. కానరాని మౌలిక సౌకర్యాలు తోటపల్లిని పర్యాటకులు ఆకర్షించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రూ.41.92లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో రెండు బోట్లను కొనుగోలుచేసి అవసరమైన పనులను నిర్వహించి బోటుషికారును 2012 మార్చిలో అప్పటి కేంద్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి కిశోర్‌దేవ్ అట్టహాసంగా ప్రారంభించారు. బోటుషికారు నిర్వహణకు సుంకి, కోటవానివలస, బంటువానివలస గ్రామాల్లోని పదిమంది గిరిజన యువతకు శిక్షణ కూడా ఇచ్చారు. బోటుషికారు ప్రారంభ తొలినాళ్లలో పర్యాటకుల తాకిడి బాగానే ఉండేది. అయితే ఈ ప్రాంతంలో పర్యాటకులకు అవసరమైన తాగునీరు, విశ్రాంతి గదులు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంతో ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సందర్శకుల తాకిడి తగ్గింది. ఈ కారణంగా బోటుషికారుకు ఆదాయం రాకపోవడంతోపాటు సిబ్బందికి ఐటీడీఏ సంస్థ సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో నిర్వాహకులు విధులనుంచి తప్పుకున్నారు. ఇప్పుడు బోట్లు అలంకార ప్రాయంగా మారాయి. నిధులు మంజూరుచేసిన అధికారులు కనీస పర్యవేక్షణ చేయకపోవడంతో ఇది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. సౌకర్యాలు కల్పిస్తే మంచిదే... ఈ ప్రాంతంలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన వేంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు నూతనంగా నిర్మించిన భారీనీటిపారుదల ప్రాజెక్టు ఉండటంతో పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది. దీనివల్ల అటు ఆలయానికి సందర్శకుల తాకిడి ఎక్కువై ఆదాయం పెరుగుతుంది. ప్రాజెక్టు కుడిమట్టికట్ట ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని గతంలో ప్రాజెక్టును సందర్శించిన సమయంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆ దిశగా పనులుమాత్రం సాగడంలేదు. ముఖ్యంగా కార్తీకమాసంలో ఒడిశా, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర సుదూర ప్రాంతాలనుంచి వేలాదిమంది పర్యాటకులు వస్తూంటారు. వారిని ఆకర్షించేలా బోటుషికారు లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులతోపాటు, అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఫినాయిల్ తాగిన కేజీబీవీ విద్యార్థిని
సకాలంలో చికిత్సతో తప్పిన ప్రాణాపాయం గరుగుబిల్లి: మండలంలోని రావివలస కస్తూరిబా బాలికల విద్యాలయలో 8వ తరగతి చదువుతున్న పి.శ్రావణి అనే విద్యార్థిని మంగళవారం ఉదయం ఫినాయిల్ తాగింది. దీన్ని గమనించిన సిబ్బంది గ్రామంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. శ్రావణికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. శ్రావణి తల్లిదండ్రులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. గతేడాది వరకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ పాఠశాలలో చదివిన శ్రావణిని ఈ ఏడాది మండలంలోని దళాయివలసలో ఉన్న తాత గులిపిల్లి సత్యంనాయుడు వద్దకు పంపారు. ఆయన రావివలస కేజీబీవీలో చేర్పించారు. అయితే ఇక్కడ చదవటం శ్రావణికి ఇష్టం లేదని సమాచారం. పుష్కరాలకు సెలవులు ప్రకటించటంతో పదోతరగతి విద్యార్థులను మినహ మిగిలినవారిని ఇళ్లకు పంపేశారు. శ్రావణి మాత్రం తాతగారి ఇంటి కి వెళ్లనని చెప్పి పాఠశాలలో ఉండిపోయింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలు ముగించుకున్నాక బాత్రూమ్లోని ఫినాయిల్‌ను తాగేసింది. బాటిల్లో ఉన్నది ఫినాయిల్ అని తెలియక తాగానని ఆమె చెప్పటం గమనార్హం. కేజీబీవీలో చదవటం ఇష్టం లేక ఇలా చేసిందా, పాఠశాలలో ఏమైనా సమస్యలున్నాయా.. అనేది విచారణలో తేలాల్సి ఉంది. కొద్దిరోజుల క్రితం పాఠశాలలోనే ఇలాంటి సంఘటనే చోటు చేసుకోగా బయటకు రాకుండా సిబ్బంది జాగ్రత్తపడ్డారని స్థానికులంటున్నారు. ఎందుకు తాగిందో తెలియదు.. పాఠశాలకు ప్రస్తుతం సెలవులిచ్చాం. