మినీ సామాజిక విప్లవం
గ్రంథం చెక్క
అనువాదాలతోను, అనుకరణలతోను ప్రారంభమైన నాటకసాహిత్యం తొలిరోజుల్లో కేవలం పాఠ్యంగా మాత్రమే ఉండేది. సమాజంలో ఆనాడు ఉన్న కట్టుబాట్లకు విరుద్ధంగా కొందరు సాహసికులు ఆ నాటకాలను రంగస్థలం మీద ప్రదర్శించడానికి పూనుకోవడం ఒక మినీ సామాజిక విప్లవం అని చెప్పవచ్చు. 1860-70 ప్రాంతాల్లో ఈ ఉద్యమం ప్రారంభమై అచిరకాలంలోనే అటు నటులను, ఇటు సామాజికులను కూడా ఆకట్టుకుంది.
ఆంగ్ల, సంస్కృత అనువాదాలతో పాటు పౌరాణిక, చారిత్రక నాటకాలు రాయడం ప్రారంభమైంది.
ప్రాంతీయ జానపద నాటకాల నుంచి కొంత, ఇంగ్లీష్ సంపర్కంతో 19వ శతాబ్దం చివరి దశకంలో భారతదేశానికి వచ్చిన ఆంగ్లనాటక బృందాల నుంచి కొంత అప్పు తెచ్చుకొని ప్రతి ప్రాంతీయ నాటకరంగం ఒక విధమైన సంగీత నాటకాన్ని పెంచుకుంది.
పార్శీ నాటకరంగం, దాని ప్రభావంతో పెరిగిన పలు ప్రాంతీయ నాటకరంగాలు ఇటువంటివే!
ఏదైనా వస్తువు జనాన్ని ఆకట్టుకుంటే దానిని ప్రజలకు అందించడానికి సిద్ధపడే వర్తకమ్మన్యులు తయారుగా ఉంటారు. అట్లా ఏర్పడ్డదే వ్యాపార నాటకరంగం.
ఎక్కడెక్కడ ఏ మంచి నటులున్నా ఒక చోట చేర్చి, వాళ్లకి నెలజీతాలు ఇచ్చి, ఎక్కడెక్కడ ఏ మంచి ‘ట్రిక్’ దొరికినా దానిని తమ నాటకంలో చొప్పించి మంచి ‘మసాలా’ నాటకాలను ప్రజలకు అందించిన ఘనత వీళ్లదే!
ఒకవైపు వ్యాపార నాటకరంగం, మరొకవైపు దానిలోని వ్యాపారతత్వాన్ని నిరాకరించి, విజయవంతంగా నాటకం ప్రదర్శించాలనే ధ్యేయంతో బయలుదేరిన వృత్తినాటకరంగం...రెండూ ప్రేక్షకుల మన్ననల్ని పొందాయి.
- గిరీశ్ కర్నాడ్ ‘నాగమండలం’ (తెలుగు అనువాదం) నాటకానికి మొదలి నాగభూషణ శర్మ రాసిన ముందుమాట నుంచి.