బుద్ధుని తపోభూమిలో...
గ్రంథం చెక్క
బోధిగయలో చాలా ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి. ప్రధాన మందిరంలో బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్లుగా కనిపించే విగ్రహం ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహాన్ని బంగారు, వెండి, మాణిక్యాలు, వైఢూర్యాలతో చెక్కిండ్రు. ఇక్కడ బుద్ధుని అవశేషాలు భద్రపరచిండ్రట. నిశ్చల సమాధిలో ఆసీనుడైన బుద్ధుని విగ్రహం ‘కోరికలే దుఃఖాలన్నిటికి మూలకారణం’ అని చెబుతున్నట్లుగా ఉంటుంది.
మందిరం వెనుక భాగంలో బోధి వృక్షముంది. ఈ వృక్షం క్రిందనే బుద్ధునికి జ్ఞానోదయం కలిగిందట. ఆ వృక్ష శాఖలనే అశోకచక్రవర్తి కుమార్తె సంఘమిత్ర శ్రీలంకలోని అనురాధపురంలో నాటిందట.
బుద్ధుని తపోభూమి అయిన బోధివృక్ష మూల స్థానాన్ని వజ్రాసనం అంటరు. మహాబోధి మందిరానికి ఉత్తరదిశగా ‘అనిమేషలోచన’ అనే స్తూపముంది. పేరుకు స్తూపమే కాని ఇది ఒక మందిరం. 55 అడుగుల ఎత్తున ఇటుకలతో కట్టిన ఈ మందిరం లోపల బుద్ధుని విగ్రహముంది.
బుద్ధగయలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేది ధ్యానముద్రలో ఉన్న భారీ బుద్ధ విగ్రహం. దీని ఎత్తు 80 అడుగులు. దేశంలోని బుద్ధ విగ్రహాలన్నిట్లోకి ఇది ఎత్తైది.
బోధి వృక్షం ఆ కాలం నాటిదే అంటరు గాని యథార్థం కాదనిపిస్తుంది. ఒకవేళ దాని అంటేమో!
చైనా, టిబెట్ భక్తులు బోధి వృక్షచ్ఛాయలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. బుద్ధుని ముందు ధ్యానంలో కూర్చున్న విదేశీ యువతిని చూస్తుంటే విగ్రహమేమోననిపించింది. అశోకుడు కట్టించిన రాతి గోడపై పాళీ భాషలో అతని పేరు చెక్కబడివుంది. జాతరలో చిల్లర కొట్లు వెలిసినట్లు బజారు నిండా పూసల దండలు, రుద్రాక్ష మాలలు, చిన్న చిన్న పటాలు అమ్మే దుకాణాలున్నయి.
- దేవులపల్లి కృష్ణమూర్తి ‘మా యాత్ర’ నుంచి.