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. మిగిలిన విద్యార్థులను ఇళ్లకు పంపాం. శ్రావణి తాతగారికి ఇంటి వెళ్లనంది. ఫినాయిల్ ఎందుకు తాగిందో తెలియదు. ఎంత ప్రశ్నించినా తెలియక తాగానని చెబుతోంది. ఆమె బంధువులకు సమాచారమిచ్చాం. శ్రావణికి అవసరమైన వైద్యసేవలనందిస్తున్నాం. -జె.సంధ్య, ప్రత్యేకాధికారి, కేజీబీవీ -
ప్రశాంతంగా విచారణ
గరుగుబిల్లి : రావివలస పీఏసీఎస్‌లో శనివారం నిర్వహించిన విచారణ ప్రశాంతంగా జరిగింది. విచారణకు హాజరు కావాలని 137మందికి సమన్లు జారీచేస్తే కేవలం 11మంది మాత్రమే హాజరయ్యారు. అలాగే గతనెల 27న నిర్వహించిన విచారణకు కూడా 151మందికి సమన్లు జారీచేస్తే 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఇంతవరకు 508 మందికి సమన్లు జారీచేస్తే 376 మంది విచారణ ఎదుర్కొన్నారు. ఇందులో 40మందికి సమన్లు పంపిణీ కాలేదు. రావివలస పీఏసీఎస్‌లో చోటుచేసుకున్న అవకతవకలపై సాక్షిలో ఇటీవల పలు కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన విచారణలో కోపరేటివ్ రిజిస్ట్రార్, విచారణాధికారి పి. చిన్నయ్య మాట్లాడుతూ, ప్రజలు విచారణకు సహకరిస్తే విచారణ వేగవంతమవుతుందన్నారు. సొసైటీలోని మొత్తం ఖాతాదారులు 4441 మందికి సమన్లు జారీ చేసి వీలైన ంత త్వరగా విచారణ కార్యక్రమం పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే కూరగాయల పెంపకం కోసం రుణాలు తీసుకున్న 12 గ్రూపుల్లోని సభ్యులు 68 మందికి, పాడిగేదెల పెంపక ంనకు సంబంధించి 22 గ్రూపుల్లోని 129 మందికి కూడా సమన్లు జారీచేయనున్నట్లు తెలిపారు. విచారణ పూర్తి చేసి నివేదికను డీసీఓకు పంపించడం జరుగుతుందన్నారు. దోషులపై డీసీఓ చర్యలు తీసుకుంటారని తెలిపారు. అనంతరం పార్వతీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. చంద్రశేఖర్ పీఏసీఎస్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. దీనికి సీఐ స్పందిస్తూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఖాతాదారులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కాగా ఈనెల 6న పీఏసీఎస్‌లో మరోసారి విచారణ నిర్వహించనున్నారు. విచారణ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక ఎస్సై డి. ఈశ్వరరావు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. -
నీడ కరువు
గరుగుబిల్లి: మండలంలోని సంతోషపురం పంచాయతీ పరిధి ఖడ్గవలస జంక్షన్లో పదేళ్ల కిందట నిర్మించిన బస్ షెల్టర్ శిథిలావస్థకు చేరింది. దీంతో ప్రయాణికులు ఆ జంక్షన్లో ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ షెల్టర్ ముందు స్థానిక వ్యాపారులు షాపులు నిర్వహిస్తున్నారు. దీంతో బస్‌షెల్టర్ ఎవరికీ కనిపించడం లేదు. ప్రయాణికులు వాహనాల కోసం వేచి ఉండేందుకు నీడ కరువు కావడంతో పాటు ఎక్కడా స్థలం లేకపోవడంతో దుకాణాల వద్ద నిల్చుంటున్నారు. షెల్టర్‌ను పునర్నిర్మించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా షెల్టర్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.